ఇన్నాళ్లూ ఒక లెక్క, ఇప్పుడో లెక్క: పోలీస్ అధికారులకు అనిత వార్నింగ్..
వైసీపీ అంటే ఇంకా ప్రేమ ఉన్న అధికారులు ఎవరైనా ఉద్యోగాలకు రాజీనామా చేయొచ్చని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. విధుల్లో తేడా జరిగితే చర్యలు కఠినంగా ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయాన్ని సందర్శించారు. ఆమెకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోలీస్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు ఏకపక్షంగా, వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని తెలిపారు. వారంతా ఇకపైన తమ తీరుతెన్నులు మార్చుకోవాలని, మేము మారము, ఇలానే ఉంటాం అనుకుంటే కఠిన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలంటూ మండిపడ్డారు ఆమె.
మొక్కు ప్రకారమే వచ్చా..
‘‘మంత్రి పదవి దక్కితే అప్పన్నను సందర్శించుకోవాలని మొక్కుకున్నాను. ఆశించిన దానికంటే ఎక్కువగా హోంమంత్రి పదవి దక్కింది. అందుకే సింహాద్రి అప్పన్నను దర్శించుకుని సేవ చేసుకున్నాను. ఈ సందర్భంగా సింహాచల ఆలయ భూములు అన్ని సురక్షితంగా ఉంటాయని మాట ఇస్తున్నాను. ఒక్క గజం స్థలం కూడా అన్యాక్రాంతం కాకుండా అడ్డుకుంటాం. అదే విధంగా పంచగ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది’’ అని ప్రజలకు హామీ ఇచ్చారు.
‘ప్రేమ ఉంటే రాజీనామా చేయండి’
‘‘వైసీపీ ప్రభుత్వంలో కొందరు తమ నరాల్లో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరించారు. వైసీపీని ఒక్క మాట అన్నా అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేశారు. వారందరికీ ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పటికీ జగన్‌పై ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోండి. కానీ అలా కాకుండా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నా, శాంతి భద్రతల విషయంలో తప్పు చేసినా ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరిగితే అడ్డుగా నిలబడతా. అసలు మహిళలకు అన్యాయం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటా’’ అని స్పష్టం చేశారు.
ఇన్నాళ్లూ ఒక లెక్క ఇప్పుడో లెక్క..
‘‘ఈ ఐదేళ్లు మీరు ఏం చేశారో? ఎలా ఉన్నారో? ఎవరికి కొమ్ముకాశారో? నాకు తెలియదు. కానీ ఇప్పటి నుంచి అలా కుదరదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. అలా కాకుండా అడ్డ దారులు తొక్కుతా, కొందరి కోసమే పనిచేస్తా అంటే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. కనికరం అనేది లేకుండా చర్యలు తీసుకుంటాం. మీ వాళ్లు మా వాళ్లు అన్న తేడా ఏమీ ఉండదు. చట్టం దృష్టిలో, మా ప్రభుత్వ హయాంలో అందరూ సమానులే. తప్పు చేసింది ఎవరైనా శిక్ష తప్పదు’’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.