
మీడియాతో మాట్లాడుతున్న డీఆర్‌ఎం లలిత్ బోహ్రా
‘వాల్తేరు’కు ఆదాయం.. అధిక లోడింగ్‌లో ఐదోస్థానం!
విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్ 2025 సంవత్సరంలో గణనీయమైన పురోగతిని సాధించింది.
భారతీయ రైల్వేలో వాల్తేరు డివిజన్ ఈ ఏడాది చెప్పుకోదగిన ప్రగతిని సముపార్జించింది. ఆదాయాన్ని ఆర్జించే డివిజన్లలో ఐదో స్థానాన్ని, భారతీయ రైల్వేలో ఐదో అత్యధిక లోడింగ్ డివిజన్ స్థానాన్ని సాధించింది. అలాగే ఇండియన్ రైల్వేస్‌లో అనేక వినూత్న ప్రయాణికుల సౌకర్యాల కల్పనలోనూ రికార్డును సొంతం చేసుకుంది. 2025 సంవత్సరంలో డివిజన్ సాధించిన వార్షిక పురోగతిని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) లలిత్ బోహ్రా విశాఖలోని తన కార్యాలయంలో బుధవారం మీడియాకు వివరించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
వాల్తేరు డివిజన్ గణనీయమైన ప్రగతి..
‘మా వాల్తేరు డివిజన్.. ప్రయాణికుల సౌలభ్యం, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, భద్రత, సరకు రవాణా పనితీరు, స్థిరత్వం, సామాజిక కార్యక్రమాల్లో గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. డివిజన్ పరిధిలో కనెక్టివిటీని విస్తరించడంతో పాటు సౌకర్యాలను మెరుగు పరిచాం, కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేశాం. విశాఖపట్నం–సికింద్రాబాద్‌ల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 20కి పెంచాం. మహా కుంభమేళా, రథయాత్రలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జనసాధారణ్, స్పెషల్, పండుగ స్పెషల్ ప్రత్యేక రైళ్లను నడిపాం. పర్యాటక ప్రాంతం అరకుకు ఎల్‌హెచ్‌బీ విస్టాడోమ్, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లను ప్రవేశపెట్టాం. ఇంకా మెరుగైన భద్రత కోసం 23 ప్రారంభ రైళ్లను ఎల్‌హెచ్‌బీ రేక్‌లుగా మార్చాం. ఈ ఏడాది వాల్తేరు డివిజన్‌లో మొత్తం 506 ప్రత్యేక రైళ్లను నడిపాం. అంతేకాదు.. ర ద్దీ సీజన్లలో మరో 1803 రైళ్లను నడిపాం. రిజర్వేషన్ లేని ప్రయాణికుల కోసం అదనపు బోగీలను ఏర్పాటు చేశాం.
‘అమృత్ భారత్’ ను ప్రవేశపెట్టాం..
ఈ ఏడాది కొత్తగా అమృత్ భారత్ రైలును ప్రవేశపెట్టాం. బ్రహ్మపూర్ (బరంపురం)– ఉధ్నాల మధ్య నడిచే ఈ రైలు ఫ్రీక్వెన్సీని వారానికి మూడు సార్లు తిరిగేలా పెంచాం. అలాగే యూటీఎస్ మొబైల్ యాప్ వినియోగం, క్యూఆర్ ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించడానికి డిజిటల్ టికెటింగ్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. దివ్యాంగజనుల సంరక్షణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. డివిజన్ అంతటా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 2,800 మందికి పైగా పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు.. కొత్త ప్రాజెక్టులు..
మార్చి 2025 నాటికి కీలక విభాగాలను రెట్టింపు చేయడమే గాక 360 కి.మీలకు పైగా డబుల్ లైన్‌ను ప్రారంభించడం ద్వారా ప్రధాన రైలు మౌలిక సదుపాయాల పనులను వేగంగా చేయగలిగాం. నాలుగో లైన్, రైల్ ఫ్లై ఓవర్లు, స్టేషన్ అప్‌గ్రేడ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్‌ఫారాల పనులు వేగం పుంజుకున్నాయి. ఈ డివిజన్‌లో రూ.1,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి.
అధిక లోడింగ్.. ఆదాయంలోనూ రికార్డు..
వాల్తేరు డివిజన్ సరకు రవాణాలో సరికొత్త రికార్డును సాధించింది. కేవలం 230 రోజుల్లో 50 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసి ఈ రికార్డును సొంతం చేసుకుంది. నవంబర్ 2025 వరకు 73.5 మిలియన్ టన్నుల లోడింగ్‌తో రూ.9,030 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇలా అటు అత్యధిక లోడింగ్‌లోను, ఇటు ఆదాయ ఆర్జనలోనూ వాల్తేరు డివిజన్ భారతీయ రైల్వేలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ప్రయాణికుల రద్దీ 30.58 మిలియన్లకు పెరిగింది. ఇది 10 శాతం వృద్ధిని నమోదు చేసింది.
లోకో బ్యూటీ కాంటెస్ట్‌తో జాతీయ గుర్తింపు..
వాల్తేరు డివిజన్ ఐదు జోనల్ స్థాయి ఎఫిషియెన్సీ షీల్డ్‌లను, ఒక ప్లాటినం రేటెడ్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికెట్‌తో పాటు ఎలక్ట్రికల్ లోకో బ్యూటీ కాంటెస్ట్‌తో విశాఖపట్నం జాతీయ గుర్తింపు పొందింది. ఇంకా మొదటి కవచ్ లోకోమోటివ్‌ను డివిజన్‌లో ప్రారంభించాం. విశాఖపట్నం స్టేషన్ 4 స్టార్ ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ పొందింది. విశాఖ స్టేషన్లో స్లీపింగ్ పాడ్‌లు, ఎంపిక చేసిన స్టేషన్లలో ప్రీ–పెయిడ్ ఆటో సేవలు, రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం కింద 20 శాతం చార్జీల తగ్గింపు వంటివి అందుబాటులోకి తెచ్చాం.
15 స్టేషన్లలో అమృత్ భారత్ పనులు..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద డివిజన్‌లో 15 స్టేషన్లలో పనులు చేపట్టాం. ఆయా స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, షెల్టర్లు, ప్లాట్‌ఫారాలు, సబ్‌బేలు వంటి పనులు జరుగుతున్నాయి. పర్లాకిమిడి స్టేషన్ పనులు పూర్తి కాగా దువ్వాడ, సింహాచలం, జగదల్‌పూర్, జైపూర్ స్టేషన్లలో పనులు త్వరలో పూర్తవుతాయి. విజయనగరంలో కొత్త ఔట్‌సోర్స్ రన్నింగ్ రూమ్, డివిజనల్ రైల్వే హాస్పిటల్‌లో డయాలసిస్, స్టెరిలైజేషన్, ఫిజియోథెరపీ సదుపాయాలను మెరుగు పరిచాం’ అని డీఆర్‌ఎం లలిత్ బోహ్రా వివరించారు.
Next Story

