వైకుంఠ ద్వార దర్శనం: ’భక్తులకు దివ్య అనుభూతిని అందించాలి‘
x

వైకుంఠ ద్వార దర్శనం: ’భక్తులకు దివ్య అనుభూతిని అందించాలి‘

భక్తుల భద్రత. రద్దీ నిర్వహణ కోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.


తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఒక దివ్య అనుభూతిగా మార్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించిన సమావేశంలో, విధుల నిమిత్తం డిప్యూటేషన్‌పై వచ్చిన టీటీడీ ఉద్యోగులు, పోలీసులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

రద్దీ నిర్వహణకు ఏఐ సాంకేతికత
ఈసారి భక్తుల భద్రత. రద్దీ నిర్వహణ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వినియోగిస్తున్నట్లు అదనపు ఈవో వెల్లడించారు. ఈ సాంకేతికత ద్వారా భక్తుల కదలికలు, వాహనాల రద్దీని ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని ఆయన తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఏర్పాటు చేసిన 'ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్' ద్వారా ఐటీ నిపుణులు, పోలీస్, విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ భక్తుల సమాచారాన్ని నిరంతరం అప్‌డేట్ చేస్తారని పేర్కొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
టోకెన్ల కేటాయింపులో ఈసారి కొన్ని విధానాత్మక మార్పులు చేశామని, సిబ్బంది ఈ వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకుని భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భవిష్యత్తులో తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఎటువంటి సమస్యలు లేని వ్యవస్థను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story