అందాల విశాఖ ఏటా దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. తన సహజ సౌందర్యంతో దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటక ప్రియులను మైమరపిస్తుంది. ఇక్కడకు వచ్చే అన్ని తరగతుల వారికి వివిధ స్థాయిల్లో హోటళ్లు రుచులను అందిస్తున్నాయి. విశాఖలో పర్యాటకరంగాన్ని మరింతగా విస్తృతం చేయడంలో భాగంగా పర్యాటకశాఖ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌ను ఈనెల 5, 6, 7 తేదీల్లో (శుక్ర, శని, ఆదివారాల్లో) నిర్వహించనుంది. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఫెస్టివల్ ఉంటుంది. వైజాగ్ బీచ్ ఒడ్డున ఉన్న ఎంజీఎం గ్రౌండ్‌ను ఇందుకు ఎంపిక చేసింది. ఒకపక్క నురుగలు కక్కుతూ మీదకు దూసుకు వస్తున్నట్టు అగుపించే సాగర కెరటాలు, చలచల్లని పిల్ల తెమ్మెరలు, ఎత్తుపల్లాల ఇసుక తిన్నెలను ఆస్వాదిస్తూ ఫుడ్ ఫెస్టివల్‌లో నచ్చిన రుచులను ఆరగించేలా ఏర్పాట్లను చేసింది. విభిన్న రుచుల ఫుడ్‌తో పాటు వచ్చిన వారిని అలరించేందుకు, స్థానిక కళాకారులను ప్రోత్సహించే ఉద్ధేశంతో కల్చరల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు.
వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ బ్రోచర్
తక్కువ ధరకే స్టార్ హోటళ్ల ఫుడ్..
వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌లో వివిధ రకాల రుచులను అందించడానికి 16 స్టార్ హోటళ్లు ముందుకొచ్చాయి. వీటిలో నోవాటెల్, రాడిసన్ బ్లూ, ఫోర్ పాయింట్స్ హోటల్, మేఘాలయ, బెస్ట్ వెస్టర్న్ రామచంద్ర, బెస్ట్ వెన్టర్న తేజ్‌వివాన్, ఐటీసీ ఫార్ట్యూన్ ఇన్, కాసాలీజర్ హోటల్స్, ది పార్క్, హోటల్, దస్‌పల్లా ఎగ్జిక్యూటివ్ కోర్టు, రాక్‌డేల్ హోటల్, ఎలిగెంట్ హోటల్, హేమాస్ హోటల్, సుప్రీం హోటల్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు నగరంలోని మరికొన్ని ప్రఖ్యాత హోటళ్లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. సాధారణంగా స్టార్ హోటళ్లలో ఫుడ్ రేట్లు సామాన్యులు అందుకోలేరు. అయితే ఈ ఫుడ్ ఫెస్టివల్‌కు వచ్చే వారికి అందుబాటులో ఉండేలా వాటి అసలు ధరల్లో తగ్గించి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లతో అందివవ్వనున్నారు. వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌లో వెజ్, నాన్ వెజ్ వంటకాలుంటాయి.
వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించే ఎంజీఎం గ్రౌండ్
ఇంకా ఏముంటాయంటే?
వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌లో ఇటాలియన్, కొరియన్, చైనీస్ డిష్‌లు వంటి గ్లోబల్ క్యుజిన్స్‌తో పాటు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఆంధ్ర క్యుజిన్స్, వైజాగ్ లోకల్ రుచుల వంటకాలూ ఉంటాయి. ఇంకా హైదరాబాద్ ఫేమస్ నీలోఫర్ కేఫె, అరకు కాఫీ వైజాగ్ ఫేవరేట్స్, ఇంకా ఈ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌లో హైదరాబాద్ ఫేమస్ నీలోఫర్ కెఫె టీ, చాయ్ బిస్కెట్, ప్రఖ్యాత అరకు కాఫీ వంటి స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
బోట్లపై కూర్చుని తినే కేటమారన్ డైనింగ్ (ప్రతీకాత్మక చిత్రం)
కేటమారన్ డైనింగ్ ప్రత్యేక ఆకర్షణ..
ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో కేటమరైన్ డైనింగ్ ప్రత్యేక అకర్షణగా నిలవనుంది. ఇందుకోసం కొన్ని పడవలను తీసుకొచ్చి తీరం ఒడ్డున ఇసుక తిన్నెలపై ఉంచుతారు. వాటిని అందంగా అలంకరిస్తారు. ఫుడ్ ఫెస్టివల్‌కు వచ్చిన వారు ఆ బోట్లపై కూర్చుని ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఆ బోట్లపై నుంచి నిశిరాత్రి వేళ సాగరం అందాలను వీక్షిస్తూ, నచ్చిన రుచులను ఆరగిస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీతో వచ్చి చిల్ అవ్వొచ్చు. వీకెండ్‌ను స్పెషల్ ఫుడ్‌తో ఎంజాయ్ చేయొచ్చు.
ఎంట్రీ ఫీజు లేదు ..
సాధారణంగా కొన్ని ఫుడ్ ఫెస్టివల్స్‌కు ఎంట్రీ ఫీజు ఉంటుంది. కానీ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌కు ఎంట్రీ ఫీజు లేకుండానే అనుమతిస్తారు. సందర్శకులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడానికి వీలుగా ఎంట్రీ ఫీజు వసూలు చేయడం లేదు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ మంది ఫుడ్ ఫెస్టివల్‌కు వచ్చే అవకాశం ఉంది.
వీకెండ్‌తో పోటెత్తనున్న సందర్శకులు..
సహజంగా విశాఖ వాసులకు ఫుడ్ లవర్స్ అని పేరు. మామూలు రోజుల్లోనే హోటళ్లు, ఫుడ్ స్టాళ్లు రద్దీగా ఉంటాయి. ఇక వీకెండ్‌ల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఆహార ప్రియులతో కిక్కిరిసిపోతూ కనిపిస్తాయి. ఇప్పుడు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ వీకెండ్‌లో ఏర్పాటు చేయడం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు. శని, ఆదివారాలు పబ్లిక్ హాలీడేస్. ఇలా వరసగా మూడు రోజులూ సెలవులే. అందువల్ల ఈ మూడు రోజులూ విశాఖ వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్ వచ్చే వారూ ఉంటారు. దీంతో వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌కు ఆదరణ బాగుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
టూరిజాన్ని మరింతగా పెంచాలని..
విశాఖలో టూరిజాన్ని మరింత విస్తృతం చేసేందుకు వైజాగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఫుడ్ ఫెస్టివల్‌లో తొలిసారిగా కేటమారన్ డైనింగ్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఇందులో భాగంగా ఇసుక తిన్నెలపై ఉంచిన బోట్లపై కూర్చుని సముద్రాన్ని చూస్తూ తినేలా ఏర్పాటు చేశాం. ఇది పర్యాటక ప్రియులకు మధురానుభూతిని కలిగిస్తుంది. ఈ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌లో 16 స్టార్ హోటళ్లు, మరికొన్ని ప్రఖ్యాత హోటళ్లు 45కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ఏపీ టూరిజం సహకారంతో ఈ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. వైజాగ్‌లో తొలిసారిగా స్టార్ హోటళ్ల ఛెఫ్‌లకు మూడు కేటగిరీల్లో ఛెఫ్ కాంపిటేషన్స్ పెట్టాం. విజేతలకు ఫుడ్ ఫెస్టివల్ ఆఖరి రోజున మెమెంటోలను అందజేస్తాం’ అని ఏపీ పర్యాటకాభివృద్ధి రీజనల్ డైరెక్టర్ జగదీష్, జిల్లా పర్యాటక శాఖాధికారి జె.మాధవి ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.