పెద్ద చెరువులో ప్రత్యక్షమైన పైడితల్లి!
x

పెద్ద చెరువులో ప్రత్యక్షమైన పైడితల్లి!

267 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవం. విజయనగరం రాజవంశీయుల ఇలవేల్పు. ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారి ఉత్సవం.


(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్న విజయనగరం పైడితల్లి అమ్మవారు 267 ఏళ్లుగా పూజలందుకుంటున్నారు. ఏడాదికోసారి ఈ అమ్మవారు సిరిమాను సంబరంగా పిలుచుకునే ఉత్సవాన్ని జరిపించుకుంటారు. ఈ సంబరానికి ఒక్క ఉత్తరాంధ్ర నుంచే కాదు.. పక్కనున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, చత్తీసగఢ్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి కూడా ఈ అమ్మవారి ఉత్సవానికి పోటెత్తుతుంటారు. ఈ ఏడాది ఆ ఉత్సవాన్ని ఈనెల 15న మంగళవారం అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆ పైడితల్లి అమ్మవారి వైశిష్ట్యం.. మీ కోసం..

ఈ పైడితల్లి.. పెద్ద రాజుగారి చెల్లి..

విజయనగరం మహారాజ వంశానికి చెందిన పూసపాటి పెద విజయరామరాజు చెల్లెలు పైడితల్లి. బాల్యం నుంచే ఆమెకు ఆధ్యాత్మిక భావాలెక్కువ. దేవీ ఉపాసకురాలు కూడా. అన్న.. పొరుగు రాజ్యం బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతకు గురి చేసింది. ఆమె యుద్ధ నివారణ ప్రయత్నించినా అన్నయ్య వినలేదు. 1757లో బొబ్బిలిపై యుద్ధాన్ని ప్రకటించాడు. అయితే బొబ్బిలి రాజుల (వెలమల) చేతిలో విజయరామరాజు పరాజయం పాలయ్యాడు. అదే రోజు రాత్రి దేవి ఆమె కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది. ఉపవాస దీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలస్వామినాయుడు, మరికొందరు అనుచరులను వెంటబెట్టుకుని బొబ్బిలి బయల్దేరింది. కొద్ది దూరం వెళ్లాక ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. తన ప్రతిమ పెద్ద చెరువులో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి పైడితల్లి దేవిలో ఐక్యమైందని అమ్మవారి ఆత్మకథలో ఉంది.

పూసపాటి రాజుల ఇలవేల్పు..

అప్పట్నుంచి పూసపాటిరాజుల ఇలవేల్పు అయింది పైడితల్లి. 1757లో విజయదశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని అప్పలస్వామినాయుడు వెలికితీశాడు. అనంతరం మూడు లాంతర్ల జంక్షన్లో అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగింది. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పట్నుంచి ఆ కుటుంబీకులే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ఆ పూజారులే సిరిమానోత్సవంలో సిరిమానును అధిరోహించి భక్తులను ఆశీర్వదిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సిరిమానును పూజారి బంటుపల్లి వెంకట్రావు అధిరోహించనున్నారు. ఈ సిరిమానోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచే కాదు.. ఒడిశా, పశ్చిమ బెంగాల్, చత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి కూడా లక్షలాది మంది హాజరవుతారు.

సిరిమానోత్సవానికో విశిష్టత!

అమ్మవారి జాతర సందర్భంగా సిరిమానోత్సవానికి ఓ విశిష్టత ఉంది. ఏటా 33 మూరల పొడవుండే సిరిమాను కోసం గాలించి తెస్తారు. ఈ మాను ఆచూకీ లభించడం ఓ గొప్పగా భావిస్తారు. ఆ పొడవైన గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో ప్రధాన పూజారి కూర్చుని గుడికి ప్రదక్షిణ చేయడం ఉత్సవంలో ప్రధాన ఘట్టం. సిరిమాను రథం ఊరేగింపులో ఎనిమిది రసవత్తర సన్నివేశాలుంటాయి. పూజారి చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆకర్షణ. సిరిమాను తిరుగుతున్నంత సేపు భక్తులు అరటిపండ్లు విసురుతారు. ఎంతో శోభాయమానంగా సువర్ణవర్ణంతో కళకళలాడే సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథంలను చూసేందుకు భక్తజనం ఎగబడుతుంటారు. చెరువు గర్భంలో ఉన్న అమ్మవారి మూల విరాట్టును బయటకు తీయడంలో స్థానిక జాలర్లు ఎంతో కృషి చేశారు. దీంతో ఈ జాలర్లు (బెస్తలు) ప్రధాన పూజారి అప్పలనాయుడిని ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతోంది. ఏటా జరిగే సిరిమాను సంబరంలో ముందు వలతో నడిచే అవకాశం

ఇవ్వాలన్న కోరికను మన్నించడంతో అప్పట్నుంచి అది ఆనవాయితీగా వస్తోంది. జాలరి వల వెనక ఈటెలతో వచ్చే జనం సాధారణ ప్రజలు కాదు. వీరిని అమ్మవారి సైనిక శక్తికి ప్రతిరూపంగా చెబుతారు. పూర్వం కోట వెనుక అడవిలో నివసించే ఆటవికులు కోటకు రక్షణగా ఉండేవారని కథనం. దానికి గుర్తుగానే వీరు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. అలాగే ఈ జాతరలో తెల్ల ఏనుగు మరో విశిష్ట ఆకర్షణ. గజపతుల ప్రాభవాన్ని ప్రతిబింబించేలా పట్టపుటేనుగును అమ్మవారి సిరిమానోత్సవంలో ఉంచేవారు. కాలక్రమంలో సంస్థానాలు పోవడంతో 1956 నుంచి దాని స్థానంలో ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమాను ముందు నడిపిస్తున్నారు. ఈ బండిపై ఏడుగురు స్త్రీ వేషధారులు, ఒక పురుషుడు ఉంటారు. ఈ ఏడుగురు పైడితల్లి అక్కచెల్లెళ్లు, పురుషుడు ఏకైక సోదరుడు

పోతురాజుగా చెబుతారు. ఇక సిరిమాను సంబరంలో చివరిది, చిత్రమైనది అంజలి రథం. అమ్మవారి వైభవానికి ఈ రథం ప్రత్యేక నిదర్శనం. ఈ రథంపై ఉండే ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించి తరించిన పరిచారికలలు. నాడు తల్లిపై వాళ్లు చూపించిన భక్తి ప్రపత్తులను నేటికీ గుర్తుకు తెచ్చేలా ఈ రథంపై వేషధారులు సిరిమాను ముందు అంజలి ఘటిస్తూ కనిపిస్తారు. ఇలా బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం నడుస్తుండగా వివిధ వేషధారులు భక్తిపారవశ్యంతో కదం తొక్కుతారు. పరుగిడతారు. లక్షలాది మంది భక్తులు అమ్మ వారి వైభవాన్ని తనివితీరా వీక్షిస్తూ తన్మయత్వం చెందుతారు. పైడితల్లి అమ్మవారు తన గుడి నుంచి బయటకు వచ్చి ముగ్ధమనోహరంగా అలంకరించిన సిరిమానుపై పూజారి వేషంలో ఆశీనులై ఊరేగుతారు.

5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా..

ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి పండుగ ఈనెల 15న జరగనుంది. ఈ సిరిమాను సంబరానికి అవసరమైన ఏర్పాట్లను అటు దేవస్థానం, ఇటు పోలీసు అధికారులు పూర్తి చేశారు. పొడవైన భారీ క్యూలైన్లను నిర్మించారు. తాటాకు పందిళ్లు వేశారు. ఈ మహా జాతరకు సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్టు విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించడానికి 80 సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. ఏరియల్ సర్వే, నిఘాకు మూడు డ్రోన్లను వినియోగిస్తారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించామని తెలిపారు.

ఎన్నెన్నో అలరించే వేడుకలు..

పైడితల్లి అమ్మవారి పండుగకు విజయనగరం పట్టణం ఇప్పటికే సర్వాంగ సుందరంగా తయారైంది. విజయనగరం సంస్కృతి, సంప్రదాయాలు, గత వైభవాన్ని చాటిచెప్పేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు 12 వేదికలను సిద్ధం చేశారు. లేజర్ షో, వివిధ నృత్యాలు, శాస్త్రీయ సంగీత విభావరిలు, సినీ ఆర్కెస్ట్రాలు, సత్య హరిశ్చంద్ర, కన్యాశుల్కం వంటి నాటకాలు, నాటికలు, శతాధిక కవి సమ్మేళనం, సాహితీ గోష్ఠి, కోలాటాలు, జానపద నృత్యాలు, హాట్ ఎయిర్ బెలూన్ షో వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Read More
Next Story