Shantamma
x

శాంతమ్మ

96 ఏళ్ల విశాఖ ప్రొఫెసర్ శాంతమ్మ తపనేమిటీ, ఉషా చిలుకూరి ఈమెకి ఏమవుతారు?

సేవకుడిని చేరదీసి ప్రయోజకుడిని చేసిన మాతృమూర్తి. 96వ ఏటా తరగతి గదిపై తరగని మోజు. శాంతమ్మ బావగారి మనవరాలే అమెరికా ఉపాధ్యక్షుని భార్య.


'నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు..' అన్న ఓ సినీకవి గేయం. మహిళా ప్రొఫెసర్కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఆమె గతాన్ని, వర్తమానాన్ని పరికిస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అలాంటిలాంటి ప్రొఫెసర్ కాదు.. ఆషామాషీ అధ్యాపకురాలూ కాదు మరి! దేశంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. డెబ్భై మూడేళ్ల క్రితం మొదలెట్టిన పాఠాల ప్రస్థానం ఇప్పటికీ ఆపకుండా కొనసాగిస్తున్నారు. సెంచరీకి చేరువలోనూ సెంచూరియన్ యూనివర్సిటీలో పాఠాలు బోధిస్తున్నారు. 96వ ఏట కూడా విద్యా బోధన సాగిస్తున్న ఏకైక మహిళగానూ ఆమె రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ వయసులోనూ మ్యాథ్మెటిక్స్పై గ్రూప్ థియరీ రాస్తున్నారు. ఆమె పేరు చిలుకూరి శాంతమ్మ. దేశంలోనే ఫిజిక్స్ డాక్టరాఫ్ సైన్స్ సాధించిన తొలి మహిళ. రూ.కోట్ల విలువైన తన యావదాస్తినీ దానం చేసిన దానశీలి. అంతేకాదు.. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన .. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి ఈమె బావగారి మనవరాలు. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ప్రొఫెసర్ శాంతమ్మ ఈ తరానికే కాదు.. ఏ తరానికైనా ఆదర్శమే. ఆమె గురించి మరెన్నో ఆసక్తికర సంగతులు తెలుసుకోవలసిందే!

శాంతమ్మ 1929 మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం నాడు పుట్టారు. ఆమె పుట్టిన ఊరు కృష్ణా జిల్లా ఉయ్యూరు. తల్లి కడుపులో ఐదో నెల బిడ్డగా ఉన్నప్పుడే తండ్రి కన్నుమూశారు. దీంతో శాంతమ్మ చిన్నాన్న (జిల్లా జడ్జి) నరసింహ దీక్షితులు ఆమెను చదివించారు. బీఎస్సీ, ఎమ్మెస్సీల తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ (డీఎస్సీ) పూర్తి చేశారు. అప్పట్లో దేశంలో ఫిజిక్స్లో డీఎస్సీ (పీహెచ్‌డీ కంటే ఉన్నత చదువు) డిగ్రీ సాధించిన తొలి మహిళ ఈమె. 1951లో నెలకు రూ. వంద జీతానికి ఏయూలో లెక్చర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా పదోన్నతి పొంది 1989లో ఫిజిక్స్ సీనియర్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. అప్పటికి ఆమె జీతం రూ.4 వేలే. పదవీ విరమణ తర్వాత కూడా ఆమె ఆరేళ్ల పాటు ఏయూలోనే సీనియర్ గౌరవ ప్రొఫెసర్గా కొనసాగారు. అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఇంకా యూఎస్, కెనడా, యూకే, కొరియా, శ్రీలంక దేశాల్లో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఈమె ప్రతిభను గుర్తించిన విజయనగరం సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ దాదాపు పదేళ్ల క్రితం ఎమిరిటస్ ప్రొఫెసర్గా చేర్చుకున్నారు. 96 ఏళ్ల వృద్ధాప్యంలోనూ ఆమె విశాఖ నుంచి రోజూ 50 కి.మీల (రానుపోను 100 కి.మీలు) దూరం కారులో వెళ్లి క్లాసులు చెప్పి వస్తుంటారు. ఫిజిక్స్ పాటు వేద గణితాన్ని కూడా బోధిస్తున్నారు.

శాంతమ్మ రూపొందించిన వేద గణిత పుస్తకం

తీరిక సమయాల్లోనూ పరిశోధనే..

ఇక శాంతమ్మ తీరిక సమయాన్ని వృధా చేయరు. వృద్ధురాలిని కదాని విశ్రాంతి కోరుకోరు. ఖాళీగా ఉన్నప్పుడు పరిశోధనలకే ప్రాధాన్యతనిస్తారు. ఇలా ఆమె పరిశోధన సాగించిన 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్‌లో ప్రచురణ అయ్యాయి. ఇంకా జగద్గురు శంకరాచార్య వేదిక్ మ్యాథమేటిక్స్ (వేద గణితం)పై ఐదు వాల్యూమ్ను రాసి ముద్రించారు. ఇందుకోసం ఆమె 20 ఏళ్లు శ్రమించారు. అలాగే భగవద్గీత తెలుగు పుస్తకాన్ని సరళమైన ఇంగ్లిష్లోకి కేవలం 30 రోజుల్లోనే అనువదించారు. తొమ్మిదిన్నర పదుల ప్రాయంలో ప్రస్తుతం మ్యాథ్మెటిక్స్పై గ్రూప్ థియరీ రాస్తున్నారు. మరో 3-4 నెలల్లో దీనిని పూర్తి చేస్తానని చెబుతున్నారు శాంతమ్మ. శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతంగాను, ప్రశాంతంగానూ కనిపిస్తారు. తొమ్మిదిన్నర పదుల వయసులోనూ ఆవేశం, అసహనాలు ఆమెలో మచ్చుకైనా కనిపించవు. 35 ఏళ్ల క్రితమే రిటైర్ అయినా ఆమె విశ్రాంతి తీసుకోలేదు.. కోరుకోలేదు. అందుకే ఆమె ఇప్పటికీ అవిశ్రాంత శాంతమ్మే..

సర్వం దానధర్మాలకే ధారాదత్తం..

శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కూడా ఏయూలోనే తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. దీంతో ఆత్రేయపురం భరద్వాజ అనే పేద యువకుడిని చేరదీసి సొంత కొడుకులా విద్యాబుద్ధులు నేర్పించారు. శాస్త్రి అనారోగ్యం పాలైనప్పుడు భరధ్వాజ బాగా సపర్యలు చేశాడు. 12 ఏళ్ల క్రితం శాస్త్రి చనిపోయారు. అనంతరం భరద్వాజ్ను మెడిసిన్ చదివించారు. ఇప్పుడాయన అనస్తీషియా వైద్యుడయ్యారు. భరద్వాజకు పెళ్లి చేశారు. ఇప్పుడాయనకు ముగ్గురు పిల్లలు. వీరినీ ఆమే చదవిస్తున్నారు. ఆ కుటుంబాన్నంతటినీ శాంతమ్మే పోషిస్తున్నారు. అంతేకాదు.. కృతజ్ఞతగా రూ.కోట్ల విలువ చేసే రెండిళ్లనూ తన తదనంతరం భరద్వాజకే చెందేలా రాసిచ్చారు. అంతేనా? గతంలో తన భర్త శాస్త్రి ఆంధ్రప్రదేశ్ ఆరెస్సెస్ చీఫ్ గా పనిచేశారు. విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తన సొంతింటిని ఆరెస్సెస్కు విరాళమిచ్చేశారు. దాని విలువ రూ.12 కోట్లు. ఇప్పుడా స్థలంలో నర్సింగ్ కళాశాలను నిర్మించే యోచన చేస్తున్నారు. చిన్నతనంలో శాంతమ్మ వాటాకు రూ. 8 లక్షల ఆస్తి వచ్చింది. ఆ సొమ్ముతో విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని గుడిలోవలో శివాలయం, దత్తాత్రేయ ఆలయం కట్టించారు. కొన్నాళ్లకు దానినీ దానం చేసేశారు.

శాంతమ్మ ఇంగ్లిష్‌లోకి అనువదించిన భగవద్గీత పుస్తకం

తన వంట తానే చేసుకుంటూ..

సెంచరీకి చేరువైనా శాంతమ్మ తన వంట తానే చేసుకుంటారు. తెల్లవారుజామున మూడు గంటలకే నిద్ర లేస్తారు. కాలకృత్యాల తర్వాత కాఫీ తాగుతారు. ఉదయాన్నే టిఫిన్ తింటారు. వంట చేసుకుని కొద్దిగా భోజనం బాక్సులో పెట్టుకుని విజయనగరంలోని యూనివర్సిటీకి కారులో బయల్దేరుతారు. సాయంత్రం ఆరు గంటలకు ఇంటికొస్తారు. కొద్దిపాటి అన్నం తిని త్వరగానే నిద్రిస్తారు. 'నాకు కొద్దిపాటి బీపీ తప్ప సుగర్ వ్యాధి లేదు. చిన్నపాటి హృద్రోగ, వినిడికి సమస్య ఉందంతే.. కళ్లు, పళ్లు బాగానే ఉన్నాయి. అందుకే పాఠాలు చెప్పగలుగుతున్నాను. చిన్నప్పట్నుంచి నడక అలవాటని, మితాహారం మంచి ఆరోగ్యానికి కారణం' అని చెబుతారు శాంతమ్మ. ఆమె తల్లి 104 ఏళ్లు జీవించారు.

నా ఆందోళనంతా మరుజన్మపైనే..

'నాకేమీ కోరికలు లేవు.. ఈ జన్మలో అంతా మంచి చేస్తే మరో జన్మ ఉండదని అంటారు. కానీ నేను ఈ జన్మలో ఏం చేశానో తెలియదు. అందుకని నాకు మరో జన్మ తప్పదు. వచ్చే జన్మలో ఎలా పుడతానో? ఏమవుతానో తెలియదు. నాకు ఎలాంటి జన్మ వస్తుందో భగవంతుడా? నా ఆందోళన అంతా నా మరు జన్మ గురించే. అని ప్రొఫెసర్ శాంతమ్మ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి'తో చెప్పారు. నాకు చిన్నప్పట్నుంచి చదువన్నా, విద్యా బోధనన్నా చాలా ఇష్టం. అందుకే టీచింగ్ ప్రొఫెషన్ని ఎంచుకున్నాను. 96 ఏళ్ల వయసొచ్చినా పిల్లలకు పాఠాలు చెప్పడానికే ప్రాధాన్యతనిస్తాను. వారికి పాఠాలు చెబుతుంటే నా మనసు పులకించి పోతుంది. నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత కాలం పాఠాలు చెబుతూనే ఉంటాను' అని బోధనపై తనకున్న మమకారాన్ని వివరించారామె.

గదిలో శాంతమ్మ భర్త, కుటుంబీకుల చిత్ర పటాలు

ట్రంప్‌ తీసుకున్నది సరైన నిర్ణయమే..

అమెరికాలో ఉంటున్న విదేశీయులను తిరిగి వారి దేశాలకు పంపించేయాలన్న దేశ కొత్త అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం సరైనదే. ఆ దేశ ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం మంచిదే. ట్రంప్ చర్యతో భారత్ నుంచి వెళ్లిన తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. ఇండియాలో మేధో సంపత్తి కలిగిన వారందరో అమెరికా వెళ్లి దేశ సంపదకు పరోక్షంగా దోహదపడుతున్నారు. ట్రంప్ తాజా నిర్ణయం వల్ల భారత్లో నైపుణ్య సంపద పెరిగి దేశాభివృద్ధికి దోహదపడుతుందన్నది నా అభిప్రాయం. ఇక నా బావ గారి మనవరాలు ఉష చిలుకూరి భర్త అమెరికా ఉపాధ్యక్షుడు కావడం, ఉష ఆ దేశ ద్వితీయ మహిళ కావడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. వారిద్దరూ ఇండియాకు, అమెరికాకు పేరు తెస్తారన్న నమ్మకం నాకుంది' అని ముగించారు ప్రొఫెసర్ శాంతమ్మ.

Read More
Next Story