విశాఖ బీచ్ ని పదిహేనేళ్లుగా కొరుక్కుతింటున్నారు....
x
వైజాగ్ బీచ్ అక్రమణ బీభత్సం

విశాఖ బీచ్ ని పదిహేనేళ్లుగా కొరుక్కుతింటున్నారు....

ఎన్ని లేఖలు రాసిన ప్రభుత్వంలో చలన రావడం లేదు అంటున్నారు డా. ఇఎఎస్ శర్మ


విశాఖ బీచ్ దురాక్రమణలను, నిర్మాణాలను తొలగించేందుకు అయ్యే ఖర్చు భారం, జరిమానాలు, బాధ్యులైన రాజకీయ నాయకులు, అధికారులే భరించాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డా. ఇఎఎస్ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్శి విజయానంద్ కి నేడు లేఖ రాశారు.



విశాఖ తీర ప్రాంతంలో, రామకృష్ణా బీచ్ నుంచి భీమిలి వరకు, CRZ నిబంధనలకు వ్యతిరేకంగా, గత పదిహేను సంవత్సరాల పాటు, విస్త్రుతంగా, భవన నిర్మాణం జరిగింది. CRZ నిబంధనల ప్రకారం, CRZ పరిథిలో బోర్ బావుల నుంచి, నీరు పంప్ చేయకూడదు. ఆ విషయంలో కూడా రాష్ట్ర హైకోర్టు వారు 2012 లో ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు కూడా ఉల్లంఘించబడ్డాయి. ఆ ఉల్లంఘనల విషయం, పదే పదే, నేను, విశాఖలో ఇతర పౌరులు, అన్ని స్థాయిల అధికారుల దృష్టికి తీసుకు వచ్చినా, అధికారులు స్పందించలేదు.

అంతేకాదు, అక్కడంతా అధికారులు, VIP లు వస్తున్నారనే నెపంతో, చట్ట విరుద్ధంగా, వీధి వ్యాపారుల మీద, ఇతర చిన్న వ్యాపారుల మీద, మురికివాడ ప్రజల మీద, దయాదాక్షిణ్యాలు చూపించకుండా దౌర్జన్యంగా ఖాలీ చేయించారు.

CRZ ఉల్లంఘనల మీద, అధికారుల స్పందన లేకపోవడం కారణంగా, ప్రత్యామ్నాయం లేకపోవడం వలన,కొంత మంది పౌరులు, గత రెండు మూడు నెలల్లో,రాష్ట్ర హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది.


కోర్టువారు, భీమిలి తీరంలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన తరువాతనే, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే, ప్రజల నిధుల నుంచి, కోటి రూపాయలకు మీద ఖర్చు జరిగింది అని వార్తలు వచ్చాయి.

CRZ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన నిర్మాణాలను తొలగించేందుకు అయిన ఖర్చు భారం ప్రజలు ఎందుకు భరించాలి?




నా ఉద్దేశంలో, అటువంటి ఖర్చు భారాన్ని, అందుకు బాధ్యులైన వ్యక్తుల నుంచి, వారికి మద్దతు ఇచ్చిన రాజకీయ నాయకుల నుంచి, భారీ జరిమానా తో సహా వసూలు చేయాల్సిన అవసరముంది. అటువంటి కట్టడాలు జరుగుతూ ఉంటే, చూస్తూ చర్యలు తీసుకొని ఉన్నత అధికారులను సస్పెండ్ చేసి, వారి మీద ప్రభుత్వ నిబంధనల కింద, చర్యలు తీసుకోవడం కూడా ఎంతో అవసరం.

విశాఖ జిల్లాలో, భీమునిపట్నం తీరంలో, CRZ నిబంధనలను ఉల్లంఘిస్తూ, 2023-24 లో, అప్పటి ముఖ్యమంత్రి గారి సన్నిహితులైన కొంతమంది వ్యక్తులు పునాదులు వేసి, భవన నిర్మాణం మొదలుపెట్టిన విషయం నా దృష్టికి రాగానే, నేను అప్పటి రాష్ట్ర పర్యావరణ శాఖ కార్యదర్శి కి 16-2-2024 న రాసిన లేఖలో, తత్ క్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ లేఖ నకలు జత పరుస్తున్నాను. ఆ విషయం జీవీఎంసీ అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. నా లేఖలో పది ఫోటోలు కూడా అధికారులకు పంపించాను. కాని, అప్పటి జీవీఎంసీ అధికారులు చలించలేదు.

అదే విషయాన్ని కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ దృష్టికి 19-2-2024న తీసుకువచ్చి, బాధ్యులైన రాష్ట్ర, జిల్లా CZMA అధికారుల మీద, తగిన చర్యలు తీసుకోవాలని కోరాను. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా, వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇక్కడ ప్రస్తావించిన భీమిలి కేసులో, రాష్ట్ర హైకోర్టు వారు, భీమిలి కట్టడాలే కాకుండా, విశాఖ తీరంలో ఇతర ప్రాంతాల్లో, CRZ నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగిన కట్టడాలమీద సమగ్రంగా సర్వే చేపట్టి, సర్వే రిపోర్టును కోర్టు వారి ముందు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
అంటే గత పదిహేను సంవత్సారాలుగా విచ్చలవిడిగా, రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల సహాయంతో, విశాఖ తీరంలో CRZ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి. ఆ విషయంలో తనంతట తానే ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు చేపట్టి అందుకు బాధ్యులైన రాజకీయ నాయకుల మీద, అధికారుల మీద, కట్టడాలు చేసిన పెట్టుబడిదారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా, అటువంటి అక్రమ భవనాలను తొలగించాలి. అటువంటి చర్యలు తీసుకోకపోతే, విశాఖ తీర ప్రాంతంలో మత్స్య సంపదకు, భూగర్భ జలవనరులకు, అత్యధికంగా నష్టం కలుగుతుందని ప్రభుత్వం గుర్తించాలి.

కేరళ తీర ప్రాంతంలో, మారడు పంచాయతీ లో, CRZ నిబంధనలకు వ్యతిరేకంగా కట్టబడిన నాలుగు మల్టి స్టోరీస్ భవనాలను సుప్రీం కోర్టు వారి ఆదేశాలను అమలు చేస్తూ, కేరళ రాష్ట్ర ప్రభుత్వం పడగొట్టవలసి వచ్చిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను.
"అభివృద్ధి" పేరుతో, చట్టాలను ఉల్లంఘించి తీరప్రాంత వనరులకు నష్టం కలిగించే వారిని, ప్రభుత్వం ప్రోత్సహించకూడదు. వారి మీద కఠినమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవడం అవసరం


Read More
Next Story