
పోలీసుల నుంచి వంశీకి ప్రాణహాని పొంచి ఉంది
అరెస్టు సమయంలో పూర్తిగా సహకరించా. అయినా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని న్యాయమూర్తికి వంశీ ఫిర్యాదు చేశారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో సారి సంచలనంగా మారారు. పోలీసుల నుంచే తనకు ప్రాణ హాని పొంచి ఉందని న్యాయమూర్తి వద్ద వాపోయారు. తనకు ఆరోగ్యం బాగలేదని చెబుతున్నా.. పోలీసులు దానిని పట్టించుకోకుండా తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారంటే.. పోలీసుల నుంచి తనకు ప్రాణ హాని ఉంది. నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉంది. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నాని పోలీసులుకు చెప్పాను. అయినా వినకుండా పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అరెస్టు సమయంలో పోలీసులకు పూర్తిగా సహకరించాను. ఎంలాంటి ఇబ్బందులు పెట్టడం కానీ, గొడవలు చేయడం కానీ చేయలేదు. అయినా అరెస్టు సమయంలో ఇబ్బందులు పెట్టారు. నాకు వైద్య సహాయం అందకుండా చూడాలని చూశారు. ప్రతీ క్షణం తనకు వైద్య సాయం అందకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా అరెస్టు నుంచి కోర్టుకు తరలించే వరకు నా పట్ల పోలీసులు అనుచితంగానే ప్రవర్తించారు. అని పేర్కొంటూ న్యాయమూర్తికి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
మరో వైపు వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ, వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తన భర్తకు పోలీసుల నుంచి ప్రాణ హాని ఉందని వంశీ భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సమయాల్లోను, విచారణ సమయంలోను తన భర్త వంశీ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వెల్లడించారు. తనకు ప్రాణ హాని ఉందనే విషయాన్ని మేజిస్ట్రేట్ దృష్టికి తన భర్త వంశీ తీసుకెళ్లారని తెలిపారు. అకారణంగానే తన భర్తను అరెస్టు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. తర భర్త వంశీ అరెస్టు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని, రాజకీయ కుట్ర దాగుందని ఆమె ఆరోపించారు. ఎందుకు అరెస్టు చేశారు? ఏ కేసులో అరెస్టు చేశారో ఇప్పటికీ చెప్పడం లేదని వాపోయారు. వంశీకి ఆరోగ్యం బాగా లేదన్నారు. వంశీ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో అరెస్టు చేసిన వంశీని అక్కడ నుంచి తీసుకొచ్చి, విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ ఇస్తూ కోర్టు ఆదేశాలు జరీ చేసింది. ఈంతో విజయవాడ జైలుకు వంశీని తరలించారు. వంశీతో పాటు అతని అనుచరులు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌లు కూడా రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జైలులో ఉన్నారు.
Next Story