యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2 రిలీజ్ సందర్భంగా అనంతపురం అర్భన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా బైటకు వచ్చిన ఆడియో కలకలం రేపింది. జూనియర్ ఎన్టీఆర్ ను దుర్భాషలాడుతూ వున్న ఆ ఆడియోపై ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమన్నారు.ఈ ఉదయం అనంతపురంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్,ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు భారీగా వచ్చిన జూనియర్ ఫ్యాన్స్, ఎమ్మెల్యే దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే కార్యాలయంలో లేరంటూ అక్కడి సిబ్బంది సర్థిచెప్పే ప్రయత్నం చేసారు.దాంతో ఆగ్రహించిన ఫాన్స్ ,ఎమ్మెల్యే పోస్టర్లను చించి వేశారు.పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు జోక్యం చేసుకొని అదుపు చేశారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అక్కడి నుంచీ పంపించి వేశారు.
'ఆ ఆడియో నాది కాదు'-ఎమ్మెల్యే వివరణ
జూ. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. 'ఆ ఆడియో కాల్స్ నావి కాదు,అంతా బోగస్' అని ప్రసాద్ అన్నారు. ఫేక్ ఆడియో కాల్స్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.
'నేను తొలి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని. జూ. ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా. నా ప్రమేయం లేకున్నా నాపేరు ప్రస్తావించారు.కాబట్టి క్షమాపణలు. ఆడియో కాల్స్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశా' అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఈ వివాదానికి సంబంధించి తన వివరణను ఆయన వీడియో రూపంలో తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు.ఎవరో కావాలని, తనమీద రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తనపై గిట్టని వారెవరూ ఉద్దేశపూర్వకంగా AI ద్వారా క్రియేట్ చేసిన ఆడియో ఫైల్ అని చెప్పుకొచ్చారు.
అసలు ఏమి జరిగింది..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2 చిత్రాన్ని తెలుగులోనూ గ్రాండ్ గా విడుదల చేసిన సమయంలో సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినట్టు ఒక ఆడియో బైటకు వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జూనియర్ ఎన్టీఆర్ ను దారుణంగా దూషించిన ఆడియో ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.ఏకంగా పచ్చి బూతులు మాట్లాడుతుండటం ఎన్టీఆర్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇక వార్ 2 కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడినట్టు ఆడియో ద్వారా తెలుస్తోంది. వార్ 2 షోలను నిలిపివేయాలని, ఇక్కడ వార్ 2 సినిమా ప్రదర్శనకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిపై విరుచు ఎమ్మెల్యే విరుచుకు పడినట్లుగా ఆ ఆడియో వుంది. అస్సలు ఇక్కడ వార్ 2 చిత్రం ఆడదు. ఆడనివ్వం అంటూ ఆడియోలో ఉన్న సారాంశం. ఇక ఎన్టీఆర్ పై వ్యక్తిగతంగానూ, అటు రాజకీయ పరంగానూ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు.అధికార పక్షం అండదండలతోనే సదరు ఎమ్మెల్యే అలాంటి దారుణమైన మాటలు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం అధినాయకులకు , జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య కొంత కాలంగా గ్యాప్ నడుస్తోంది. తెలుగుదేశం కార్యక్రమాలకూ , నందమూరి బాలకృష్టకు కూడా జూనియర్ దూరంగానే వుంటున్నారు. ఈ నేపధ్యంలో సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ను దూషిస్తూ మాట్లాడినట్లు బైటకు వచ్చిన ఆడియో తీవ్ర దుమారాన్నే లేపింది.కూటమి ప్రభుత్వ పెద్దల అండ లేకుంటే ఆ ఎమ్మెల్యే అంతటి సాహం చేయబోరన్న చర్చ సాగుతోంది.అయితే అదంతా ఫేక్ ఆడియోఅని అది AI జనరేటెడ్ అంటూ ,తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇక ఈ ఆడియో వ్యవహారం ఇంతటితో ఆగుతుందా? లేదా? చూడాలి.మరోవైపు వార్ 2 సినిమా విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏపీ సీఎం నారా చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు.ఈ తరుణంలో ఎవరు ఈ వివాదాన్ని సృష్టించారన్నది తేలాల్సివుంది.