‘విశాఖ ఉక్కు పై తగ్గేదేలే!
x

‘విశాఖ ఉక్కు' పై తగ్గేదేలే!

ప్రైవేటీకరణ తప్పదని మరోసారి స్పష్టం చేసిన కేంద్రం. లేదంటే ఇలాంటి వాటిని మూసేయాల్సిందేనన్న కేంద్రమంత్రి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుకి లేఖ.


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

అంతా భయపడుతున్నట్టే జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తగ్గేదేలే అంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కుండ బద్దలు కొట్టేసింది. ఇన్నాళ్లూ మిణుకుమిణుకుమంటూ ఉన్న కొద్దిపాటి ఆశను కూడా తుంచేసింది. దీంతో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానీయబోమంటూ కొన్నాళ్లుగా కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలపై నమ్మకం సడలిపోతోంది. కేంద్రం మొండి వైఖరితో ఈ ఉక్కు కర్మాగారం కార్మికుల్లో ఆగ్రహం ఉక్కు ద్రవంలా సలసలా కాగుతోంది. ఉక్కు కర్మాగారంలో నూరు శాతం ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకుని ప్రైవేటు సంస్థలకు విక్రయిస్తామని కేంద్రం మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఊహించని ఈ ఉత్పాతానికి విశాఖ వాసులతో పాటు ఉక్కు కర్మాగారం కార్మికులు ఉలికిపాటుకు గురయ్యారు. అప్పట్నుంచి ఈ ప్లాంటు కార్మికులు, వామపక్షాల నాయకుల మద్దతుతో వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలు తమ రాజకీయ అవసరాన్ని బట్టి వీరికి మద్దతును ప్రకటించాయి. అంతేతప్ప వామపక్షాల మాదిరిగా పూర్తి స్థాయిలో రోడ్డెక్కిన దాఖలాల్లేవు. పైగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్

ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై వైసీపీ ఒత్తిడి తీసుకురావడం లేదని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకే తాము కట్టుబడి ఉన్నామని వైసీపీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి మారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రతిపక్ష పాత్ర(?)లో కూర్చుంది. గతంలో టీడీపీ చేసిన ఆరోపణలనే ఇప్పుడు వైసీపీ కూడా చేస్తోంది. అయితే తాము విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నామని కొన్నాళ్లుగా కూటమి నాయకులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఢిల్లీలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై కీలక పరిణామాలు జరుగుతున్నప్పుడల్లా వీరు మీడియా ముందుకొస్తున్నారు.

ఆ ఇద్దరూ మౌనమేల?

కీలకమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు గాని, బీజేపీతో టీడీపీ పొత్తు తనవల్లే సాధ్యమైందని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాని ఉక్కు ప్రైవేటీకరణపై నోరు మెదపడం లేదంటూ విశాఖ వాసులు వేలెత్తి చూపుతున్నారు. అధికారంలోకి రాకముందు పవన్ కల్యాణ్ ఈ ప్లాంట్కు వచ్చి కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నట్టు చంద్రబాబు, పవన్లు ఉన్నారని ఉక్కు కార్మికులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఏమాత్రం ప్రభావితం చేయలేని ఆ పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నాయకులే ప్రైవేటీకరణ జరగదంటూ కొన్ని రోజులుగా తమ చెవుల్లో పూలు పెడుతున్నారంటూ వీరు విమర్శిస్తున్నారు. కేంద్ర మంత్రి తాజా ప్రకటన నేపథ్యంలో విశాఖలోని కొన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

తాజాగా బాంబు పేల్చిన కేంద్రమంత్రి..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు ఈనెల 8న రాజ్యసభలో ప్రశ్నను లేవనెత్తారు. దానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఈనెల 10న సమాధానమిచ్చారు. 'రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎఎన్ఎల్-విశాఖ ఉక్కు)లో ప్రభుత్వం తన పెట్టుబడులను శత శాతం ఉపసంహరించుకుని ప్రైవేటీకరణ చేయాలని 2021 జనవరిలోనే నిర్ణయించింది. ఆ మేరకు వ్యూహాత్మకేతర రంగంలో ఉన్న ఉక్కు సంస్థలను సాధ్యమైతే ప్రైవేటీకరణకు వీలు కల్పిస్తాం. లేనిపక్షంలో మూసివేతే మార్గం.' అని స్పష్టం చేశారు. దీనిని బట్టి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టమైంది.

వారి మాటలకు అర్థం లేదు..

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగబోదని సాక్షాత్తూ కేంద్రమంత్రి పంకజ్ చౌదరి నాకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూటమి నేతలు చెబుతున్న మాటలకు అర్థం లేదు. వారివన్నీ పచ్చి అబద్ధాలేనని, వీరు ప్రజలను, ఉక్కు కార్మికులను మోసం చేస్తున్నారని తేలిపోయింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు మౌనం వీడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రకటన చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేకపోతే టీడీపీ, జనసేనలు ఎన్డీయే నుంచి బయటకు రావాలి. విశాఖ ఉక్కు కోసం పార్టీలకతీతంగా మేం మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం' అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.




ఉద్యమాన్ని కొనసాగిస్తాం..

'విశాఖ స్టీల్స్టాంట్ సుదీర్ఘ పోరాటం, 32 మంది బలిదానాల ఫలితంగా వచ్చింది. ఈ ఫ్యాక్టరీ కోసం 16 వేల మంది నిర్వాసితులయ్యారు. ఏపీలో ఏకైక అతిపెద్ద కర్మాగారం ఇదే. దేశంలో అధునాతన యంత్ర పరికరాలున్న ఒకే ఒక్క స్టీల్స్టాంటు కూడా ఇదే. రూ.5వేల కోట్లతో స్థాపించిన ఈ ప్లాంటు ఇప్పటివరకు ప్రభుత్వానికి పనులు, డివిడెండ్ల రూపంలో రూ.54,380 కోట్లు చెల్లించింది. దీని విలువ ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంతటి విలువైన ఈ ప్లాంట్ను రూ. లక్షల కోట్లు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వారికి అమ్ముతామంటే ఊరుకోం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణు కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావాలి. కర్నాటకలో అతి చిన్నదైన విశ్వేశ్వరాయ స్టీల్స్టాంట్కు రూ.10 వేల కోట్ల రివైవల్ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం అతిపెద్ద విశాఖ స్టీల్స్టాంట్ను ప్రైవేటీకరించాలని చూడడం దుర్మార్గం. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం' అని విశాఖ ఉక్కు కర్మాగారం సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

Read More
Next Story