అలజడి రేపుతున్న  వైజాగ్ ఆపరేషన్‌ ‘లంగ్స్‌’!
x
ఆదివారం నగరంలో తొలగిస్తున్న అనధికార దుకాణం

అలజడి రేపుతున్న వైజాగ్ ఆపరేషన్‌ ‘లంగ్స్‌’!

విశాఖలో రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై అనధికారిక ఫుడ్‌ స్టాల్స్, ఇతర చిరు వ్యాపారుల దుకాణాలను ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పేరిట జీవీఎంసీ తొలగిస్తుండడం తీవ్ర అలజడి రేపుతోంది.

ఐదారేళ్ల క్రితం విశాఖ సెంట్రల్‌ పార్క్‌ వెనక భాగంలో ఏర్పాటైన నైట్‌ ఫుడ్‌ కోర్టు వివాదం ఇప్పుడు విశాఖలో చిరు వ్యాపారుల్లో కంపరం పుట్టిస్తోంది. అప్పట్లో వైఎస్సార్‌సీపీ నేతలు ఈ ఫుడ్‌ కోర్టుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారంటూ కూటమి నేతలు కుతకుతలాడుతున్నారు. మరోపక్క విశాఖ నగరంలో అనధికార దుకాణాలను తొలగించేందుకు జీవీఎంసీ రంగంలోకి దిగింది. దీంతో ఫుడ్‌ కోర్టుతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న రోడ్ల పక్కన, ఫుట్‌ పాత్‌లపై ఉన్న ఈ దుకాణాలను ఆపరేషన్‌ లంగ్స్‌ (లైఫ్‌ టు అర్బన్‌ గ్రీన్‌ స్పేసెస్‌ 2.0) పేరిట నాలుగు రోజుల నుంచి స్పెషల్‌ డ్రైవ్‌లో తొలగింపులకు శ్రీకారం చుట్టింది. ఇది కూటమి నేతల్లో విభేదాలకు దారి తీసింది. జనసేన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఫుడ్‌ కోర్టు నిర్వాహకుల పక్షాన ఉంటే టీడీపీ సహా ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆక్రమణల తొలగింపును సమర్థిస్తున్నారు.


నైట్‌ ఫుడ్‌ కోర్టులో వ్యాన్‌ను లారీపైకి ఎక్కిస్తున్న జీవీఎంసీ సిబ్బంది

అసలేం జరిగిందంటే?
సెంట్రల్‌ పార్కు వెనక ఉన్న రోడ్డులో నైట్‌ ఫుడ్‌ కోర్టు ఏర్పాటుకు ఆరేళ్ల క్రితం వైసీపీ నేతలు అనుమతించారు. తొలుత 32 స్టాళ్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా అవి క్రమంగా 240కి పైగా పెరిగాయి. కానీ వీటి నుంచి జీవీఎంసీకి ఒక్క రూపాయి కూడా ఆదాయం రావడం లేదు. ఈ అనధికార స్టాళ్ల నుంచి జీవీఎంసీ కార్పొరేటర్లకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున జీవీఎంసీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ఫుడ్‌ కోర్టు వ్యవహారంపై నిగ్గు తేల్చాలని డిప్యూటీ మేయర్‌ కె.సతీష్‌కుమార్‌ నేతృత్వంలో పదిమంది కార్పొరేటర్లతో కమిటీ వేశారు. ఈ ఫుడ్‌ కోర్టు అనధికారికంగా నడుస్తోందని కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిపై అర్హులకే స్టాళ్లను రెగ్యులరైజ్‌ చేసి జీవీఎంసీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్‌లో తీర్మానాన్ని ఆమోదించారు. కొద్దినెలల క్రితం మరోసారి తీర్మానం చేశారు. కానీ ఆ తీర్మానాలు అమలుకు నోచుకోలేదు. సంబంధిత స్టాళ్ల నిర్వాహకుల నుంచి నెలకు రూ.లక్షల్లో ముడుపులు తీసుకోవడమే ఇందుకు కారణమన్న ప్రచారం ఊపందుకుంది.

ఫుడ్‌ కోర్టు వద్ద ఆందోళన చేస్తున్న షాపుల నిర్వాహకులు

కూటమి అధికారంలోకి వచ్చాక..
ఇంతలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు వైఎస్సార్‌సీపీ నేతలతో అంటకాగిన ఫుడ్‌కోర్టు నిర్వాహకులు ప్లేటు ఫిరాయించి జనసేన, టీడీపీలకు జై కొట్టారు. ఇటీవల జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కూడా. ఇంతలో కొన్ని నెలల క్రితం కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ మేయర్‌ హరి వెంకటకుమారిని అవిశ్వాస తీర్మానం ద్వారా దించేసి టీడీపీ కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావును మేయర్‌ పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫుడ్‌ కోర్టుపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు జీవీఎంసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కొత్తగా వెండింగ్‌ లైసెన్సులు జారీపై స్టే విధించింది. ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు రానుంది. ఇంతలోనే ఆపరేషన్‌ లంగ్స్‌ ఆరంభమైంది.

తొలగింపునకు ముందు సెంట్రల్‌ పార్కు వద్ద నైట్‌ ఫుడ్‌ కోర్టు (ఫైల్‌)

రోజువారీ మామూళ్ల ఆరోపణలు..
మరోవైపు ఈ నైట్‌ ఫుడ్‌ కోర్టు విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉంది. దీంతో అక్కడ ఎమ్మెల్యే (జనసేన) వంశీకృష్ణ శ్రీనివాస్‌ అజమాయిషీలోకి వెళ్లినట్టయింది. ఫుడ్‌ కోర్టు నిర్వాహకులు సంబంధిత ప్రజాప్రతినిధులకు రోజువారీ మామూళ్లు చెల్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో షాపు నుంచి రోజుకు స్టాల్‌ను బట్టి రూ.500–1000 వరకు చెల్లింపులు జరుపుతున్నట్టు ప్రచారం ఉంది. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కార్పొరేటర్లు అనధికారిక దుకాణాలకు నెలవారీ మామూళ్ల ఒప్పందంతో అనుమతులిస్తున్నారు. మరికొందరు బినామీ పేర్లతో షాపులు నడుపుతున్నారు. ఇంకొందరు సబ్‌ లీజులకు ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈ దుకాణాలను తొలగిస్తే ఆదాయ వనరులు కోల్పోతామన్న బెంగ వీరికి ఉంది.

సోమవారం ఆందోళనకు పిలుపునిచ్చిన ఏఐటీయూసీ నేతలు

అదను చూసుకుని ఆపరేషన్‌ ‘లంగ్స్‌’
విశాఖ నగరం సహా జీవీఎంసీ పరిధిలోని ఈ నైట్‌ ఫుడ్‌ కోర్టుతో పాటు ఫుట్‌ పాత్‌లు, రోడ్ల పక్కన అనధికారికంగా నడుస్తున్న దుకాణాలను తొలగించాలని కొన్నాళ్లుగా జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. క్లీన్‌ సిటీలో భాగంగా వైజాగ్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా దీనికి శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు. వివిధ కారణాల వల్ల వీటి తొలగింపు సాధ్యం కాలేదు. ఇటీవల జీవీఎంసీ కమిషనర్‌గా వచ్చిన కేతన్‌ గార్గ్‌ దీనిపై అడుగు ముందుకేశారు. ఇటీవలే కార్పొరేటర్లు అధ్యయన యాత్ర కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లారు. మరోవైపు ఐదు రోజుల క్రితమే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. దీంతో ఇటు కార్పొరేటర్లు గాని, అటు ఎమ్మెల్యేలు గాని నగరంలో లేని సమయాన్ని చూసుకుని ఇదే అదనుగా భావించారు. వెంటనే ఆపరేషన్‌ ‘లంగ్స్‌’ను ప్రారంభించారు. నైట్‌ ఫుడ్‌ కోర్టుతో సహా నగరంలో అనధికార చిల్లర దుకాణాలను జీవీఎంసీ సిబ్బంది యుద్ధప్రాతిపాదికన తొలగిస్తున్నారు. ఇలా గడచిన నాలుగు రోజుల్లో విశాఖ నగరంలో 2,476 అనధికార దుకాణాలను తొలగించారు. విశాఖ నగర పరిధిలో పది వేలకు పైగా ఇలాంటి షాపులున్నట్టు అంచనా. ఎమ్మెల్యే, కార్పొరేటర్ల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా లెక్క చేయకుండా సీఎంఓ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ తీసుకుని కమిషనర్‌ ఆపరేషన్‌ లంగ్స్‌ను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.
కార్పొరేటర్లకు మొరపెట్టుకున్నా..
విశాఖ నగరంలోని కార్పొరేటర్లకు అనధికార చిల్లద దుకాణాలు పెద్ద ఆదాయ వనరులుగా మారాయి. ఎక్కడైనా ఒక దుకాణం పెట్టుకోవాలంటే వ్యాపారాన్ని బట్టి రోజుకు రూ.150–1000 వరకు మామూళ్లు చెల్లించే సంప్రదాయం ఉంది. ఇప్పుడు ఆపరేషన్‌ లంగ్స్‌ పేరుతో దుకాణాల తొలగింపు జెట్‌ స్పీడుతో జరుగుతుండడంతో బాధిత యజమానులు కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు ఫోన్లలో మొరపెట్టుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నామని ఎమ్మెల్యేలు, అధ్యయన యాత్రలో ఉన్నామని కార్పొరేటర్లు తప్పించుకుంటున్నారు. తామొచ్చాక న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. వీరంతా విశాఖ చేరుకోవడానికి మరో వారం రోజులైనా సమయం పడుతుంది. ఈలోగా ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పూర్తయిపోతుంది.
కౌన్సిల్‌ తీర్మానం మేరకే తొలగింపులు..
‘అనధికార షాపులతో కార్పొరేషన్‌ ఆదాయానికి గండి కొడుతున్నారని రెండేళ్లుగా ఫిర్యాదులున్నాయి. వాటి ఆధారంగా కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. అర్హులకు న్యాయం చేయాలంటే అనధికారికంగా ఉంటున్న వారిని తొలగించాలి. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే స్థలంలో అర్హులకిస్తాం. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా అనుమతులిస్తాం. అవసరమైన చోట్ల హాకర్‌ జోన్లు ఏర్పాటు చేస్తాం’ అని జీవీఎంసీ డిప్యూటీ సీటీ ప్లానర్‌ హరిరాజు స్పష్టం చేశారు.
ఆందోళనకు సిద్ధమవుతున్న చిరు వ్యాపారులు..
ఆపరేషన్‌ లంగ్స్‌ పేరిట జీవీఎంసీ అనధికార దుకాణాలను తొలగిస్తుండడంతో చిరువ్యాపారులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. వామపక్ష, ప్రజాసంఘాల నేతలు వీరికి అండగా నిలుస్తున్నారు. ముందస్తు నోటీసులివ్వకుండా దుకాణాలను తొలగించి ఉన్నఫళంగా తమను రోడ్డును పడేశారని బాధిత చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై ఆధారపడే నెలనెలా అద్దెలు, చీటీలు, ఈఎంఐలు చెల్లిస్తున్నామని, ఉపాధి లేకుండా చేస్తే ఎలా బతకాలని వీరు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో దుకాణంపై ఐదు కుటుంబాలు బతుకుతున్నాయని, పవన్‌ కల్యాణ్‌ను గెలిపించుకున్నామని, ఆయనే తమకు న్యాయం చేయాలని వీరు కోరుతున్నారు. విశాఖలో కొంతమంది పెద్ద హోటళ్ల వారు సిండికేట్‌ అయి నైట్‌ ఫుడ్‌ కోర్టు లేకుండా చేస్తున్నారని కనకారావు అనే దుకాణదారు ఆరోపించారు. కాగా ఆపరేషన్‌ లంగ్స్‌కు వ్యతిరేకంగా సోమవారం చలో జీవీఎంసీ పేరిట ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్టు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ వెల్లడించారు. మరోవైపు బాధిత దుకాణదార్లకు వైఎస్సార్‌సీపీ నేతలు అండగా నిలిచారు.
కూటమిలో చిచ్చు రేపిన ఆపరేషన్‌ లంగ్స్‌!
ఆపరేషన్‌ లంగ్స్‌ కూటమిలో చిచ్చు రేపింది. అనధికార ఫుడ్‌ కోర్టు జనసేన ప్రజాప్రతినిధికి కాసుల వర్షం కురిపిస్తోందన్న భావన జనసేన సహా కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లలో బలంగా ఉంది. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు నగర సుందరీకరణ, పరిశుభ్రత లక్ష్యంతో చేపట్టే ఆపరేషన్‌ లంగ్స్‌ను కొనసాగించాలని జీవీఎంసీ కమిషనర్‌కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
Read More
Next Story