’వాటర్ పాలిటిక్స్‘..ఎవరి కోసం
x

’వాటర్ పాలిటిక్స్‘..ఎవరి కోసం

విడిపోయి హాయిగా జీవిస్తున్న తెలుగు ప్రజల మధ్య ప్రభుత్వాలే విధ్వేషాలు రెచ్చగొడుతున్నాయి.


తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మళ్ళీ ముదిరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నిలిపివేతపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన 'గౌరవ' వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ నిప్పు రాజేశాయి. రేవంత్ వ్యాఖ్యలను పచ్చి అబద్ధాలుగా కొట్టిపారేసిన ఏపీ సర్కార్.. ప్రాజెక్టు ఆగడానికి కారణం 'గత ప్రభుత్వ పాపాలే'నంటూ అంటూ మాజీ సీఎం జగన్ పైకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఎదురుదాడికి దిగింది. ఈ క్రెడిట్ వార్ కాస్తా ఇప్పుడు రెండు ప్రాంతాల ప్రజల మధ్య భావోద్వేగ చిచ్చుగా మారుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల మధ్య అగాధాన్ని ఎందుకు పెంచుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

నా విన్నపమే.. బాబు గౌరవమే!

తెలంగాణ అసెంబ్లీలో 'నీళ్లు-నిజాలు' అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపడం తన రాజకీయ విజయంగా అభివర్ణించారు. "నేను కోరగానే చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేశారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే, మేము కూడా జూరాల నుంచి సమాంతరంగా నీటిని తరలిస్తామని హెచ్చరించాను. నాపై ఉన్న గౌరవంతో వారు వెనక్కి తగ్గారు" అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తాను ఎవరితోనైనా పోరాడతానని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెస్తానని ఆయన స్పష్టం చేశారు.

అంతా భ్రమ.. అసలు కారణం జగన్

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మాజీ సీఎం జగన్ హయాంలో ఎలాంటి పర్యావరణ, సాంకేతిక అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 2020లోనే తెలంగాణ ఫిర్యాదుతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) మరియు కేంద్ర ప్రభుత్వం ఈ పనులపై స్టే ఇచ్చాయి. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. "రేవంత్ రెడ్డి కోరడం వల్ల పనులు ఆగాయనడం హాస్యాస్పదం. జగన్ చేసిన తప్పిదాల వల్ల ఆగిన ప్రాజెక్టుకు ఇప్పుడు రేవంత్ క్రెడిట్ తీసుకోవడం ఏంటి?" అని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది.

వైసీపీ కౌంటర్: బాబు లొంగుబాటు రాజకీయం

మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలు ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబుపై అస్త్రంగా వాడుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ఆధారంగా చూపిస్తూ, "చంద్రబాబు రాయలసీమ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. రేవంత్ కోరగానే పనులు ఆపేయడం సీమ ప్రజలకు ద్రోహం చేయడమే" అని ఆరోపిస్తున్నారు. జగన్ హయాంలోనే ప్రాజెక్టుకు పునాది పడిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతకానితనం వల్ల అది ఆగిపోయిందని విమర్శిస్తున్నారు.

కేంద్రం..ఎన్జీటీ (NGT) పాత్ర

వాస్తవానికి ఈ ప్రాజెక్టు కేవలం నేతల మధ్య చర్చలతో ఆగలేదు. టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగింది. కృష్ణా బోర్డు (KRMB) అనుమతి లేకుండా 3 టీఎంసీల నీటిని తరలించడం నిబంధనలకు విరుద్ధమని కేంద్రం తేల్చింది. పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీ విధించిన జరిమానాలు, స్టే ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి.

విద్వేషాల చిచ్చు ఎందుకు?

ప్రాజెక్టుల పురోగతి కంటే రాజకీయ ప్రయోజనాలే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ క్రెడిట్ పాల్పడుతున్నారు. "నేను ఏపీ ప్రాజెక్టును ఆపాను" అని చెప్పుకోవడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన తెలంగాణ సెంటిమెంట్‌ను బలపరుచుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం "మేము హక్కులను వదులుకోలేదు.. జగన్ వల్లే ఆగిపోయింది" అని చెప్పుకుంటూ నిందను గత ప్రభుత్వంపైకి నెట్టేస్తోంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎంలు, మంత్రులు, నేతలు ఒకరినొకరు సవాల్ చేసుకోవడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల మధ్య, ముఖ్యంగా రైతుల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. నీటి పంపకాలు అనేవి చట్టబద్ధమైన కేటాయింపులపై ఆధారపడి ఉండాలి. కానీ, నేతల ‘గౌరవాలు’, ‘విజ్ఞప్తులు’ అనే మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయి.

Read More
Next Story