తెలుగు సాహిత్యానికి జవసత్వాలిచ్చిన విజయభారతి
తెలుగు సాహిత్యం,సామాజిక ఉద్యమాలు బలోపేతానికి, సమగ్రతకు ఘణనీయమైన కృషి చేసిన మహనీయురాలు, రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి బొజ్జా విజయభారతి.
తెలుగు సాహిత్యం,సామాజిక ఉద్యమాలు బలోపేతానికి, సమగ్రతకు ఘణనీయమైన కృషి చేసిన మహనీయురాలు, రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి బొజ్జా విజయభారతి అని పలువురు వక్తలు నివాళులర్పించారు. సామాజిక న్యాయ సాధన సమితి, పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దివంగతురాలైన విజయభారతి సంతాపసభ ఆదివారం ఉదయం కాకినాడలోని గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో జరిగింది. ఈ సభకు సమితి నాయకులు ఎ.రామేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా ఫ్రీలాన్స్ జర్నలిస్టు మలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ అప్పటివరకూ నిర్లక్ష్యం కాబడిన లేదా చూడడానికి ఇష్టపడని కోణాన్ని విజయభారతి తీసుకుని తన సాహిత్య రచన చేశారని వివరించారు. తెలుగునేలపై ప్రజా సాహిత్యం, దళిత, బహుజన ప్రజాఉద్యమాలు బలోపేతం కావడానికి ఆమె రచనలు ఎంతగానో దోహదపడినాయని చెప్పారు.
1982, 1987లలోనే అంబేద్కర్, జ్యోతిరావుపులే జీవిత చరిత్రలను ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించి ఆ మహనీయులను తెలుగువారికి ఆమె పరిచయం చేశారని కొనియాడారు. రచయితలకు, ఉద్యమకారులకు సాహిత్యంలోనూ, ప్రజా ఉద్యమాలలోనూ ప్రతిభతోపాటు నిజాయితీ, ఆచరణ ఉంటేనే మంచి సాహిత్యం, నిజమైన ప్రజా ఉద్యమాలు వస్తాయని ఆమె విశ్వసించి తన కార్యాచరణ సాగించారని విశ్లేషించారు. సమితి నాయకులు రామేశ్వరరావు మాట్లాడుతూ విజయభారతితో వ్యక్తిగతంగా ఉన్న అనుభవాలను వివరించారు.
ఉద్యమకారుడు బొజ్జా తారకం, విజయభారతి దంపతులు ప్రజా ఉద్యమాల విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకునేవారని, చాలా ఆదర్శవంతమైన దాంపత్య జీవితం గడిపారని అన్నారు. దళిత కళామండలి నాయకుడు పెయ్యల పావన ప్రసాద్ మాట్లాడుతూ రచయిత్రిగా విజయభారతి తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ప్రశంస నీయమైనదన్నారు. ముఖ్యంగా భారత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఆమె రచనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సభలో రిటైర్డ్ జిల్లా వైద్యాధికారి ఎం.పావన్ కుమార్, బుద్ధ విహర్ ప్రతినిధులు డాక్టర్ కె. భానుమతి, కాశి రామారావు, పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎన్.నూకరాజు, కెవిపిఎస్. జిల్లా కార్యదర్శి కే.సింహాచలం తదితరులు పాల్గొని ప్రసంగించారు.