‘అంధ’కార బంధురం నుంచి క్రికెట్‌లో అందలానికి!
x
కరుణ కుమారి

‘అంధ’కార బంధురం నుంచి క్రికెట్‌లో అందలానికి!

అల్లూరి జిల్లాకు చెందిన పదో తరగతి పేద గిరిజన బాలిక కరుణకుమారి తొలిసారి జరిగే అంధ మహిళల టీ–20 ప్రపంచ కప్‌ క్రికెట్‌ టీమ్‌కి ఎంపికైంది.


ఆ బాలిక పుట్టింది కాకులు దూరని కారడవిలాంటి ఊరిలో. కేవలం 70 ఇళ్లు మాత్రమే ఉండే కుగ్రామంలో. క్రికెట్‌ అంటే ఏమిటో తెలియని పల్లెలో. ఊహ వచ్చాక ఇరుగు పొరుగు ఇంట్లో టీవీతో పాటు సెల్‌పోన్‌ అందుబాటులోకి వచ్చింది. పుట్టుకతోనే పాక్షిక అంధత్వం ఉన్న ఆ చిన్నారి ఆ ఇంటికెళ్లి టీవీ, సెల్‌ఫోన్లలో అప్పుడప్పుడు వచ్చే క్రికెట్‌ను అస్పష్టంగా చూసేది. నేనూ అలా ఆడితే ఎంత బాగుంటుందో కదా? అనుకునేది. చూడడమే వీలు కాని తనకు ఆడడం ఎలా సాధ్యం? అంటూ లోలోనే బాధపడేది. వీలు చిక్కినప్పుడల్లా రాళ్లు రప్పలను బాల్‌గా, కర్ర ముక్కలను బ్యాటుగా మార్చుకుని వాటితో క్రికెట్‌ ఆడుతూ తప్తి చెందేది. ఇప్పుడామె కల ఆషామాషీగా సాకారం కాలేదు. ఏకంగా టీ–20 ప్రపంచ కప్‌లో ఆడే గోల్డెన్‌ ఛాన్స్‌నే కొట్టేసింది. ఆమె పేరు పాంగి కరుణకుమారి. ఊరు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి.

ప్రిన్సిపాల్‌తో క్రికెటర్‌ కరుణ కుమారి తోటి విద్యార్థినులు

కడు పేదరికం నుంచి..
కరుణ కుమారి తల్లిదండ్రులు రాంబాబు, సంధ్య కూలీ నాలి చేసుకుని తమ నలుగురి బిడ్డలను పోషించుకుంటున్నారు. చాలీచాలని సంపాదనతో పిల్లల పోషణే కష్టతరంగా మారింది. దీంతో మట్టిగోడలపై రేకులేసుకున్న షెడ్డులోనే ఏళ్ల తరబడి ఉంటున్నారు. వీరి రెండో సంతానం కరుణ కుమారి. పేదరికంతో కొడుకు శివ పదో తరగతితో చదువు ఆపేశాడు. ఏడో తరగతి వరకు సమీపంలోని పాఠశాలలో చదువుకున్న కరుణకుమారి ఎనిమిదో తరగతి ఓ టీచరు సాయంతో విశాఖలోని ప్రభుత్వ అంధ బాలికల స్కూలులో చేరింది. మితభాషి అయిన కరుణ ఎవరితోనూ మాట్లాడేది కాదు.. కానీ ఆటలపై ఆసక్తి కనబరిచేది. క్రికెట్‌తో పాటు జావలిన్‌ థ్రో, డిస్కస్‌ థ్రో, షాట్‌పుట్‌ వంటి క్రీడల్లో రాణించేది. క్రికెట్‌పై ఆమె పట్టును గుర్తించిన స్కూలు పీఈటీ రవికుమార్‌ ఆమెను ప్రోత్సహించారు. ఆయన రిటైర్‌ అయ్యాక ఆయన స్థానంలో వచ్చిన పీఈటీ సత్యవతి అంధుల క్రికెట్‌లో మెళకువలు నేర్పారు.

కరుణను సత్కరిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

అంచెలంచెలుగా ఎదిగి.. అందలమెక్కి..
అలా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణించింది కరుణ. 2023 డిసెంబర్‌లో జాతీయ అంధ మహిళల క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. 2024లో హుబ్లిలో జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా పాల్గొని సత్తా చాటింది. 2025 జనవరిలో కొచ్చిలో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీల్లోనూ రాణించింది. అలాగే ఈ ఏడాది మార్చిలో కొచ్చిలోనే జరిగిన పెట్రోనేట్‌ ఇన్ఫినిటీ సిరీస్‌లో కర్నాటకను ఓడించి ఆంధ్రప్రదేశ్‌ టీమ్‌ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించింది. ఇక ప్రపంచ కప్‌ జట్టులో ఎంపిక కోసం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు బెంగళూరులో నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌ మ్యాచ్‌లో కరుణ ఏకంగా 70 బంతుల్లో 114 పరుగులు చేసింది. 60 బంతుల్లోనే సెంచరీ సాధించడంతో కరుణ ప్రతిభకు అంతా నివ్వెరపోయారు. వెనువెంటనే సెలెక్టర్లు ఆమెను టీ–20 అంధ మహిళల ప్రపంచ కప్‌కు ఆడే భారత జట్టుకు ఎంపిక చేశారు.

స్కూలులో క్రికెట్‌ ప్రాక్టీసు చేస్తున్న కరుణకుమారి

అతి పిన్న వయస్కురాలు కరుణే..
కరుణ కుమారి అంధ మహిళల ప్రపంచ్‌ కప్‌ క్రికెట్‌ జట్టులోకి ఎంపికైన తొలి గిరిజన బాలికే కాదు.. ఈ జట్టులోకి ఎంపికైన అతి చిన్న వయస్కురాలు కూడా. ఈమె వయసు 15 ఏళ్లు. ఈ జట్టులో 13–30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఎంపిక చేస్తారు. బై్లండ్‌ క్రికెట్‌లో మూడు కేటగిరీలుంటాయి. వీటిలో ఈమెను బి1 కేటగిరీకి సెలెక్ట్‌ చేశారు.

బెంగళూరు సెలక్షన్స్‌ మ్యాచ్‌లో ఆడుతున్న కరుణ

కళ్లకు గంతలు కట్టి ఆడిస్తారు..!
బై్లండ్‌ క్రికెట్‌లో పాక్షిక అంధత్వం ఉన్న వారి కళ్లకు గంతలు కట్టి (బై్లండ్‌ ఫోల్డ్‌) ఆడిస్తారు. అందువల్ల వారికి కొద్దిపాటి చూపున్నప్పటికీ బై్లండ్‌ ఫోల్డ్‌ వల్ల ఏమీ కనిపించదు. అందులోభాగంగానే పాక్షిక (ఎడమ కన్ను కనిపించదు) అంధత్వం ఉన్న కరుణను బీ1 కేటగిరీలో ఎంపిక చేశారు. బెంగళూరులో ప్రపంచ కప్‌ టీమ్‌ ఎంపికలోనూ సెలెక్టర్లు అదే ప్రమాణాన్ని పాటించారు.

బెంగళూరు సెలక్షన్స్‌ మ్యాచ్‌లో ఆడుతున్న కరుణ

బంతి శబ్దాన్ని గ్రహించి బ్యాటింగ్‌!
అంధుల క్రికెట్‌లో ఆటగాళ్లకు కళ్లకు గంతలు కట్టడం వల్ల బాల్‌ ఎక్కడుందో తెలియదు. బాల్‌ పడితే శబ్దం వచ్చేలా ప్రత్యేకంగా తయారు చేసిన బంతిని ఈ క్రికెట్‌లో వాడతారు. ఆ శబ్దాన్ని గ్రహించి ఆటగాళ్లు బ్యాట్‌ను ఝుళిపిస్తారు. కళ్లు బాగా కనిపించే రెగ్యులర్‌ క్రికెటర్లే బాల్‌ను అంచనా వేయడానికి అగచాట్లు పడతారు. అలాంటిది అంధ మహిళలు బాల్‌ శబ్దాన్ని అంచనా వేసి పరుగులు సాధించడమంటే ఎంత కష్టతరమో ఊహించవచ్చు.
నవంబర్‌లో ప్రపంచకప్‌ క్రికెట్,,
అంధ మహిళల ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీలు నవంబరు 11 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఈ పోటీల్లో ఇండియా, న్యూజిలాండ్, ఫిన్‌లాండ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అమెరికా జట్లు తలపడనున్నాయి. వీటిని నేపాల్‌/శ్రీలంకల్లో నిర్వహించనున్నారు. వచ్చే నెల నుంచి ముంబై/ఢిల్లీల్లో రెగ్యులర్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో పాల్గొనడానికి కరుణ కుమారి త్వరలో అక్కడకు వెళ్లనుంది.
కరుణది ఎంత పేదరికమంటే?
కరుణది కడు పేదరిక కుటుంబం. ఆమె తల్లిదండ్రులు రాంబాబు, సంధ్యలు రోజు కూలి చేసుకుని నలుగురి పిల్లలను పోషిస్తున్నారు. మట్టి గోడలపై రేకులు వేసుకుని అందులోనే ఉంటున్నారు. ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయలేదు. కుటుంబ పోషణకు పెద్ద కొడుకు శివ చదువు ఎనిమిదో తరగతితోనే ఆపేసి కూలి పనులకు వెళ్తూ అమ్మా నాన్నలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.
నా కూతురు ఎంపికైందంటే నమ్మలేదు..
‘నా కూతురు పెపెంచ కప్‌ కికెట్‌కి ఎంపికైందని సెపితే నమ్మలేదు. అదేటో కూడా మాకు తెలీదు. పేపర్లో సూపించేక నమ్మేను. నా బిడ్డ ఈ తాయి (స్థాయి)కి ఎల్లిందంటే సేలా సంతోసంగా ఉంది. ఈరోజు తింటే రేపు దొరకని పరిత్తితి మాది. మా బార్యాబర్తలిద్దరం రోజూ కూలీకెల్తే ఒక్కొక్కలికి రూ.300 వొత్తది. దాంతోనే బతుకుతున్నాం. మట్టి గోడల రేకుల సెడ్డులోనే పిల్లల్తో ఉంటన్నాం. మంగళారం కలక్టరాపీసు నుంచి ఎవరో పోన్‌ సేసేరు. మీ పిల్ల కికెట్‌కి సెలెట్‌ అయిందట కదా? ఓసారి సచివాలయానికి ఎల్లమని సెపితే ఎల్లొచ్చాం. మా బిడ్డ ఇంకా పైకెదగాలని దేవుణ్ని కోరుకుంటన్నాం’ అని కరుణకుమారి తల్లిదండ్రులు రాంబాబు, సంధ్యలు తమ ఆనందాన్ని ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో పంచుకున్నారు.
జిల్లా స్థాయికి వెళ్తే చాలనుకున్నానుః కరుణ కుమారి
‘చిన్నప్పట్నుంచి నాకు క్రికెట్‌ అంటే ఇష్టం. మా ఇంట్లో టీవీ లేకపోతే పక్కింటికెళ్లి క్రికెట్‌ చూసేదాన్ని. క్రికెట్‌ ఆడటానికి బ్యాట్, బాల్‌ కొనే స్థోమతు అమ్మానాన్నలకు లేదు. ఎప్పుడైనా నాకు క్రికెట్‌ ఆడే అవకాశం వస్తుందా? అనుకునేదాన్ని. వైజాగ్‌ అంధ బాలికల స్కూల్లో చేరాక నాలో ఆశలు చిగురించాయి. నాలో క్రికెట్‌ ఆసక్తిని పీఈటీలు రవికుమార్, సత్యవతిలు గుర్తించి ప్రోత్సహించారు. క్రికెట్‌లో మెళకువలు నేర్పారు. దీంతో జిల్లా స్థాయి క్రికెట్‌ టీమ్‌లో చోటు దక్కితే చాలనుకునేదాన్ని. కానీ అంచెలంచెలుగా ఇప్పుడు ప్రపంచకప్‌ టీమ్‌లో అవకాశం దక్కడం చాలా సంతోషాన్నిస్తోంది. ఇది నేను ఊహించలేదు. నాకు ఈ ఛాన్స్‌ రావడంలో అంధ మహిళల క్రికెట్‌ కోచ్‌ అజయ్‌కుమార్‌రెడ్డి సహకారం మరువలేను. నేను బాల్‌ శబ్దాన్ని అంచనా వేసి పరుగులు సాధిస్తాను. మున్ముందు భారత్‌ జట్టులో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలన్నదే నా లక్ష్యంు’ అని అంధ క్రికెటర్‌ కరుణ కుమారి ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.

ప్రిన్సిపాల్‌ విజయ

మా స్కూలుకే గర్వకారణం..
కరుణకుమారి అంధ మహిళల ప్రపంచ కప్‌ క్రికెట్‌ జట్టుకు ఎంపిక కావడం మా స్కూలుకే గర్వకారణం. ఆమె క్రికెట్‌పై పెట్టే ధ్యాస. ఏకాగ్రత చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇతర విషయాలను పట్టించుకోదు. సొంతంగా బ్యాట్‌ కొనుక్కునే స్తోమతు కూడా లేక స్కూలులోని బ్యాట్‌తోనే ప్రాక్టీసు చేస్తుంది. పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కి రెండేళ్లలోనే ఈ స్థాయికి చేరుకోవడం మాకు చాలా సంతోషాన్నిస్తోంది. మా స్కూలులో ఇప్పటివరకు ఈ స్థాయికి చేరుకున్న వారెవరూ లేరు’ అని కరుణకుమారి చదువుతున్న ప్రభుత్వ అంధ బాలిక పాఠశాల ప్రిన్సిపాల్‌ విజయ చెప్పారు.
కరుణను అన్నివిధాలా ఆదుకుంటాం..
‘కరుణ కుమారి మారుమూల గిరిజన కుగ్రామంలో పుట్టి ప్రపంచ కప్‌ క్రికెట్‌కు ఎంపికకైన తొలి బాలిక కావడం మా గిరిజనులకే గర్వకారణం. పేదరికంలో ఆమెకు మేం అన్ని రకాల ఆదుకుంటాం. జెడ్పీ నుంచి ఎలాంటి సాయం అందించాలో చూస్తాను. ఆమె తల్లిదండ్రులకు సొంతిల్లు సమకూరేలా కషి చేస్తాను. క్రికెట్‌లో మరింత రాణించడానికి అవసరమైన కిట్, ఇతర పరికరాలను నా సొంత నిధులతో సమకూరుస్తాను’ అని విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో అన్నారు. మంగళవారం ఆమె అంధ బాలికల స్కూలుకు వెళ్లి కరుణను సత్కరించారు.
Read More
Next Story