సముద్రం రంగులు మార్చుకుంటుందా.. విశాఖ తీరంలో వింత
x

సముద్రం రంగులు మార్చుకుంటుందా.. విశాఖ తీరంలో వింత

తరచూ రంగులు మారుతున్న విశాఖ కడలి. గతంలో అకుపచ్చ, నలుపు రంగు. తాజాగా ఎరుపు వర్ణంలోకి. రివర్స్ రిప్ కరెంట్స్ వల్లేనంటున్న నిపుణులు.


(బొల్లం కోటేశ్వరరావు- విశాఖపట్నం)

కొన్నాళ్ల నుంచి విశాఖ తీరంలో 'అలజడి రేగుతోంది. ఒకపక్క సముద్రం ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటోంది. మరోపక్క కొన్నాళ్లు ముందుకు, మరికొన్నాళ్లు వెనక్కి వెళుతోంది. ఇలా రకరకాల విన్యాసాలతో ఇటు విశాఖ వాసులను, అటు సందర్శకులను 'మకతిక' పెడుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా కడలి ఇలా తన సహజత్వానికి భిన్నంగా కనిపిస్తూ సరికొత్త ప్రత్యేకతను చాటుకుంటోంది.

విశాఖ సాగరతీరం ఒంపులు తిరుగుతూ వయ్యారంగా కనిపిస్తుంది. పర్యాటకులకు, సందర్శకులకు ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది. ఎప్పుడూ తెలతెల్లని నురుగులు కక్కుకుంటూ తీరం వైపు పోటెత్తుతూ కనువిందు చేస్తుంది. సహజంగా నీలిరంగుతూ కనిపించే ఈ తీరం ఇటీవల తన రూపును మార్చుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో భీమిలి తీరంలో సముద్రం ఆకుపచ్చ రంగు పులుముకుంది. కొద్దిరోజుల క్రితం బంగారు వర్ణాన్ని సంతరించుకుంది. ఎప్పుడూ గోధుమ రంగుతో ఆకట్టుకునే ఆర్కే బీచ్

తీరమంతా కొన్నాళ్లు నల్లగా మారిపోయింది. తీరంలో ఆ నల్లని ఇసుక తెన్నెలపై సందర్శకులు కూర్చోవడానికి వీలు లేని పరిస్థితి ఉండేది. కొన్నాళ్ల తర్వాత పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఇంతలో ఉన్నట్టుండి ఆదివారం విశాఖ తీరం నుంచి సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. కొన్నిచోట్ల 300 మీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 400 మీటర్ల వరకు వెనకడుగు వేసింది. దీంతో ఆహ్లాదానికి వచ్చిన బీచ్ సందర్శకులు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. విశాఖ నగరానికి ఆనుకుని ఉన్న కోస్టల్ బ్యాటరీ, గోకుల్ పార్కు, ఆర్కే బీచ్, వైఎంసీఏ, వుడా పార్కు, రుషికొండ బీచ్, భీమిలి బీచ్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణంగా విశాఖ బీచ్లకు సమీపం వరకూ సాగర కెరటాలు చొచ్చుకు వస్తూ ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇలా బీచ్ రోడ్డు దిగగానే అలా అలలు తాకడానికి అందుబాటులో ఉంటాయి. కానీ ఆదివారం పరిస్థితి అందుకు భిన్నంగా తీరానికి చాలా వరకు వెనక్కి పోయింది. దీంతో ఇన్నాళ్లూ సముద్రంలో తీరానికి చేరువలో కనిపించీ, కనిపించని రాళ్ల గుట్టలన్నీ బయటపడ్డాయి. సాధారణంగా ఈ రాళ్ల వద్దకు వెళ్లాలంటే సాహసంతో కూడుకున్న పని. కానీ అలాంటిది ఈ రాళ్లకంటే వెనక్కే కడలి వెనక్కి వెళ్లింది. దీంతో సందర్శకులు ఈ రాళ్లపైకి వెళ్లి ఎంతో ఎంజాయ్ చేశారు. అక్కడ నుంచి సెల్ఫీలు దిగి సంబరపడ్డారు.




ఒక్కరోజులోనే మళ్లీ ముందుకు..

సముద్రం వెనక్కి వెళ్లిపోయిందంట! అంటూ ఆనోటా ఈనోటా విన్న విశాఖ జనం సోమవారం సాగరతీరానికి వెళ్లారు. అయితే సోమవారం ఉదయానికే సాగరం మళ్లీ మనసు మార్చేసుకుంది. ఎప్పటిలాగే మళ్లీ ముందుకు బీచ్/తీరం వైపు ఉరకలేస్తూ కనిపించింది. దీంతో ఎంతో ఆశతో వెళ్లిన వారు నిరాశతో వెనుదిరిగారు. 'ఇటీవల కాలంలో ఎన్నడూ సముద్రం ఇంతలా వెనక్కి వెళ్లడం నేను చూడలేదు. ఇలా వెనక్కి వెళ్లడం వల్ల ఆర్కే బీచ్ మునుపెన్నడూ లేనంత విశాలంగా కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని బీచ్ కొచ్చిన వారంతా ఎంతో ఎంజాయ్ చేశారు. ఈరోజు మళ్లీ ఎప్పటిలాగే ముందుకొచ్చేసింది' ఆర్కే బీచ్ లో ఐదేళ్ల నుంచి మురీ మిక్సర్ అమ్ముకుని ఉపాధి పొందుతున్న కిరణ్ 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్'కు చెప్పాడు.





కడలిలో కరెంట్స్ మారడం వల్లే..

సముద్రంలో ఉండే కరెంట్స్ మారడం వల్లే కడలి ముందుకు, వెనక్కి వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో రిప్ కరెంట్స్ రివర్స్ అవుతుంటాయి. ‘సహజంగా రిప్ కరెంట్స్ ఉత్తరం వైపు పయనిస్తాయి. ఆగస్టులో అవి రివర్స్లో దక్షిణానికి వెళ్తాయి. దీనివల్ల సముద్రం ఈ నెలలో ఒకట్రెండు సార్లు వెనక్కి వెళ్తుంది. ఇది తాత్కాలికమే. మళ్లీ ఒకట్రెండు రోజుల్లోనే సముద్రం సాధారణ స్థితికి (ముందుకు) వచ్చేస్తుంది. ఆగస్టులో మాదిరిగానే అప్పుడప్పుడు జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ ఇలాంటి సముద్రం వెనక్కి వేళ్లే పరిస్థితి కనిపిస్తుంది' అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ వీవీఎస్ఎస్ శర్మ 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్'కు చెప్పారు.




ఇటీవల భీమిలి తీరంలోనూ సముద్రం ఎర్రబారింది. తాజాగా ఇప్పుడు విశాఖ సాగరతీరం కూడా నీలి రంగుకు బదులు తేలికపాటి ఎర్రరంగుతో దర్శన మిస్తోంది. భీమిలి వద్ద సముద్రం ఎరుపుగా కనిపించడానికి అక్కడకు సమీపంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బల మన్ను వర్షాలకు కొట్టుకు వెళ్లి సాగరంలో కలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆర్కే బీచ్ రెండున్నర దశాబ్దాల క్రితం కురుసురా సబ్మెరైన్ మ్యూజియం ఏర్పాటు చేసే సమయంలో ఎర్రమట్టి వేసి దానిపై ఇసుక వేసి నిర్మాణాన్ని చేపట్టారు. వర్షాలు కురిసినప్పుడు అప్పుడప్పుడు ఈ ఎర్రమట్టి సముద్రంలో కలవడం, కరెంటు వల్ల దిగువన భూమి కోతకు గురవడం వల్ల సముద్రం రంగు మారే అవకాశంముంటుందని శర్మ అభిప్రాయపడ్డారు.

Read More
Next Story