గోదావరి మహిళల్లో అశాంతి!
x

గోదావరి మహిళల్లో అశాంతి!

ఇంట్లో నుంచి రోడ్డుపైకి వెళితే ఏమి జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఎవరొచ్చి ఏమి చేస్తారోననే భయం గోదావరి మహిళలను వెంటాడుతోంది.


గోదావరి జిల్లాలు అనగానే మహిళల మెడల్లో తప్పకుండా బంగారం ఉండాల్సిందే. ఇక పెళ్లిళ్లలో అయతే ప్రతి ఒక్కరి మెడలో బంగారం గొలుసులు కనిపిస్తాయి. పట్టు చీరలు, ఎవరి తాహతుకు తగినట్లు అలంకరించుకుంటారు. ప్రధానంగా బంగారంపై మహిళలకు మోజు ఎక్కువ. అదే రాయలసీమ ప్రాంతాల్లో బంగారంపై చాలా తక్కువ మోజు ఉంటుంది. కొందరి మెడల్లో పసుపు తాడు మాత్రమే ఉంటుంది. బంగారు తాడు ఉండదు. కానీ బంగారు తాళిబొట్టు తాడు లేకుండా గోదావరి జిల్లాల్లో ఏ మహిళా ఉండదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. వారి నుంచి గౌరవ మర్యాదలు కూడా ఇతరులు నేర్చుకోవాల్సిందే. ఇంటికి వచ్చిన వారికి వారు ఇచ్చే ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేము.

అందుకే ఆ జిల్లాలను దోపిడీ దొంగలు టార్గెట్ చేశారు. ఎక్కువగా మహిళల మెడల్లో నాను తాడు, తాళిబొట్టు తాడు. ఇతర ఆభరణాలు, చేతులకు బంగారు గాజులు ఉంటుంటాయి. బంగారు షాపుల వద్ద, ఇంటి గుమ్మాల వద్ద, పెళ్లి పందిళ్ల వద్ద, దేవాలయాల వద్ద, ఏవైనా ఫంక్షన్ ల వద్ద దొంగలు ప్లాన్ ప్రకారం నిలువు దోపిడీ చేస్తున్నారు. దొంగలు పల్సర్ వాహనాలు, అధునాతన సెల్ ఫోన్ లు వాడుతున్నారు. ఇవి కూడా దొంగతనం చేసినవే కావడం విశేషం. వారు దొంగ తనానికి బయలు దేరేటప్పుడు వట్టి చేతులతోనే వస్తారు. ముందుగా రైల్వే స్టేషన్ లు, ఆర్టీసీ బస్టాండ్ ల వద్ద మంచి హై స్పీడు వెళ్లే వాహనాలను చూసి దొంగతనం చేస్తారు. ఆ తరువాత ప్లాన్ ప్రకారం దోపిడీకి పాల్పడతారు. అది కూడా ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం లోపు మాత్రమే.

హెల్ మెట్ పెట్టకుని ఇద్దరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే బైక్ పై వస్తారు. ఏ మహిళ మెడలో ఎక్కవ బంగారం ఉంటుందో ఆ మహిళలను టార్గెట్ చేస్తారు. స్పీడ్ వచ్చి మహిళ మెడలోని గొలుసును తెంపుకుని పరారవుతారు. ఇదంతా రెప్పపాటులోనే జరిగి పోతుంది. బాధిత మహిళలు కింద పడిపోయి దెబ్బలు తగలటంతో రక్తం తుడుచుకుంటూ చిన్నగా పైకి లేచి చూసుకునే సరికి వారి వద్ద బంగారు ఆభరణాలు దొంగల ఎత్తుకు పోయి ఉంటారు. కనుచూపు మేరలో కూడా వారు కనిపించరు. వెతికినా ప్రయోజనం ఉండదు. పోలీసులు నిక్కి, నీలిగి రోడ్డుపైకి వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు. ఎలా లాక్కు పోయారు అని విచారించే లోపులోనే మరో నాలుగు చోట్ల కూడా ఇదే విధమైన దోపిడీలు చేసి పరారవుతున్నారు.

కోస్తా జిల్లాలో ఇది సర్వ సాధారణంగా మారింది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కుమారదేవం గ్రామానికి చెందిన నక్కా ధనలక్ష్మి కొవ్వూరు పట్టణంలోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లేందుకు జూనియర్‌ కళాశాల ఎదురు వీధిలో నడుస్తున్నారు. సరిగ్గా అప్పుడే హెలిమెట్ లు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చారు. వెనుక నుంచి ఆమె మెడలోని మూడున్నర కాసుల బంగారు గొలుసు లాక్కుని ముందుకెళ్లిపోగా ధనలక్ష్మి కింద పడిపోయింది. ఈ ఘటన జరిగిన 5 నిముషాల వ్యవధిలో కాస్త ముందుకు వెళ్లగానే 13వ వార్డుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త బర్ల లలిత అపర్ణాదేవి మెడలోని 5 కాసుల గొలుసు, ఒకటిన్నర కాసుల నల్లపూసల దండ లాక్కున్నారు. ఆ పెనుగులాటలో 2 కాసుల విలువైన భాగం ఆమె చేతిలో ఉండి పోయింది. సుమారు నాలుగున్నర కాసుల బంగారం దుండగులు పట్టుకు పోయారు. 11.30 గంటల సమయంలో కొంతమూరు కు చెందిన చింతలూరి అన్నపూర్ణ కోడలితో కలిసి రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం వద్ద నడుచుకుంటూ పోతుండగా.. ఝుయ్ అంటూ వచ్చి ఆగిన బైకుపై ఉన్న దొంగలు అన్నపూర్ణ మెడలోని 72 గ్రాముల బంగారు చంద్రహారం లాక్కుని పరారయ్యారు.

మధ్యాహ్నం 12 గంటలకు సుబ్బారావు నగర్‌ కు చెందిన మహంతి కనకమహాలక్ష్మి క్వారీ మార్కెట్‌ కూడలి సమీపంలో తన హోటల్‌ పనులు ముగించుకుని వెళుతుండగా ఆమె మెడలోని 32 గ్రాముల బంగారు మంగళ సూత్రాల తాడును లాక్కుని పరారయ్యారు. ఈ క్రమంలోనే కొంతమూరు లో నడిచి వెళ్తున్న సాగిరాజు చంద్రావతి అనే మహిళ మెడ నుంచీ ఎనిమిది కాసుల బంగారు గొలుసులు, నల్లపూస తాడును ముందుగా చేసిన తరహాలోనే లాక్కెళ్లారు. మొత్తంగా గంటలో ఐదు ప్రాంతాల్లో ఐదుగురు మహిళల మెడల్లోని 120 గ్రాముల బంగారం దొంగల పాలైంది. అన్ని చోట్లా నిందితులు ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్పీ నరసింహ కిషోర్‌ ఆదేశాలతో కడియం సహా ‘తూర్పు’లోని అనేక రహదారి ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. ఆగంతుకులు కోరుకొండ, గోకవరం మీదుగా రంపచోడవరం వైపు పరారైనట్లు పోలీసులకు సమాచారం అందింది. కొవ్వూరు సీఐ పి విశ్వం, రాజానగరం సీఐ వీరయ్యగౌడ్, రాజమహేంద్రవరం మూడో పట్టణ సీఐ అప్పారావు వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోదావరి జిల్లాల్లో ఇటువంటి సంఘటనలు రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బాధితులు ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. గత సంవత్సరం ఏప్పిల్ 26న కాకినాడలోని వినుకొండవారి వీధిలో ఇలాగే ఓ సంఘటన జరిగింది. జిల్లా రిపోర్టర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి భార్య ఇంటి గుమ్మం ముందు వేరే మహిళతో మాట్లాడుతోంది. పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు మెడలోని బంగారు తాడు, గొలుసు లాక్కుని పరారయ్యారు. ఇంట్లో వారు తేరుకునే లోపు వారు కనిపించకుండా పోయారు. హడావుడిలో పోతూ అనపర్లి వద్ద ఒక వ్యక్తి బైక్ ను గుద్దారు. దీంతో వారు కింద పడిపోయారు. బైకు కింద పడటంతో వారి జేబుల్లోని సెల్ఫోన్స్ కింద పడి పోయాయి. ఎదిటి వ్యక్తి తేరుకునే లోపులోనే బైకును వదిలేసి పరారయ్యారు.

పోలీసులు ఆ బైకును స్వాధీనం చేసుకుని విచారిస్తే రైల్వే స్టేషన్ లో ఉంచిన బైకును ఈ దొంగలు దొంగిలించారు. ఈ బైకు ఫైనాన్స్ లో ఉంది. సెల్ ఫోన్ కూడా వేరే షాపులో దొంగిలించారు. వీరు జంగారెడ్డి గూడెం వైపు నుంచి పారిపోయారు. ఫోన్ లో రూట్ మ్యాప్ లు పరిశీలిస్తే వారు మరికొన్ని చోట్ల కూడా దొంగతనాలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఫోన్ లో దొరికిన సమాచారం ప్రకారం వీరిది ముంబై వద్ద దివాండి గ్రామం అని పోలీసులకు తెలిసింది. దీంతో వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈ గ్రామంలో ఎక్కువ మంది దొంగతనాలపైనే ఆధారపడుతుంటారని పోలీసులు తెలుసుకున్నారు. ఆ విలేకరి డిఐజీని కూడా కలిసారు. ఆయన ఎస్పీకి చెప్పారు. తొమ్మిది నెలలైనా దిక్కులేదు. ఇలాంటి పరిస్థితులు గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే హోం శాఖ మంతి ఉంటారు. ఆమె దృష్టికి ఈ దొంగతనాల వ్యవహారాలు వెళుతూనే ఉంటాయి. అయినా దొంగలను నిరోధించే విషయంలో వెనుబడే ఉన్నారు.

Read More
Next Story