
వీఎల్‌జీసీ శివాలిక్ షిప్ విశాఖ వచ్చేస్తోంది..
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల కొనుగోలు చేసిన అతి పెద్ద గ్యాస్ క్యారియర్ నౌక (వీఎల్‌జీసీ) శివాలిక్ దేశంలోనే తొలిసారిగా విశాఖ పోర్టుకు వస్తోంది.
మధ్య ప్రాచ్యం నుంచి భారతదేశానికి ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి వీఎల్‌జీసీ (వెరీ లార్జ్ గ్యాస్ కారియర్) నౌక ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం దక్షిణ కొరియాలో నిర్మించిన ఈ నౌకను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) సెప్టెంబర్ 10న కొనుగోలు చేసి తన ఫ్లీట్‌లో చేర్చుకుంది. దీని పొడవు 225 మీటర్లు. వెడల్పు 36 మీటర్లు. 82 వేల క్యూబిక్ మీటర్ల కార్గోను రవాణా చేసే సామర్థ్యం ఈ నౌకకు ఉంది. దీనికి హిమాలయాల్లోని శివాలిక్ పర్వత శ్రేణిలో ఒకటైన శివాలిక్ అనే పేరును పెట్టారు. ఎస్‌సీఐ తన ఫ్లీట్‌లో చేర్చుకున్నాక తొలిసారిగా సోమవారం విశాఖ పోర్టుకు వస్తోంది. ఈ శివాలిక్ నౌక భారత్‌కు పర్షియన్ గల్ఫ్ నుంచి ఎల్పీజీ వంటి కీలక ఇంధన సరఫరాలను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది దేశ ఇందన భద్రతను మరింతగా పెంపొందించడానికి సహాయ పడుతుంది.