
యుపిక్స్ చీటింగ్ కేసు–ముగ్గురు నిందితులు అరెస్ట్
డబ్బులు తిరిగి చెల్లించని పక్షంలో కేసులు నమోదు చేస్తామని సీపీ రాజశేఖరబాబు హెచ్చరించారు.
యుపిక్స్ చీటింగ్ కేసులో ముగ్గరు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు మూడు నెలల క్రితం యుపిక్స్ చీటింగ్ కేసు విజయవాడలో నమోదైంది. విజయవాడ నగరంలో ఆదిశేషయ్య స్ట్రీట్‌లో యుపిక్స్ పేరుతో హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ పేరుతో సత్యకిరణ్, రాజేంద్రబాబు, రాజీవ్ కృష్ణలు ఓ సంస్థను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఇద్దరు బాధితులు యుపిక్స్ సంస్థ తమను మోసం చేసిందని విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 16 కోట్లు పెట్టుబడులు పెట్టి మోస పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఏప్రిల్ 14న యుపిక్స్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యకిరణ్, రాజేంద్రబాబు, రాజీవ్‌కృష్ణలు ప్రధాన నిందితులుగా గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. దాదాపు 183 మంది నుంచి రూ. 353 కోట్లు వసూలు చేసి యుపిక్స్ సంస్థ గ్రూపులో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. అయితే నిందులు ఆ రూ. 353 కోట్ల నుంచి 2024లో రూ. 194 కోట్ల డిపాజిట్లను తమ సొంత ఖాతాలకు మళ్లించారని, దీనిపైన ఫిర్యాదు అందడంతో వివిధ సెక్షన్‌లపై నిందితులు మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యుపిక్స్ సంస్థ నుంచి అక్రమంగా డబ్బులు పొందిన వారు తిరిగి ఆ డబ్బును చెల్లించాలని సీపీ రాజశేఖరబాబు హెచ్చరించారు. అలా చెల్లించని పక్షంలో డబ్బు పొందిన వారిపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.