
పాస్టర్ ప్రవీణ్‌ను మతోన్మాదులు మట్టుబెట్టారా
ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు ఇప్పటికే స్పందించగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంత వరకు స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ పగడాలను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? మతోన్మాదులు చంపేసి ఉంటారా? లేక నిజంగానే ప్రమాదంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారా? అనే అంశాలు అటు ఆంధ్రప్రదేశ్‌లోను, ఇటు తెలంగాణలోను తీవ్ర ఉత్కంఠగా మారింది. ప్రమాద వశాత్తు చనిపోయారని తమ విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు చెబుతుండగా.. పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాద వశాత్తు చనిపోలేదని, మతోన్మాదులే మట్టుబెట్టారని క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మీద రెండు తెలుగు రాష్ట్రోల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రా పోలీసులు ఏమని నిర్థారిస్తారో అని తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తోన్నారు.
క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనం మీద సోమవారం రాత్రి బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కొంతమూరు వద్ద వస్తుండగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మర్టం జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శివారు ప్రాంతమైన కొంతమూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని, ఈ దుర్ఘటనలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించారని రాజానగరం సీఐ ఎస్ ప్రసన్న వీరయ్యగౌడ్ మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనం బుల్లెట్‌పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ అర్థర్రాతి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు, రహదారి పై నుంచి దిగువకు ప్రమాద వశాత్తు జారిపోయారని, ఈ ఘటనలో బుల్లెట్ ప్రవీణ్‌పై పడిపోవడం వల్ల అతనికి బలమైన గాయాలు అయ్యాయని, దీనిని మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎవరూ గమనించ లేదని, దీంతో ఆయన మరణించారని సీఐ చెప్పారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ, సంఘాలు దీని మీద స్పందించాయి. పెద్ద ఎత్తున రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదని, కావాలనే మతోన్మాదులు ఆయనను మట్టుబెట్టారని ఆరోపణలు గుప్పించారు. పాస్టర్ ప్రవీణ్ శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని, రాడ్డుతో కొట్టినట్లు కనిపిస్తోందని ఆరోపిస్తూ ఆందోళనలకు దిగారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనితలు దీనిపై స్పందించారు. దీనిపై నిగ్గు తేల్చాలని సీఎం చంద్రబాబు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాతో పాటు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌తోను సీఎం మాట్లాడి ఆరా తీశారు. అందుబాటులో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, అన్ని కోణాల్లో దీనిపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. ప్రవీణ్ హఠాన్మరణం దిగ్బ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పోలీసులు దీనిని ప్రమాదంగా తొలుత గుర్తించారని, తర్వాత వివిధ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఈ నేపథ్యంలొ పూర్తి స్థాయిలో దర్యాçప్తు చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
ఈ ఘటన మీద హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. లోతైన విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల కమిటీతో విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటన మీద ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేయిస్తోందన్నారు. రాజమండ్రిలో మృతదేహానికి పోస్టుమర్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఘటనను తాము కేవలం ప్రమాదంగానే పరిగణించడం లేదని, అన్ని కోణాల నుంచి విచారణ జరుగుతోందన్నారు. ఇది మతపరమైన అంశం కాబట్టి దీనిని రాజకీయం చేయడానికి చూడొద్దన్నారు. పాస్టర్ ప్రవీణ్‌ది అనుమానాస్పద మృతిగానే ఎఫ్‌ఐఆర్ చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న అన్ని కాల్ డేటా రికార్డింగ్‌లను, సీసీటీవీ ఫుటేజీలను కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. దర్యాప్తు విషయంలో అనుమానాలకు తావు లేకుండా చేస్తామన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం ఈ ఘటన మీద ఇంత వరకు స్పందించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ అంశంలో అప్పటికప్పుడు స్పందించే పవన్ కల్యాణ్ పాస్టర్ అనుమానాస్పద మరణం పట్ల ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు దళిత, క్రైస్తవ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.
Next Story