ఆంధ్రప్రదేశ్‌లో హస్టల్ విద్యార్థులకు సరైన న్యూట్రీషన్ ఆహారం అందటం లేదు. కారణం ప్రభుత్వ విధానాలు. బిసీ హాస్టళ్ల పరిస్థితిని పరిశీలిస్తే మరీ ఘోరంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఆరేళ్ల క్రితం 1,600 బిసీ హాస్టళ్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యార్థుల సంఖ్య తగ్గింది. హాస్టళ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన మెనూ, మెస్ చార్జీలు నేటికీ అమలులో ఉన్నాయి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదని విద్యార్థులు తల్లిదండ్రులు వ్యాఖ్యానిస్తున్నారు. చాలా మంది పేదలు తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పించి చదువు నేర్పించుకుంటున్నారు. పేదరికం వల్ల పిల్లలకు అన్నం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తే మంచి చదువుతో పాటు తినడానికి అన్నం, ఉండటానికి వసతి ఉంటుందని భావించి హాస్టళ్లలో చేర్పిస్తారు.
ఆరేళ్ల క్రిత 1,600 బీసీ హాస్టళ్లు...
ఆరేళ్ల క్రితం 1,600 బిసీ హాస్టళ్లు ఉంటే నేడు వాటి సంఖ్య 1,156కు దిగ జారింది. ఈ ఏడాది ఎన్ని మూత పడతాయో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఏడాదికి వంద హాస్టళ్ల వంతున మూతపడుతూ వచ్చాయి. ఎందుకు హాస్టళ్లు మూసి వేయాల్సి వస్తోంది. పిల్లల సంఖ్య ఎందుకు తగ్గిపోతోందనే అంశంపై అధ్యయనం చేసిన దాఖలాలు లేవు. చాలా మంది పిల్లలు కూలి పనులకు వెళుతున్నారు. హాస్టళ్లకు దగ్గరలో స్కూళ్లు ఉండటం లేదు. దీంతో ఒక హాస్టల్‌ను మరో హాస్టల్‌లో మెర్జ్ చేయడం మొదలు పెట్టారు. స్కూళ్లు ఎలా మెర్జ్ చేశారో హాస్టళ్లు కూడా అలా మెర్జ్ చేశారు. దీంతో చాలా మంది పిల్లలు హాస్టళ్ల నుంచి ఇంటికి వెళ్లి పోతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి హాస్టళ్లలో ఉండలేక, ఎక్కువ దూరం స్కూలుకు నడిచి వెళ్లలేక చదువు మానుకుంటున్నారు. హాస్టల్ డ్రాప్ అవుట్స్ పిల్లలు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మంది ఉన్నారనే వివరాలు కూడా ప్రభుత్వం వద్దలేవు.
పెరగని మెస్ చార్జీలు
ఆరేళ్ల క్రితం ఇచ్చిన మెస్‌చార్జీలే నేటికీ ఉన్నాయి. ఆరేళ్ల క్రిత కందిప్పు కిలో ధర రూ. 60లు ఉంటే ప్రస్తుతం కందిప్పు కిలో ధర రూ. 120లు ఉంది. సగానికి సగం సరుకుల ధరలు పెరిగినా పూర్వం ఇస్తున్న మెస్ చార్జీలే ఇవ్వడంపై విద్యార్థులు, వార్డెన్‌లు మండిపడుతున్నారు. నిజానికి ఆఫ్‌సెంట్ అయిన విద్యార్థుల అటెండెన్స్ వేస్తేనే కాని పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితి వార్డెన్‌లకు ఏర్పడింది.
11 నెలల నుంచి విడుదల కాని మెస్ చార్జీలు ఆంధ్రప్రదేశ్‌లో బీసీ హాస్టళ్లకు సంబంధించి మెస్ చార్జీలు 11 నెలల నుంచి ప్రభుత్వం విడుదల చేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చి మరో నెల అయింది. అంటే ఏడాది నుంచి మెస్ చార్జీల బిల్లులు ప్రభుత్వం ఇవ్వలేదు. సంవత్సర కాలంగా మెస్ జార్జీలు ఇవ్వకుండా సరుకులు వార్డెన్‌లు ఎలా కొనుగోలు చేస్తారనే జ్ఞానం కూడా ప్రభుత్వానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పచారీ షాపుల వాళ్లు ఒకటీ రెండు నెలలకు అయితే సరుకులు ఇస్తారు కానీ సంవత్సర కాలం అప్పు ఎలా ఇస్తారనేది ఆలోచించాల్సి ఉంది. గత ప్రభుత్వం 11 నెలల మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో వార్డెన్‌లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయారు.
పలు హాస్టళ్లు తనిఖీ చేసిన మంత్రి సవిత
రాష్ట్ర వ్యాప్తంగా 1156 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 252 పోస్టు మెట్రిక్ బీసీ హాస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టళ్లలో 92,387 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నారు. కొత్తగా అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్ సవిత నియమితులయ్యారు. ఈమె అనంతరపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి గెలిచారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పలు జిల్లాల్లోని హాస్టళ్లను తనిఖీ చేశారు. వార్డెన్‌లు పడుతున్న ఇబ్బందులు గమనించారు. మంత్రి సబిత బుధవారం ది ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ 11 నెలల నుంచి బీసీ హాస్టళ్లకు మెస్ చార్జీల బిల్లులు ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. సమీక్ష సమావేశాల్లో అధికారులు ఈ విషయం చెప్పారని, హాస్టళ్లు తనిఖీ చేసినప్పుడు ఆహాసరం సరిగా లేకపోవడాన్ని గమనించినట్లు చెప్పారు. సంవత్సర కాలంగా అప్పులు చేసి విద్యార్థులకు సరైన భోజనం పెట్టలేకపోతున్నామని వార్డెన్‌లు చెబుతున్నారన్నారు. తవ్వే కొద్ది గత ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని, త్వరలోనే బిల్లులు చెల్లించి హాస్టళ్ల నిర్వహణ మెరుగుపరుస్తామని చెప్పారు.