
ఏ క్షణానైనా మోగనున్న విశాఖ కార్మిక సమ్మె సైరన్..!
గతంలో నాలుగు వేల మంది తొలగింపు. ఆందోళనతో వెనక్కి తగ్గిన యాజమాన్యం. తాజాగా 950 మందికి ఉద్వాసన. ఈనెల 11 తర్వాత సమ్మెకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు.
కొద్ది రోజులుగా ఒకింత స్తబ్దుగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇప్పడు మళ్లీ అలజడి రేగుతోంది. యాజమాన్యం ఉన్నట్టుండి మళ్లీ కాంట్రాక్టు కార్మికుల మెడపై కత్తిని వేలాడదీస్తోంది. తాజాగా 950 మంది కార్మికులను ఉన్నపళంగా తొలగించడంతో ఇప్పుడు కొత్త ఆందోళనకు తెరలేచింది.
నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం (వైజాగ్ స్టీల్ ప్లాంటు) ను ప్రయివేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ప్లాంటు కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రయివేటీకరణ చేయవద్దని, సొంత గనులు కేటాయించాలని, ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలని పోరెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా ప్రయివేటీకరణకే కట్టుబడి ముందుకు వెళ్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్రయివేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ, జనసేన నేతలు ఆ తర్వాత స్వరం మారుస్తూ వచ్చారు. ఈ ప్లాంటు పరిరక్షణకే కట్టుబడి ఉన్నామని చెబుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం ట్విస్టుల మీద ట్విస్టులిస్తోంది. ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించకుండానే మెలికలు పెడుతోంది.
తొలి వేటు నాలుగు వేల మందిపై..
ఇంతలో నాలుగు నెలల క్రితం ఈ ప్లాంటులో పని చేస్తున్న నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను ఒక్కసారిగా యాజమాన్యం తొలగించింది. ఊహించని ఈ పరిణామానికి కాంట్రాక్టు కార్మికులతో పాటు కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ పరిణామాలతో ప్రయివేటీకరణ జరగదని చెబుతున్న కూటమి నేతలు ఇరుకున పడ్డారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రులపై ఒత్తిడి పెంచారు. దీంతో కొద్ది రోజుల అనంతరం తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది.
జనవరిలో ప్యాకేజీ ప్రకటన..
ఇలావుండగా జనవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంటుకు రూ.11,400 కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీని ప్రకటించింది. దీంతో ఈ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగిపోయినట్టేనని కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హడావుడి చేశారు. సంబరాలు, సన్మానాలు చేసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అలాంటి ప్రకటనేమీ చేయలేదు. ఈ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుటున్నట్టు ప్రకటించలేదు. మరోవైపు అదే సమయంలో ఈ ఉక్కు కర్మాగారంలో పని చేసే రెగ్యులర్ కార్మికులు, ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ ఎస్)కు అనుమతినిస్తూ జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి స్పందించి 1,613 మంది వీఆర్ ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,140 మందిని అర్హులుగా తేల్చారు. మరో 87 మంది వీఆర్ ఎస్‌కు అర్హులే అయినప్పటికీ వారి సేవలు తమకు అవసరమని సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు ఉక్కు యాజమాన్యానికి తెలియజేశారు. దీంతో మిగిలిన అర్హులు త్వరలో వీఆర్ ఎస్ తీసుకోనున్నారు.
తాజాగా 950 మంది కాంట్రాక్టు కార్మికులకు ఉద్వాసన
విశాఖ ఉక్కకు కర్మాగారంలో దాదాపు 16 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో కొద్ది నెలల క్రితం ఉక్కు యాజమాన్యం నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించింది. పెద్ద ఎత్తున ఆందోళనల తర్వాత మళ్లీ వారిని విధుల్లోకి తీసుకుంది. అప్పట్నుంచి ఇక వారి జోలికి వెళ్లలేదు. దీంతో ఈ కాంట్రాక్టు కార్మికులు ఒకింత నిబ్బరంగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మళ్లీ 950 మందిని విధులకు రాకుండా అడ్డుకుంది. వీరి తొలగింపు విషయాన్ని సంబంధిత కాంట్రాక్టరుకు గాని, విభాగాధిపతులకు గాని తెలియదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ముందురోజు విధులు నిర్వహించిన వారు మర్నాడు డ్యూటీకి వెళ్తే బయోమెట్రిక్‌లో పేరు లేకపోవడం చూసి ఖిన్నులయ్యారు. దీనిపై ఆరా తీస్తే తొలగింపు విషయం బయట పడింది.
ఈ హఠాత్పరిణామానికి ఉలిక్కి పడిన ఉక్కు కాంట్రాక్టు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు మరోసారి ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గాజువాకలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు స్టీల్ ప్లాంటు పరిధిలో ఉన్న గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరవుతున్నట్టు సమాచారం ఇచ్చారు. ఆయన కోసం ఎదురు చూసినా ఆయన ముఖం చాటేశారు. తమకు ఏం సమాధానం చెప్పాలో తెలియకే ఆయన డుమ్మా కొట్టారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
దశల వారీగా తొలగిస్తారా?
ఉక్కు కాంట్రాక్టు కార్మికులను దశల వారీగా తొలగిస్తారన్న భయం వీరిలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 16 వేల మంది కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను 10 వేలకు తగ్గించే చర్యల్లో భాగమే ఇదని ఈ కార్మికులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ షరతుల్లో రెగ్యులర్ కార్మికులు, ఉద్యోగుల వీఆర్ ఎస్ తో పాటు దశల వారీగా కాంట్రాక్టు కార్మికుల తగ్గింపు కూడా ఒకటని అంటున్నారు. ఒకేసారి తొలగిస్తే కార్మిక వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో కొద్ది కొద్దిగా తొలగిస్తున్నారని కార్మిక నాయకులు పేర్కొంటున్నారు.
కార్మికులను తొలగిస్తే ఉత్పత్తి ఎలా సాధ్యం?
వైజాగ్ స్టీల్ ప్లాంటులో కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను తగ్గించుకుంటూ పోతే నిర్దేశిత లక్ష్యం మేరకు ఉక్కు ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుంది? ప్రస్తుతం రోజుకు 14 వేల టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతోంది. దీనిని ఈ ఏడాది డిసెంబరు నాటికి 20 వేల టన్నులకు పెంచాలన్నది లక్ష్యం. మ్యాన్ పవర్ లేకుండా ఉత్పత్తి పెంపు ఎలా సాధ్యం? ప్యాకేజీలో భాగంగానే రెగ్యులర్ కార్మికుల వీఆర్ ఎస్, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయం యాజమాన్యం దుర్మార్గపు చర్య. దీనిని తీవ్రంగా నిరసిస్తున్నాం. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునే దాకా ఆందోళన కొనసాగిస్తాం. వారికి అండగా నిలుస్తాం అని విశాఖ స్టీల్ ప్లాంటు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి * ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్* ప్రతినిధికి చెప్పారు.
11 తర్వాత సమ్మెకు సై..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చర్యలు నిలిపివేయకపోతే ఈనెల 11న గాని, ఆ తర్వాత నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ కార్మికుల తొలగింపుపై కార్మిక సంఘాల నేతలు లేబర్ అధికారులను కలిసి విన్నవించారు. నేడో రేపో మరోసారి సమావేశం కానున్నారు. దీనిపై ఉక్కు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి కార్మిక వర్గాల్లో నెలకొంది.