రోడ్లపై టీ తాగేవారికి హెచ్చరిక
నగరంలోని చాలా ప్రాంతాల్లో నకిలీ టీపొడిని టీ తయారుచేయటంలో ఉపయోగిస్తున్నారు. టీ బంకులు, టీ షాపులు, చిన్నపాటి హోటళ్ళల్లో నకిలీ టీపొడి ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
రోడ్లపైన టీ తాగేవారికి ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు ఒక హెచ్చరిక. అదేమిటంటే నగరంలోని చాలా ప్రాంతాల్లో నకిలీ టీపొడిని టీ తయారుచేయటంలో ఉపయోగిస్తున్నారు. టీ బంకులు, టీ షాపులు, చిన్నపాటి హోటళ్ళల్లో కొన్నింటిలో నకిలీ టీపొడిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. టీపొడిని వాడేవాళ్ళు తమకు తెలుసో, తెలియకో నకిలీ పొడిని వాడేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇప్పుడు విషయం ఏమిటంటే తమకు అందిన రహస్య సమాచారం ఆధారంగా సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక కంపెనీపై దాడిచేశారు. ఆ కంపెనీలో టన్నుల కొద్ది నకిలీ టీ పొడిని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.
సనత్ నగర్లోని ఫతేనగర్ కు చెందిన జగన్నాధ్ చాలాకాలంగా కోణార్క్ టీ పౌడర్ సేల్స్ అండ్ సప్లయర్స్ పేరుతో టీ పొడి వ్యాపారం చేస్తున్నాడు. జగన్నాధ్ చాలా ప్రాంతాలకు తన కంపెనీలో తయారయ్యే టీపొడిని సరఫరా చేస్తుంటాడు. అయితే ఎక్కడి నుండి పోలీసులకు సమాచారం అందిందో తెలీదు. రెండురోజులు నిఘావేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం ఉదయం కంపెనీపై దాడులుచేశారు. ఆ సమయంలో 300 కేజీల నకిలీ టీపొడి దొరికింది. ఈ టీపొడి నకిలీదని పోలీసులు ఎలా తేల్చారంటే ఆ కంపెనీలోనే ఎండిన కొబ్బరిచిప్పలు, రశాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ దొరికింది. సరఫరాకు సిద్ధంగా ఉంచిన 300 కేజీల నకిలీ టీపొడి, 200 కేజీల కొబ్బరిచిప్పల పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర మీడియాకు చెప్పారు.
తేలిగ్గా డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో జగన్నాధ్ చాలాకాలంగా జనాలను మోసంచేయటమే వృత్తిగా పెట్టుకున్నట్లు సుదీంద్ర చెప్పారు. మార్కెట్లో 80 రూపాయలకే చవకగా దొరికే టీ పొడిని కొని కొబ్బరిచిప్పల పొడి, రశాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ అందులో కలుపుతున్నట్లు కంపెనీకి పనిచేసే ప్రతాప్, పరాదాలకు జగన్నాధ్ ఇచ్చేవాడు. వాళ్ళు ఆ మొత్తాన్ని ప్యాకింగ్ చేసి రెగ్యులర్ గా ఇచ్చే దుకాణాలకు, టీ బంకులకు, తోపుడు బళ్ళకు కేజీ రు. 250కి సరఫరా చేసేవారని డీసీపీ చెప్పారు. చాలాకాలంగా తాము నకిలీ టీపొడిని తయారుచేసి అమ్ముతున్నట్లు ప్రతాప్ అంగీకరించినట్లు కూడా పోలీసులు చెప్పారు. కల్తీ టీపొడితో తయారుచేసిన టీని తాగటం వల్ల కేన్సర్, జాండీస్, కాలేయ సమస్యలు వస్తాయని డీసీపీ హెచ్చరించారు. రోడ్లపైన టీ తాగేవారు జాగ్రత్తగా ఉండాలని కూడా డీసీపీ సుదీంద్ర హెచ్చరించారు.