2019లో కంటే 2024లో తగ్గిన పోలింగ్ శాతం
x

2019లో కంటే 2024లో తగ్గిన పోలింగ్ శాతం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి హోరాహోరిగా సాగిన పోలింగ్ ముగిసింది. ఏపీలో మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న (సోమవారం) ఓటింగ్‌ జరిగింది


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి హోరాహోరిగా సాగిన పోలింగ్ ముగిసింది. ఏపీలో మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న (సోమవారం) ఓటింగ్‌ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.04శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం క్యూలో ఉన్న వారికి కూడా ఓటు వేసే అవకాశం ఇచ్చినందున ఈ శాతం 70 వరకు చేరవచ్చునని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు.

సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే.. ఏపీలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఇంకా బారులు తీరడంతో, వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. గడువు ముగిసినప్పటికీ.. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేయడానికి ఛాన్స్ ఇచ్చారు. అక్కడక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి రెండు చోట్ల గాల్లోకి కాల్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం పడినా.. లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు విశేషంగా తరలివచ్చారు.

ఏపీ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో అత్యధికంగా చిత్తూరులో 74.06శాతం, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 55.17శాతం పోలింగ్‌ నమోదైంది. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందన్నారు. ఉదయం 7గంటల నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్‌ బూత్‌లకు తరలి వచ్చి ఓట్లు వేశారన్నారు. ‘సాయంత్రం 5 గంటలైనా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉండడం హర్షణీయం అన్నారు చంద్రబాబు.

మాచర్ల, నరసరావుపేట వంటి చోట్ల ఘర్షణలు జరిగాయి. తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై వైసీపీకి చెందిన వారు దాడులు జరిపారు. నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు వాహనాలపై కొందరు దుండగులు దాడులకు దిగారు. తెనాలి ఎమ్మెల్యే ఓ ఓటరుపై చేయి చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలోనూ స్వల్ప సంఘటనలు జరిగాయి.

2019 ఎన్నికలతో పోల్చి చూసినపుడు 2024 ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గినట్టే చెప్పాలి. గత ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పుడు అంత జరుగుతుందా అనే అనుమానం నెలకొంది. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్‌లో ఉండే ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు తమ తీర్పును ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం.. కనీస హక్కులతో కూడిన గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.13 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 2.71 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1.30 కోట్లకు పైగా పురుష ఓటర్లు - 64.28%- ఉండగా.. 1.40 కోట్లకు పైగా మహిళలు- 66.84%- పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. పురుషులతో పోలిస్తే.. మహిళలే చురుగ్గా ఈ పోలింగ్‌లో పాల్గొన్నట్టు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే, ఏపీలో మహిళా ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కి హాజరుకావడంపై రాష్ట్రంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. మహిళల ఓటింగ్ ఎవరికి లాభం అనే దానిపై పందాలు కాస్తున్నారు.

Read More
Next Story