గ్రామాలు నాకు జర్నలిజం నేర్పాయి... సీనియర్‌ ఎడిటర్‌ కె శ్రీనివాస్‌
x

గ్రామాలు నాకు జర్నలిజం నేర్పాయి... సీనియర్‌ ఎడిటర్‌ కె శ్రీనివాస్‌

జర్నలిస్టుగా నేరు సిర్థరపడటానికి గ్రామాల్లోని కంట్రిబ్యూటర్లు కారణం. ఎక్కడికి వెళ్లినా ఆప్రాంతాన్ని పరిశీలించడం నా విధుల్లో భాగమైంది.


నా జర్నలిస్ట్‌ జీవితం విజయవాడలో ప్రారంభమైంది. సబ్‌ ఎడిటర్‌గా జర్నలిస్ట్‌ జీవితాన్ని ప్రారంభించిన నేను అన్ని ప్రాంతాలు తిరగటం వల్ల రాష్ట్రంపై పట్టు సాధించా. అక్కడ జరిగే విశేషాలే నా జీవితంలో మంచి జ్ఞాపకాలు మిగిల్చాయని ప్రముఖ సీనియర్‌ ఎడిటర్‌ కె శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం విజయవాడలోని ఏపీయూడబ్య్లుజె ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన గెట్‌ టు గెదర్‌ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమానికి ఏపీయూడబ్య్లుజె రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అధ్యక్షత వహించారు. గెట్‌ టు గెదర్‌లో శ్రీనివాస్‌ మాట్లాడుతూ నేను తెలంగాణ రావాలని కోరుకున్నాను. ఉద్యమం బాగా జరుగుతున్న రోజుల్లో ఉద్యమ వార్తలు బాగా రాసినా, తాను రాసే ఆర్టికల్స్‌కు మిశ్రమ స్పందన ఉండేది. ఒక పక్క తెలంగాణ కావాలని కోరుకుంటూనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రజ్యోతి పత్రికకు ఎడిటర్‌గా ఉన్నా. ఆంధ్రా గురించి నెగటివ్‌ వస్తే తెలంగాణను ప్రేమించే వాడిగా ముద్ర వేశారు. తెలంగాణకు అనుకూలంగా రాస్తే ఆంధ్రావాళ్లు సహించే వాళ్లు కాదు. అటువంటి సందర్బాల్లో జర్నలిజం అంటే కత్తిమీద సాములా ఉండేదన్నారు.

యాజమాన్యాల మనసును అర్థం చేసుకుని వెళ్లాలి. అలాగని ప్రజల మనోభావాలకు కూడా చోటివ్వాలి. అప్పుడే పత్రిక మనగలుగుతుందన్నారు. విజయవాడ వృత్తి పరంగానే కాక సాహిత్య పరంగా ప్రతి ఏడాది జరిగే పుస్తక ప్రదర్శనకు వస్తూ ఎంతో మంది మిత్రులను సంపాదించుకున్నానన్నారు. పాత్రికేయులు కుల మతాలకు అతీతంగా సమాజం కోసం పనిచేయాలన్నారు. అందుకే తన రాతలు మొదట అనుమానించినా తరువాత అభిమానించారన్నారు. ఎడిటర్ గా క్షేత్రస్థాయి పర్యటనల్లో గ్రామీణ విలేకరుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, వారే నాకు మొదటి గురువులన్నారు. శ్రీశ్రీ మహా ప్రస్థానం విశాఖపట్నంలోని ఏ ప్రాంతాల్లో కూర్చుని రాశాడో తెలుసుకుని రాయించిన కథనం తనకు సంత`ప్తినిచ్చిందన్నారు. ఇతరులకు అవసరం లేకపోవచ్చు కానీ శ్రీశ్రీ గురించి తెలుసుకోవాలనుకున్న వారికి ఈ కథనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

శ్రీనివాస్ సతీమణి సుధ మాట్లాడుతూ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తాడని, గొప్ప తండ్రిగా పేరు సంపాదించుకున్నారని, ఏ సందర్భంలోనైనా పిల్లలు అమ్మా అంటే మా పిల్లలు నాన్నా అంటారన్నారు. మా జీవితం విజయవాడలోనే మొదలైందన్నారు. శ్రీనివాస్ అరెస్టైనప్పుడు జర్నలిస్ట్ లంతా మాతోనే ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

పలువురు జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు శ్రీనివాస్ సమాధానాలు చెప్పారు. పాత మిత్రులు అనేక మంది కలిసారు. కేవలం ఆయన రాసిన ఎడిటోరియల్స్‌ చదివిన అభిమానులు కూడా గెట్‌ టు గెదర్‌ కార్యక్రమానికి వచ్చారు. ఎపియూడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిజం ఎథిక్స్‌ గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోయిందన్నారు. యూనియన్ నాయకత్వాన శ్రీనివాస్ ను ఘనంగా శాలువాలతో సన్మానించారు. విజయవాడలో ఉండగా స్నేహితులు ఎంతో మంది వుండే వారని శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. సమావేశంలో సీనియర్‌ జర్నలిస్ట్‌లు కంచర్ల జయరాజ్, చావా రవి, దారం వెంకటేశ్వరావు, ఎస్‌కె బాబు తదితరులు మాట్లాడుతూ ఎడిటర్‌గా పాఠకులు ఎమి కావాలని కోరుకుంటున్నారో తెలుసుని ఎడిటోరియల్స్‌ రాసిన వారిలో శ్రీనివాస్‌ ఒకరన్నారు. మంచి భాషా ప్రావీణ్యంతో సామాన్యునికి అర్థమయ్యే విధంగా చక్కనైన వాడుక భాషను వాడేవాడన్నారు. మంచి స్నేహభావం ఉన్న వారుగా పలువురి అభినందనలు అందుకున్నారు.

Read More
Next Story