ఏపిలో తగ్గని వరద బీభత్సం
x

ఏపిలో తగ్గని వరద బీభత్సం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులుగా వరదలు కొనసాగుతున్నాయి. పలు పట్టణాలు జలమయమయ్యాయి. పలువురు మృతి చెందారు.


వరదల కారణంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, ఎన్‌టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదలు ఎక్కువగా ఉన్నాయి. వరదల వల్ల విజయవాడ, మంగళగిరి పట్టణాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. అందువల్ల కొందరు మృతి చెందారు. విజయవాడ పట్టణంలో రెండు రోజులు కురిసిన వర్షాలకు 29 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సుమారు 30 సంవత్సరాల్లో ఈ విధంగా వర్షం కురవడం మొదటి సారని ప్రభుత్వం చెబుతోంది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం వల్ల పట్టణంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధానంగా మొగల్‌రాజపురం, అజిత్‌ సింగ్‌ నగర్, ఆటోనరగ్, సింగ్‌ నగర్‌ వంటి ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధమయ్యాయి.

294 గ్రామాల్లో పునరావాస చర్యలు
ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి ఆదివారం ప్రస్తుత వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్,కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ఇంత వరకు 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 13,227 మందిని తరలించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 61 మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసామన్నారు.
తొమ్మిది మంది మృతి, శిథిలాల్లో మరో ముగ్గురు
వరదల కారణంగా రాష్ట్రంలో మొత్తం 9 మంది మృతి చెందారు. ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారు విజయవాడలోని కొండ చరియల కింద ఇరుక్కుపోవడంతో తప్పకుండా మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. విజయవాడలోని మొగల్‌రాజపురం కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇండ్లపై కొండచరియలు విరిగి పడటంతో శనివారం 5 గురు మృతి చెందారు. వారి మృత దేహాలను వైద్యశాలకు తరలించారు. ఇంకా ముగ్గురి ఆచూకీ తెలియలేదు. ఈ రాళ్లకిందే పడి చనిపోయి ఉంటారని బావిస్తున్నారు. శనివారం ఉదయం నాలుగు మృత దేహాలు బయట పడగా సాయంత్రానికి మరో మృతదేహం బయట పడింది. మంగళగిరిలోని గుండయ్యపేటలో కొండ చరియలు కూలి ఒక వృద్దురాలు మృతి చెందింది. గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన సంఘటనలో ఒక టీచర్‌తో పాటు ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు.
పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్ల బృంధాలు ముంపు ప్రాంతాల్లోని 600 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 9 ఎస్డీఆర్‌ఎఫ్, 8 ఎన్డీఆర్‌ఎఫ్‌ మొత్తం 17 బృందాలు 7 జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీనికి అవసరమైన 5 బోట్లు, ఒక హెలికాఫ్టర్‌ సిద్ధంగా ఉంచామని హోం మంత్రి అనిత చెప్పారు.
సహాయక చర్యలపై సీఎం సమీక్ష
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మంత్రులు అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని నిర్దేశించారన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తరువాత పంట నష్టంపై ఎన్యూమురేషన్‌ చేపడతామని ఇప్పటి వరకు అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం 14 జిల్లాల్లోని 62,644 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని, 7218 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగాయని మంత్రి తెలిపారు. రెవెన్యూ, పోలిస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, విద్యుత్‌ వంటి ప్రభుత్వ శాఖలన్ని సమన్వయంతో పనిచేసి యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవడం వలన ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగారని మంత్రి అనిత తెలిపారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోను కమాండ్‌ కంట్రోల్‌ రూమ్, టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి నోడల్‌ అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలు తీసుకుంటున్నారు. రాయనపాడు రైల్వే స్టేషన్లో వరద నీరు చేరినందున తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి వేశారు.ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు ఆర్టీసి బస్సుల ద్వారా తరలించేందు ప్రత్యామ్నయ ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది. ప్రయాణికులకు ఆహారం, తాగు నీరు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నందున ప్రజలు వాటిని దాటే విషయంలో ప్రభుత్వ హెచ్చరికలు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు.
తీరం దాటిన వాయుగుండం
అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటిన వాయుగుండం దాటింది. ఈ కారణంగా ఆదివారం చాలా చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉంది. గాలులు కూడా అధికంగా వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, వైయస్‌ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రకాశం బ్యారేజ్‌ నుంచి భారీగా నీటి విడుదల
ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక నేపధ్యంలో భారీగా వరద నీరు సముద్రంలోకి వెళుతోంది. బ్యారేజ్‌ అన్ని గేట్లను అధికారులు తెరిచారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ప్రస్తుత ఇన్‌ ఫ్లో ఔట్‌ ఫ్లో 5,55,250 క్యూసెక్కలుగా ఉందని అధికారులు ప్రకటించారు.
సీఎం ఇంటి ఆవరణలోకి నీరు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటి ఆవరణలోకి వరదనీరు వచ్చింది. సీఎం ఇల్లు కృష్ణా తీరాన్ని ఆనుకుని ఉండటం వల్ల నీరు వచ్చింది. మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. కరకట్టకు లోపల భాగంలో నిర్మించిన పలు భవనాలు, పొలాలు నీట మునిగాయి.
Read More
Next Story