విజయవాడలో మళ్ళీ వర్షం.. లోకేష్‌కు చంద్రబాబు కీలక ఆదేశాలు..
x

విజయవాడలో మళ్ళీ వర్షం.. లోకేష్‌కు చంద్రబాబు కీలక ఆదేశాలు..

రెండు రోజుల వర్షాల కారణంగా విజయవాడ అంతా కూడా వరదలో మునిగిపోయింది. లక్షలాది మంది ప్రజలు వరదలో చిక్కుకుని నిత్యావసరాల కోసం కూడా తిప్పలు పడ్డారు.


రెండు రోజుల వర్షాల కారణంగా విజయవాడ అంతా కూడా వరదలో మునిగిపోయింది. లక్షలాది మంది ప్రజలు వరదలో చిక్కుకుని నిత్యావసరాల కోసం కూడా తిప్పలు పడ్డారు. మూడు రోజుల నుంచి విజయవాడలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు కూడా విజవాడకు చేరుకుని అక్కడ చేపడుతున్న సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. ఈ వర్షాల నుంచి కాస్తంత ఎడతెరిపి లభించడం, ప్రకాశం వ్యారేజీలో వరద తగ్గడంతో విజయవాడ వాసులంతా కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతలో విజవాడలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. అర్థరాత్రి నుంచి వర్షం భారీగా కురుస్తోంది. దీంతో మరోసారి సహాయక చర్యలు చేపట్టడానికి సన్నద్ధమయ్యారు. వరద నుంచి కాస్తంత విరామం లభించిందని ఆనందపడేలోపే మరోసారి విజయవాడను వర్షం అతలాకుతలం చేస్తుండటంతో విజయవాడ వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడటమే ఈ వర్షాలకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు అందించే సాయం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అందరికీ అండగా ఉంటాం: సీఎం

వరదలతో తల్లడిన ప్రజలకు అందించే సహాయం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ వరదల్లో వాహనాలను కోల్పోయిన వారికి ఇన్సూరెన్స్ ఇప్పించే విధంగా సదరు సంస్థలతో ప్రభుత్వం చర్చలు చేస్తుందని తెలిపారు. ఈమేరకు అన్ని ఇన్సురెన్స్ సంస్థలతో సమావేశం నిర్వహిస్తామని, నీట మునిగిన అన్ని వాహనాలకు ఇన్సూరెన్స్ లభించేల చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాంతో పాటుగానే వాహనాలను రిపేర్ చేయించడానికి కూడా చర్యలు చేపడతామని తెలిపారు. అంతేకాకుండా విజయవాడలో మరోసారి వర్షాలు ప్రారంభం కావడంతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం చంద్రబాబు. మరోసారి వరదలు వస్తే మాత్రం నష్ట నివారణకు పెద్దపీట వేయాలని, దాంతో పాటుగా ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టాన్ని శూన్యంగా ఉంచడానికి శ్రమించాలని చెప్పారు. అదే విధంగా ముంపు ప్రాంతాల్లో ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పారు.

బుడమేరుకు మళ్లీ వరద

రాష్ట్రంలో సంభవిస్తున్న అకాల వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగడం మొదలైపోయింది. నిన్నటి వరకు పొంగిపోర్లి కాస్తంత శాంతించిన బుడమేరుకు మరోసారి వరద ప్రవాహం పెరిగింది. దీనిపై కూటమి సర్కార్ దృష్టిసారించింది. బుడమేరుకు పడిన గండ్లు పడిన ప్రదేశాల్లో మరమ్మతులను యుద్ధప్రాతిపదిక చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 200 మీటర్ల మేర గండ్లు పడడంతో కవులూరు, ఈలప్రోలు రాయనపాడు, సింగినగర్ మీద బుడమేరు ప్రభావం తీవ్రంగా ఉంది. వరద ఉధృతి తగ్గడంతో గండ్ల పూడ్చే పనులను అధికారులు హుటాహుటిన చేపట్టారు. ఈ గండ్లను పూడ్చే పనులను స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి నారా లోకేష్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో బుడమేరు వద్దకు లోకేష్ బయలుదేరి వెళ్లారు. లోకేష్ పర్యవేక్షణలో పనులను వేగవంగం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Read More
Next Story