జగన్, షర్మిల మధ్య ముదిరిన ఆస్తుల యుద్ధం
x

జగన్, షర్మిల మధ్య ముదిరిన ఆస్తుల యుద్ధం

సొంత తల్లి, చెల్లిపైనే కేసులు పెట్టి నైతికంగా దిగజారి పోయారు. ఇప్పటికైనా మన తండ్రి వైఎస్‌ఆర్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకో.. జగన్‌కు షర్మిల ఘాటు లేఖ.


వైఎస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నన్ని రోజులు ఆ ఇంటి గుట్టు ఎవ్వరికి తెలిసేదే కాదు. అంతా కంబైన్డ్‌ ఫ్యామిలీ అనీ, వందల సంఖ్యలో కుటుంబ సభ్యులు ఉంటారని, అంతా కలిసి కట్టుగా ఉంటారని, ఒకే మాటకు కట్టుబడి ఉంటారని, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు ఆ కుటుంబం మారుపేరని అంతా చెప్పుకునే వారు. ఆయన మరణించిన తర్వాత కొన్ని సంవత్సరాలు అంతా అలానే సాగింది. జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఒకే మాట మీదనే ఉండేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీన్‌ మారి పోయింది. కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. 2024 ఎన్నికల నాటికి తారా స్థాయికి చేరుకున్నాయి.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు, తర్వాత ఎన్నికల్లో రోడ్డుకెక్కిన కుటుంబ గొడవలు, తాజాగా ఆస్తుల విషయంలో జగన్‌ కోర్టు మెట్లెక్కడంతో మరో సారి రచ్చగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరువురు లేఖలు రాసుకోవడం, అవి మీడియాకెక్కడంతో రాష్ట్ర వ్యాప్త చర్చకు దారి తీశాయి. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు.
ప్రియమైన జగన్‌ అన్నా అంటూ ప్రారంభిస్తూనే, ఆస్తులకు సంబంధించి జగన్‌కు షర్మిల ఘాటుగానే లేఖ రాశారు. తండ్రి వైఎస్‌ఆర్‌ ఆదేశాలను, అభిమతాన్ని గాలికి వదిలేశారని, నైతికంగా దిగజారిపోయారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ తండ్రి వైఎస్‌ఆర్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని, తమ మధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్టు ఆమె లేఖలో పేర్కొన్నారు. నిలబెట్టుకోని పక్షంలో తమ హక్కుల్ని కాపాడుకునేందుకు చట్టపరంగా ఉన్న మార్గాలను ఎంచుకుంటానని స్పష్టం చేశారు.
తండ్రి రాజశేఖరరెడ్డి తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులన్నీ నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా చెందాలని ఆదేశించిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. అప్పట్లోనే తండ్రి ఆదేశాలను మీరు అంగీకరించారు. తండ్రి మరణించాక హామీని గంగలో కలిపారు. భారతి సిమెంట్స్, సాక్షి పత్రికలతోపాటు తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా చెందాలని తండ్రి ఆదేశించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మన మధ్య జరిగిన చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలకు తల్లి విజయమ్మే సాక్షి అని తెలిపారు. తోడబుట్టిన అన్నయ్యతో వివాదం ఇష్టం లేక ఆస్తిలో సమానవాటా పొందేందుకు నాకున్న హక్కును వదులుకునేందుకు అంగీకరించానని తెలిపారు. ఆగస్టు 31, 2019లో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు కూడా మీకు మనసు రావడం లేదని ఆవేదన చెందారు. సొంత చెల్లెలు, పిల్లలకు చెందాల్సిన ఆస్తుల్ని దక్కకుండా చేసేందుకు సొంత తల్లిపైనే కేసు పెట్టే స్థాయికి దిగజారారని విమర్శించారు. తండి వైఎస్‌ఆర్‌ ఎప్పుడూ కలలో కూడా ఊహించని పని చేశారని జగన్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ తండ్రి వైఎస్‌ఆర్‌ ఎంతో ప్రేమగా చూసుకున్న భార్య, కుమార్తెపై కేసులు పెట్టారని, తన రాజకీయ జీవితం తన ఇష్టమని పేర్కొన్నారు. ఆ షేర్లను వదులుకోవడానికి అంగీకరించిన తర్వాత ఇప్పుడు మీరు అనవసర వివాదాలు లేవనెత్తుతూ కుటుంబాన్ని రచ్చకీడ్చడం పద్ధతి కాదని షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు.
Read More
Next Story