
ఏపీలో కొనసాగుతున్న యూరియా సంక్షోభం
ఆంధ్రప్రదేశ్‌లో యూరియా సంక్షోభం, రైతుల ఆవేదన, ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ ఆరోపణలు.
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్ మధ్యలో యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది. ప్రభుత్వం 78 వేల టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, రైతులు సకాలంలో ఎరువులు అందక ఆందోళన చెందుతున్నారు. ఒక ఎకరానికి కనీసం 40 కేజీల యూరియా అవసరమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు, అయితే రైతులు సాధారణంగా 70-75 కేజీల వరకు వినియోగిస్తారు. ఈ కొరత వల్ల పంట ఎదుగుదల ప్రభావితమవుతుందని, ఉత్పత్తి భారీగా తగ్గుతుందని రైతులు భయపడుతున్నారు. ఈ సమస్య వెనుక బ్లాక్ మార్కెట్, పంపిణీ వైఫల్యాలు, రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఏమి చెప్పినా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ విధమైన సంక్షోభాలు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూరియా కొరత, వాస్తవాలు, ప్రభావాలు
ఖరీఫ్ సీజన్‌లో సుమారు 31 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. ఇటీవలి వరదలు, భారీ వర్షాల వల్ల రవాణా అంతరాయాలు ఏర్పడటం కొరతకు ఒక కారణమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లాలో 40 శాతం కొరత ఉందని ఏపీ టెనెంట్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ నేత బి బాలరాం ఆరోపిస్తున్నారు. "యూరియా సకాలంలో అందకపోతే పంటలు నష్టపోతాయి. నానో యూరియా ప్రోత్సాహం వల్ల దిగుమతులు, కార్పొరేట్ వ్యాపారాలు పెరుగుతాయి" అని ఆయన అన్నారు.
రైతులు ఎరువుల దుకాణాలు, పంపిణీ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూల్లో రైతులు నిలబడుతున్నారు. ఒక్కో బ్యాగ్ (45 కేజీలు) ధర రూ.265-266గా సబ్సిడీతో అందుతుంది. కానీ వాస్తవ ధర రూ.2,000 వరకు ఉంటుంది. అయినా బ్లాక్ మార్కెట్‌లో బస్తాకు రూ.200 అధికంగా విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చిన్న, అద్దె రైతులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఒక జిల్లాకు 300 టన్నులు వచ్చినప్పటికీ, మొత్తం రాష్ట్రానికి ఇది తక్కువే.
రైతు పోరులో విజయవాడలో వైఎస్సార్సీపీ ఆందోళన
ప్రభుత్వం చెబుతున్నది ఏమిటి? వైఫల్యాలు ఎక్కడ?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొరత లేదని, విపక్షాలు పానిక్ సృష్టిస్తున్నాయని అంటున్నారు. బుధవారం నాటికి 94,892 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని, కేంద్రం నుంచి మరో 53,000 టన్నులు కేటాయించారని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 6.75 లక్షల టన్నులు సరఫరా చేశామని, 4.08 లక్షల టన్నులు అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. అంటే ఈ సీజన్ కు మొత్తం 10.83 లక్షల టన్నులు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా నాలుగు లక్షల టన్నులకు పైన కావాల్సి ఉంటే కేంద్రం ఇస్తున్న 53వేల టన్నులు ఏ మూలకు వస్తాయనే విమర్శ కూడా ఉంది. మార్క్‌ఫెడ్ ద్వారా 70 శాతం, ప్రైవేటు షాపుల ద్వారా 30 శాతం పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు.
ఇంకా 3.50 లక్షల టన్నుల యూరియా అవసరం
అయితే ఈ గణాంకాలు రైతుల ఆవేదనను పరిష్కరించడం లేదు. ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను నిరోధించడంలో విఫలమైందా? వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్మేందుకు స్టాక్‌లు దాచిపెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు వ్యాపార ముసుగులో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. జిల్లాల వారీగా పంపిణీని రోజువారీగా పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆచరణలో లోపాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇంకా మూడున్నర లక్షల టన్నుల యూరియా రైతులకు కావాల్సి ఉంది.
కేంద్రం ఇచ్చే దాంతో సరిపోతుందా?
కేంద్రాన్ని యాచించి అదనపు సరఫరా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జాతీయ స్థాయిలో యూరియా సంక్షోభం ఉందని, దిగుమతి ఆధారితత వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే రాష్ట్రంలోని స్థానిక పరిశ్రమల అభివృద్ధి, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందోననే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గత ప్రభుత్వ కాలంలో మెరుగైన సపోర్ట్ ఉండేదని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు నారు వెంకటరెడ్డి అభిప్రాయపడుతున్నారు. మూడున్నర లక్షల వరకు ఇంకా రైతులకు యూరియా అవసరం ఉంటే 53,000 కేంద్రం ఇచ్చిందని, ఇది ఏ మూలకు వస్తుందనేది రైతుల ప్రశ్న.
రాజకీయ కోణం, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు
ఈ సమస్య రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్ఆర్‌సీపీ సెప్టెంబర్ 9న 'అన్నదాత పోరు' పేరుతో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టింది. యూరియా కొరతకు చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు డిమాండ్ చేసింది. "ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు నష్టపోతున్నారు" అని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణలను 'ఫేక్ పాలిటిక్స్'గా పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ వర్కర్లు రైతులుగా వేషం వేసి మిస్‌ఇన్‌ఫర్మేషన్ ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలోనూ ఇదే సమస్య ఉంది. కానీ అక్కడ కాంగ్రెస్ మంత్రులు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు కేంద్రాన్ని అనలేక, ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోలేక డ్రామా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
పరిష్కారం ఎటు?
యూరియా సంక్షోభం వెనుక అసలు విషయం పంపిణీ వైఫల్యాలు, బ్లాక్ మార్కెట్, రాజకీయ ఆరోపణలు. ప్రభుత్వం నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, రైతులకు అందకపోవడం ఆందోళనకరం. డ్రోన్ టెక్నాలజీతో సబ్సిడీలు ఇవ్వడం, రైతుల ఖాతాలకు రూ.7,000 జమ చేయడం వంటి చర్యలు మంచివే, కానీ తక్షణ సమస్యను పరిష్కరించాలి. కేంద్రం నుంచి అదనపు సరఫరా తెచ్చుకున్నప్పటికీ, స్థానికంగా నిరోధక చర్యలు బలోపేతం చేయాలి. రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకుని, రాజకీయాలకు అతీతంగా పరిష్కారాలు చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ఖరీఫ్ పంటలు నష్టపోయి, రైతులు మరింత ఇబ్బందులు పడతారు.
కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తారా?
కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందులు రెండు వేలకు తక్కువ కాకుండా కొంటేనే యూరియా బస్తా ఇస్తామని వ్యాపారులు రైతులకు అల్టిమేటమ్ నేటికీ ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ చెప్పారు. ఈ పరిస్థితి నుంచి రైతులను కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఉందన్నారు. కలెక్టర్లు, ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శి యూరియా కొరత లేదని చెబుతున్నారని, వ్యవయాయ మంత్రి మాత్రం ఇంకా మూడున్నర లక్షల టన్నుల యూరియా అవసరం అవుతుందని చెబుతున్నారన్నారు. పొంతన లేని ప్రకటనలు చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఎరువును బ్లాక్ చేసిన వారిని గుర్తించి భారీ జరిమానాలు విధిస్తే తప్ప వ్యాపారులు దారికి వచ్చే అవకాశం లేదన్నారు.