తిరుమల వివాదం నేపధ్యంలో వీహెచ్ మౌనదీక్ష
x

తిరుమల వివాదం నేపధ్యంలో వీహెచ్ మౌనదీక్ష

శ్రీవారి దేవాలయంలో అపచారం జరిగిందన్న చంద్రబాబు ఆరోపణలపై నిజాలు తేలాలంటే వెంటనే అత్యున్నత స్ధాయి విచారణ జరగాలని వీహెచ్ డిమాండ్ చేశారు.


తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ వివాదం నేపధ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు మౌనదీక్షకు కూర్చున్నారు. మంగళవారం ఉదయం లిబర్టీ సెంటర్లోని తిరుమల తిరుపతి దేవస్ధానం ఆలయం పక్కనే వీహెచ్ మౌనదీక్షకు దిగారు. తన మద్దతుదారులతో కలిసి ఉదయం 10 గంటల ప్రాంతంలో వీహెచ్ దీక్షలో కూర్చున్నారు. వెంకటేశ్వరస్వామి దేవాలయం పక్కనే వీహెచ్ దీక్షకు కూర్చోవటం గమనార్హం. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో తక్కువ క్వాలిటి నెయ్యిని వాడతంతో పాటు జంతుకొవ్వును కూడా వాడారని చంద్రబాబునాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆరోపణలపై జనాల్లో మిశ్రమస్పందన కనబడుతోంది.

శ్రీవారి దేవాలయానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో అపచారం జరిగిందని చెప్పిన చంద్రబాబు దేవాలయం మొత్తాన్ని సోమవారం శుద్ధి, సంప్రోక్షణ కూడా చేయించారు. నాసిరకం నెయ్యి వాడకంతో పాటు జంతుకొవ్వును వాడారని చెప్పి విచారణ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను కూడా నియమించారు. ఇదే సమయంలో సిట్ విచారణ జరిపితే ఉపయోగం ఉండదన్న జగన్ సీబీఐతో కాని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో దేవాలయంలో ఎలాంటి అపచారం జరగలేదని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతనగా దేశంలోని రాజకీయపార్టీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ నేపధ్యంలోనే వీహెచ్ తన మద్దతుదారులతో మౌనదీక్షకు దిగటం గమనార్హం. శ్రీవారి దేవాలయంలో అపచారం జరిగిందన్న చంద్రబాబు ఆరోపణలపై నిజాలు తేలాలంటే వెంటనే అత్యున్నత స్ధాయి విచారణ జరగాలని వీహెచ్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీనియర్ నేత డిమాండ్ చేశారు.

Read More
Next Story