ఇద్దరు గవర్నర్లను అందించిన ఉత్తరాంధ్ర!
x
ఒకే వేదికపై అశోక్‌ గజపతిరాజు, కంభంపాటి హరిబాబు

ఇద్దరు గవర్నర్లను అందించిన ఉత్తరాంధ్ర!

గవర్నరుగిరి వచ్చిందని సంతోషంలో మునిగి తేలుతున్న అశోక్‌ గజపతిరాజు శ్రేయోభిలాషులు.


వెనకబడ్డ ఉత్తరాంధ్ర గవర్నర్‌ పదవులు దక్కడంలో ముందంజలో ఉంది. దేశానికి ఉత్తరాంధ్ర ఇద్దరు గవర్నర్లను అందించింది. ఈ ప్రతిష్టాత్మక రాజ్యాంగ పదవిని అందుకునే అవకాశం వీరికి దక్కింది. ఈ పదవులను అందుకున్న వారిలో ఒకరు బీజేపీ నాయకుడు కాగా.. మరొకరు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామ్యమున్న టీడీపీ∙సీనియర్‌ నేత.

నాలుగేళ్ల క్రితం హరిబాబుకి..
విశాఖపట్నంలో స్థిరపడిన బీజేపీ నాయకుడు కంభంపాటి హరిబాబు తొలుత 2021 జూన్‌ 6న మిజోరాం గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుని గాను, విశాఖ ఒకటో నియోజకవర్గ ఎమ్మెల్యే గాను పనిచేశారు. ఇంకా 2014లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మపై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో అప్పట్లో హరిబాబుకు కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. ఒకానొక దశలో మంత్రి వర్గ విస్తరణలో ఆయన పేరు కూడా చేర్చడం, హస్తినకు రావాలని అధిష్టానం నుంచి పిలుపు రావడం, ఆఖరి నిమిషంలో మార్పు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం మరో సముచిత స్థానాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో హరిబాబుకు మిజోరాం గవర్నర్‌ పదవినిచ్చి గౌరవించింది. మూడున్నరేళ్ల అనంతరం గత సంవత్సరం డిసెంబరు 24న ఒడిశా గవర్నరుగా మార్పు చేసింది. అప్పట్నుంచి ఆయన ఒడిశా గవర్నరుగానే కొనసాగుతున్నారు. ఈయన రాజకీయాలతో పాటు వ్యాపార (సీ ఫుడ్‌) రంగంలోనూ ఉన్నారు.
ఇప్పుడు అశోక్‌ గజపతిరాజుకి..
తాజాగా సోమవారం కేంద్ర ప్రభుత్వం విజయనగరం మహారాజ వంశీయుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజును గోవా గవర్నరుగా నియమించింది. కంభంపాటి హరిబాబు బీజేపీ నాయకుడు కాగా.. అశోక్‌ గజపతిరాజు టీడీపీకి చెందిన వారు. ఈయన టీడీపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కూడా. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆరంభంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత సీఎం అయిన చంద్రబాబుతోనూ ఆ సాన్నిహిత్యాన్ని కొనసాగించారు. అటు ఎన్టీఆర్‌ కేబినెట్‌లోనూ, ఇటు చంద్రబాబు కేబినెట్‌లోనూ కీలక మంత్రి పదవులను చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు ఎన్నికై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నాలుగేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరులో ఆయన క్రియశీలకంగా వ్యవహరించారు. తన హయాంలో ఉడాన్‌ స్కీమ్‌ను అమలులోకి తెచ్చి సామాన్యులకు విమానయానం అందుబాటులో ఉండేలా చూశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని 2024 ఎన్నికల్లో తన కుమార్తె అదితి గజపతిరాజుకు అవకాశం ఇచ్చారు. సింహాచలం దేవస్థానానికి అనువంశిక ధర్మకర్తగా అశోక్‌ గజపతిరాజు వ్యవహరిస్తున్నారు.
పదవుల కోసం పాకులాడలేదుః అశోక్‌
గవర్నర్‌ పదవిని తాను ఊహించలేదన్నారు అశోక్‌ గజపతిరాజు. ‘పదవుల కోసం నేనెప్పుడూ పాకులాడలేదు. ఏదైనా అవకాశం వస్తే దానికి న్యాయం చేయడమే నా కర్తవ్యంగా భావిస్తాను’ అని తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారాయన.
నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం..
అశోక్‌ గజపతిరాజు నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. మహారాజ కుటుంబంలో పుట్టిన ఆయన రాజవంశీయుడిలా దర్పం ప్రదర్శించరు. సాదాసీదాగా ఉంటారు. తన పనులు తాను చేసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. గతంలో తన కారు (టాటా నానో) తానే శుభ్రం చేసుకునేవారని, లోకల్‌గా ఆ కారులోనే తిరగడానికి ఆసక్తి చూపుతారని చెప్పుకుంటారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో సాధారణ ప్రయాణికుల్లా కూర్చున్న అశోక్‌ గజపతిరాజు

రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుడిలా..
ఆయన నిరాడంబరతకు మచ్చుతునకగా ఒక సంఘటనను చెప్పుకోవచ్చు. గత ఏడాది సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుల మాదిరిగా గ్రానైట్‌ దిమ్మెపై కూర్చుని రైలు కోసం వేచి చూశారు. ఆయన అశోక్‌ గజపతిరాజుగా గుర్తించి తీసిన ఫోటోలు మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ అప్పట్లో వైరల్‌ అయ్యాయి. నిరాడంబరతలోనే కాదు.. అశోక్‌ గజపతిరాజు అవినీతికి దూరంగా, నిజాయితీగా ఉంటారన్న పేరును కూడా సంపాదించుకున్నారు.

మన రాజుగోరు గవినేరు అయ్యేరు!

అశోక్‌ గజపతిరాజుకు గోవా గవర్నర్‌ పదవి రావడంపై ఉత్తరాంధ్ర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి మరక అంటని ఆ రాజ కుటుంబానికి గౌరవ ప్రదమైన గవర్నర్‌ గిరీ దక్కిందంటూ సంబరపడుతున్నారు. అందుబాటులో ఉన్న అభిమానులు ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలుపుతున్నారు. ‘మన రాజుగోరు గోవాకి గవినేరయ్యారంట.. ఈ వొయిసులోనూ గవినేరు పదవిచ్చేరంట’ అంటూ చెప్పుకుని మురిసిపోతున్నారు.
Read More
Next Story