
'మంచు' వర్శిటీ 'కంచు' కాదు, మంచిదేనంటున్న విష్ణు
ఎక్కడా అవకతవకలకు పాల్పడలేదన్న యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు
తిరుపతి జిల్లా రంగంపేటలోని మంచు మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం మంచిదేనని, ఎక్కడా అవకతవకలకు పాల్పడలేదని యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు (Manchu Vishnu) పేర్కొన్నారు. కోర్టులో ఉన్న విషయాలపై వివాదాలు సరికాదన్నారు. ఈ విశ్వవిద్యాలయంపై వచ్చిన అవకతవకలకు సంబంధించి విష్ణు బుధవారం సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటివాటిపై ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు కుమారుడు విష్ణు వివరణ ఇచ్చారు.
ప్రైవేటు విశ్వవిద్యాలయానికి (Mohan Babu University News) ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించినట్టు వార్తలు వచ్చాయి. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,17,52,872 తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసి, ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ క్రమంలో మీడియాలో వస్తున్న వార్తలపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు (Manchu Vishnu) వివరణ ఇస్తూ ఉద్దేశపూర్వకంగా మీడియాలో ప్రసారం చేస్తున్న నిరాధార వార్తలను నమ్మొద్దని కోరారు.
‘‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సుల గురించి వివిధ మీడియా మాధ్యమాలలో ప్రచారమవుతున్న వార్తలను ఉద్దేశించి ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం. మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవి కేవలం సిఫార్సులు మాత్రమే. ఈ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్-జ్యుడిస్) ఉంది. APHERMC సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా హైకోర్టు ‘స్టే’ ఉత్తర్వును జారీ చేసింది. కోర్టు ఉత్తర్వును ధిక్కరించి దీనిని పోర్టల్‌లో పెట్టడం దురదృష్టకరం. APHERMC చేసిన సిఫార్సులు సరికాదని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం గట్టిగా విశ్వసిస్తోంది’’ అని విష్ణు పేర్కొన్నారు.
‘‘విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దని తల్లిదండ్రులకు, మీడియాకు తెలియజేస్తున్నాం. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్శిటీ బృందం పూర్తిగా సహకరించిందని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం చూస్తే, ఎలాంటి తప్పు జరగలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది తల్లిదండ్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదములు. మా ఛాన్సలర్ డాక్టర్ ఎం.మోహన్ బాబు (Mohan Babu) మార్గదర్శకత్వంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తిమంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తాం’’ అని మంచు విష్ణు తెలిపారు.
అసలేం జరిగిందంటే...
తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీవిద్యానికేతన్ 2022లో మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారింది. అప్పటి వరకు శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లలో 70%, ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్‌ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లోని 35% సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. వీటికి ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఫీజులను నిర్ణయిస్తుంది. ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. విశ్వవిద్యాలయంలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌తో పాటు విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది.
2022-23 నుంచి గతేడాది సెప్టెంబరు 30 వరకు విద్యార్థుల నుంచి మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం అదనంగా రూ.26.17 కోట్లు వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఆ విశ్వవిద్యాలయం అనుమతి, గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్‌సీఏహెచ్‌పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సెల్‌కు సిఫార్సు చేసింది.
Next Story