కసి, పట్టుదలే చంద్రబాబును గెలుపువైపు నడిపించాయా ?
తెలుగుదేశంపార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని నేతలు, కార్యకర్తలు గుర్తించటంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద పెరిగిపోయిన తీవ్ర వ్యతిరేకత.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీచేసిన మంత్రి విడదల రజని ఆఫీసుపై తమ్ముళ్ళు రాళ్ళదాడి చేశారు. రాజమండ్రిలో టీడీపీ మద్దతుదారులు ఫ్యాన్ గుర్తును రోడ్డుమీద పడేసి తుక్కుతుక్కుగా ఇరగొట్టారు. పై ఘటనలు రెండు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితంకాలేదు. ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో దాదాపు ఇలాంటి ఘటనలే కనబడుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే తెలుగుదేశంపార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని నేతలు, కార్యకర్తలు గుర్తించటంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద పెరిగిపోయిన తీవ్ర వ్యతిరేకత. ఈ రెండు కారణాల వెనుక చంద్రబాబునాయుడు వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు ప్రధానంగా కనబడుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ కూటమి అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది.
తాజా సమాచారం అందేసమయానికి టీడీపీ కూటమి 147 సీట్ల ఆధిక్యంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. పేరుకు కూటమి విజయమనే కాని మొత్తం క్రెడిటంతా చంద్రబాబునాయుడు సొంతమనే చెప్పాలి. చంద్రబాబు వ్యూహాలు లేకపోతే కూటమి లేదు కూటమి విజయమూ లేదు. కూటమి అఖండ విజయం వెనుక చంద్రబాబులో పెరిగిపోయిన కసి, పట్టుదల కీలకపాత్ర పోషించాయనే చెప్పాలి. కసి, పట్టుదల గురించి వివరంగా చెప్పుకోవాలి. ఇందులో కీలకం ఏమిటంటే ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే పార్టీ పరిస్ధితి తెలంగాణాలో లాగే అయిపోతుంది. ఇదే జరిగితే చంద్రబాబుతో పాటు కొడుకు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిపోతుంది. అందుకనే చావో రేవో తేల్చుకోవాల్సిన ఈ ఎన్నికల్లో చంద్రబాబు పట్టుదలగా వ్యవహరించారు.
చంద్రబాబు పట్టుదల ఎక్కడ కనబడుతుందంటే ముందుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవటంలో. పవన్ కు ఇష్టంలేకపోయినా పదేపదే పొగుడుతు, ఆకాశానికి ఎత్తేస్తు టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్ధితులను పవన్ కు చంద్రబాబు కల్పించారు. ప్రయత్నం చేయగా, చేయగా చివరకు చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారు. ఎప్పుడైతే టీడీపీతో పవన్ పొత్తుపెట్టుకున్నారో వెంటనే చంద్రబాబు రెండో అంకానికి తెరలేపారు. అదేమిటంటే పవన్ను ప్రయోగించటం ద్వారా బీజేపీకి దగ్గరయ్యారు. తనను బీజేపీ ఎంతదూరం పెట్టినా పట్టించుకోకుండా పదేపదే నరేంద్రమోడి, అమిత్ షా దృష్టిలో పడటానికి పవన్ను ఉపయోగించుకున్నారు. చివరకు ఎన్నికల ముందు పవన్ రాయబారం ఫలించి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటానికి బీజేపీ అంగీకరించింది. ఫలితంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా పోటీచేశాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనసేన, బీజేపీతొ పొత్తు పెట్టుకోవటం చాలామంది సీనియర్ తమ్ముళ్ళకి ఇష్టంలేకపోయినా చంద్రబాబు పట్టించుకోలేదు.
టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటవ్వటానికి చంద్రబాబు చాలా ఓపికగా వెయిట్ చేశారు. ఎందుకంటే సొంతంగా ఎన్నికలకు వెళితే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా అనుభవం ఉంది కాబట్టే. ఇక మొదట్లో చెప్పుకున్నట్లు జగన్మోహన్ రెడ్డిపైన కసి పేరుకుపోయింది. జగన్ పైన కసి ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీని చావుదెబ్బకొట్టి 23 సీట్లకే పరిమితం చేశారు కాబట్టి. ఐదేళ్ళ జగన్ పాలనలో చంద్రబాబు, లోకేష్ చాలా ఇబ్బందిపడ్డారు. రెండోసారి జగన్ సీఎం అయితే కొడుకు లోకేష్ భవిష్యత్తు అంధకారమైపోతుందనే భయం చంద్రబాబులో పెరిగిపోయింది. ఆ భయమే కసిగామారి జగన్ను ఓడించాలనే పట్టుదలగా మారింది. అందుకనే పొత్తులు పెట్టుకోవటంతో పాటు తనకు మద్దతుగా నిలిచే మీడియాను యధేచ్చగా ఉపయోగించుకున్నారు. జగన్కు వ్యతిరేకంగా మీడియాను ఉపయోగించుకోవటంలో చంద్రబాబులోని కసి అర్ధమవుతుంది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టుచేసినపుడు మద్దతుమీడియా ఎలా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే.
ఈ మొత్తం ఎపిసోడులో చంద్రబాబుకు మ్యాన్ ఆఫ్ ది సీరియస్ అవార్డు ఇవ్వాల్సిందే. ఎందుకంటే జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. టీడీపీలోనే కాకుండా మిత్రపక్షాల్లో కూడా అభ్యర్ధులను చాలావరకు చంద్రబాబే డిసైడ్ చేశారు. అలాగే కూటమి తరపున ప్రచారం, వ్యవస్ధలను వాడుకోవటం, ఎలక్షనీరింగ్ లాంటి ప్రతి వ్యవహారాన్ని చంద్రబాబే దగ్గరుండి చూసుకున్నారు. అందుకనే చంద్రబాబుకు మ్యాన్ ఆఫ్ ది సీరీస్ ఇవ్వకతప్పదు.
ఇదే విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతు ‘జగన్ కక్షసాధింపు వ్యవహారాలను జనాలు ఆమోదించలేద’న్నారు. ‘జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పోలీసు రాజ్యం నడిపించి’నట్లు చెప్పారు. ‘రాష్ట్రాన్ని ఆథోగతికి తీసుకెళ్ళి అప్పులపాల్చేశార’ని ఆరోపించారు. ‘ప్రజాస్వామ్యబద్దంగా సమస్యలను పరిష్కరించకుండా ఒంటెత్తుపోకడలకు పోయా’రని అభిప్రాయపడ్డారు. ‘జగన్ సీఎంగా ఉండాలా వద్దా అన్న లైనుపైనే ప్రస్తుత ఎన్నికలు జరిగాయ’ని రామకృష్ణ చెప్పారు.
జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతు ‘జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని, అరాచకాన్ని తిరస్కరించార’ని చెప్పారు. ‘జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయి, అభివృద్ధి అన్నదే లేకుండా పోయింద’ని అభిప్రాయపడ్డారు. రు. 13.5 లక్షల కోట్లు అప్పులుచేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి జగన్ నెట్టేసినట్లు రెడ్డి మండిపడ్డారు. ‘నీటి పారుదల ప్రాజెక్టులు టేకప్ చేయకపోవటం, మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాడటాన్ని జనాలు సహించలేకపోయి’నట్లు చెప్పారు. ‘రాష్ట్రంలో మైనింగ్, మట్టి, ఇసుక మాఫియాను పెంచిపోషించటంతో పాటు వ్యవస్ధలన్నింటినీ జగన్ ధ్వంసంచేయటాన్ని జనాలు సహించలేకపోయార’ని చెప్పారు. వైసీపీ ప్రస్తుత రిజల్టు జగన్ ఐదేళ్ళ పాలనకు ఉదాహరణగా లక్ష్మణరెడ్డి అభిప్రాయపడ్డారు.