
వైభవంగా విజయవాడ దుర్గమ్మ దసరా నవరాత్రులు
ఈ మహోత్సవాలకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి 18లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలసిన దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు సోమవారం బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో దుర్గమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 11 రోజుల్లో 11 రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దసర నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. దీంతో దుర్గమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.
సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 వరకు ఈ నవరాత్రుల వేడుకలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం, నవరాత్రుల ఉత్సవాలను తిలకించడం కోసం రానున్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు సుమారు 18లక్షల మంది భక్తులు తరలి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు చేసుకునేందుకు అనుమతిస్తారు. రెండో రోజు మంగళవారం నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనాలకు అనుమతిస్తారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఈ సారి వేడుకల్లో గతంలో కంటే సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఆలయ ఈవో వికే శీనానాయక్ వెల్లడించారు. ప్రత్యేకించి ‘దసరా–25’ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. భక్తులు దీనిని వినియోగించుకోవాలని సూచించారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు అమ్మవారిని దర్శించుకోనున్నారు. మూల నక్షత్రం సందర్భంగా సెప్టెంబరు 29న వచ్చే సోమవారం సరస్వతీ దేవి రూపంలో కొలువయ్యే దుర్గమ్మ అమ్మవారిని సీఎం దర్శించుకోనున్నారు. దీంతో పాటుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ట్రాఫిక్ డైవర్షన్ ఇలా
దుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. సోమవారం నుంచి అక్టోబరు 2 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. హైదరాబాద్ వైపు నుంచి విశాఖపట్నం వైపునకు నల్లగుంట నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా చిన్నఅవుటపల్లి, హనుమాన్ జంక్షన్ వైపు వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. అటువైపు నుంచి వచ్చే వాహనాలు కూడా ఇదే రూట్ గుండా రావలసి ఉంటుంది.
హైదరాబాద్ వైపు నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే వాహనాలు నల్లగుంట దగ్గర బెస్ట్ బైపాస్ ఎక్కి చిన్నఅవుటపల్లి, కేసరపల్లి మీదగా వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే రూట్ గుండా రావలసి ఉంటుంది.
హైదరబాద్ వైపు నుంచి గుంటూరు, చెన్నై వైపునకు నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, అద్దంకి, మేదరమెట్ల మీదుగా వాహనాల రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
చెన్నై వైపు నుంచి విశాఖపట్నం వైపు రాకపోకలకు ఒంగోలు, త్రోవగుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది.
పార్కింగ్ ప్రాంతాలు
విజయవాడ నగరంలో భవానీపురం వైపు నుంచి వచ్చే వాహనాలు కుమ్మరిపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానం పార్కింగ్, ఎంవీరావు ఖాళీ స్థలం, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, సుబ్బరాయుడు పార్కింగ్, సెంట్రల్ వేర్ హౌస్ గ్రౌండ్, గొల్లపూడి మార్కెడ్ యార్డు పార్కింగ్, భవానీపురం లారీ స్టాండ్, సోమా గ్రౌండ్, సితార సెంటరు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, గొల్లపూడి పంట కాలువ రోడ్డులో వాహనాలను నిలపాల్సి ఉంటుంది. గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే వాహనాలు బీఆర్‌టీఎస్ రోడ్డు, సంగీత కళాశాల గ్రౌండ్, ఎఫ్‌ఐసీ మట్టి రోడ్డు పార్కింగ్, జింఖానా గ్రౌండ్‌లో వాహనాలను నిలపాల్సి ఉంటుందని విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు.
Next Story