
జైలు నుంచి విడుదలైన వల్లభనేని శంశీ
140 రోజుల తరువాత రిమాండ్ నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విముక్తి లభించింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు వల్లభనేని వంశీ మోహన్ (Former MLA Vallabhaneni Vamsi Mohan) విడుదలయ్యారు. జూలై 2న విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్లపట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులు చేరుకున్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని, తలశిల రఘురామ్ కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. జైలు అధికారులకు వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన తర్వాత వంశీ జైలు నుంచి బయటకు వచ్చారు. వివిధ కేసుల్లో 140 రోజులుగా వంశీ జైలులో ఉన్నారు. రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ వంశీపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై నాలుగు వారాల క్రితమే వాదనలు ముగియగా మంగళవారం వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే వంశీపై ఉన్న రెండు కేసుల్లో కూడా గత నెలలోనే ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది.
మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్ పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణకు జరిగింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ ను రద్దు చేయలేమని, అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేయాలని అధికారులను ఆదేశించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.