
సింగపూర్ తెలుగు డయాస్పోరాకు అనూహ్య స్పందన
భారీగా తరలి వచ్చిన తెలుగు ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ కళాశాలలు వందల సంఖ్యలో ఏర్పడ్డాయని, కేవలం మూడేళ్లల్లోనే 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పడ్డాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సింగపూర్ సహా సమీపంలోని 5 దేశాల నుంచి పెద్దసంఖ్యలో తెలుగు ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు తరలివచ్చారు.
సీఎం చంద్రబాబు రాకకు ముందే తెలుగువారితో ఆడిటోరియం నిండిపోయింది. ప్రధాన ఆడిటోరియం నిండి పోవడంతో అనుబంధంగా ఉన్న ఆడిటోరియంలోకి సభికుల తరలించారు. ఐదు గంటల పాటు అత్యంత ఉత్సాహభరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం సాగింది. భార్యాపిల్లలు, స్నేహితులతో ఎన్‌ఆర్‌ఐలు కలిసి వచ్చారు. కార్యక్రమం అనంతరం దాదాపు 2,500 మందితో సీఎం చంద్రబాబు ఫోటో సెషన్ నిర్వహించారు. రెండున్నర గంటలపాటు సీఎం చంద్రబాబు ఓపిగ్గా నిలబడి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. వేదికపైనే ఉండి ప్రతి కుటుంబం ఫోటోలు దిగేలా మంత్రి నారా లోకేష్ సహకరించారు.పిల్లలతో తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి హాజరైన మహిళలను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.