వాంటెడ్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ అరెస్టు
x

వాంటెడ్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ అరెస్టు

జైలు నుంచి వచ్చే డైరెక్షన్స్‌ మేరకు చాకచక్యంగా కార్యకలాపాలు సాగించడంలో ఇతన సిద్ధహస్తుడు.


ఆంధ్రప్రదేశ్‌ పోలీసులను, ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్టు అధికారులను ముప్పుతిప్పలు పెడుతూ, కళ్లుగప్పి తిరుగుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ నాగదస్తగిరిరెడ్డిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. గత సంత్సర కాలంగా నాగదస్తగిరిరెడ్డి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సవాల్‌గా మారాడు. అతని గురించి గాలింపులు చేపట్టినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న దస్తగిరిరెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం దంగలను ఢిల్లీకి అక్రమ రవాణా చేస్తుండగా నాగదస్తగిరిరెడ్డికి సంబంధించిన కరుడు గట్టిన ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు.

పక్కా సమాచారం అందుకున్న పోలీసులు లంకమల్ల అటవీ ప్రాంతంలో కాపు కాచి పట్టుకున్నారు. నాగదస్తగిరితో పాటు అతని ముఠాలోని మరో ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ దస్తగిరిరెడ్డి, అతని ముఠా నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనంను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు టన్నుకుపైగా ఎర్రచందనం దుంగలు, రెండు ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగదస్తగిరిరెడ్డి భార్య లాలుబీని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న లాలుబీని రిమాండ్‌కు తరలించారు.

అయితే ఈ ముఠాకు జైలు నుంచే డైరెక్షన్స్‌ ఉంటాయి. ఆ డైరెక్షన్ల మేరకే ఎవరి కంట పడకుండా కార్యకలాపాలు సాగిస్తుంటారు. జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న లాలా భాషా, ఫక్రూద్దీన్‌లు ఈ ముఠాకు డైరెక్షన్లు ఇస్తుంటారని కడప జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం పట్టుబడిన నాగదస్తగిరి అనే మోస్ట్‌ వాంటెడ్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ మీద ఇప్పటి వరకు 86 ఎర్రచందనం కేసులు, 34 దొంగతనం కేసులు, మరో మూడు పీడీ యాక్టు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
Read More
Next Story