
విజయవాడ ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనం డిజైన్లు అదిరిపోవాలి
విజయవాడ ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనం నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై బుధవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా, విభిన్నంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, జాతీయ రహదారిని అనుసంధానించేలా ర్యాంప్ నిర్మాణం వంటి పలు అంశాలపై సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. టెర్మినల్ భవనం ఎలివేషన్, డిపార్చర్, అరైవల్ బ్లాక్‌లు, ప్రయాణికుల లాంజ్‌లు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మన సంప్రదాయ నృత్యకళ కూచిపూడి, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపాక్షి కళాకృతులతో డిజైన్లు రూపొందించాలని సూచించారు.