హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో...
x

హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో...

తొందరలో నిర్మించబోయే అండర్ గ్రౌండ్ మెట్రో లైను మాత్రం 6.42 కిలోమీటర్లుండబోతోంది.


మెట్రోలో ప్రయాణిస్తున్న వారికి తొందరలోనే మరో సరికొత్త అనుభూతి అనుభవంలోకి రాబోతోంది. విషయం ఏమిటంటే నాగోల్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు 33. 1 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. రెండో దశ పనుల్లో నాగోలు నుండి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవ్ పల్లి, జల్ పల్లి, పీ 7 రోడ్డు మీదుగా మెట్రో శంషాబాద్ చేరుకుంటుంది. ఇపుడు హైదరాబాద్ లోని రూట్లలో తిరుగుతున్న మెట్రో ఆకాశమార్గంలో (ఎలివేటెడ్ క్యారిడార్) మాత్రమే ప్రయాణం చేస్తోంది.

రెండో దశలో ఏర్పాటు చేయబోయే మెట్రో రూటులో మూడు పద్దతుల్లో మెట్రో లైనులు వేయబోతున్నారు. అవేమిటంటే మొదటిది ఎలివేటెడ్ క్యారిడార్, రెండో మార్గం ఏమిటంటే భూమీద ప్రయాణం చేయటం. అంటే ఇపుడు మిగిలిన రైళ్ళు నడుస్తున్నట్లే నడవటం అన్నమాట. ఇక మూడో మార్గం ఏమిటంటే అండర్ గ్రౌండ్ (భూగర్భం). భూమి మీద మెట్రో నడవటం అన్నది మామూలే. ఇందులో ప్రయాణీకులకు కొత్తదనం ఏముంటుంది ? అయితే చివరి మార్గం భూగర్భం(అండర్ గ్రౌండ్)లో ప్రయాణం చేయటం మాత్రం కచ్చితంగా సరికొత్త అనుభూతిని ఇస్తుందనటంలో ఎలాంటి సందేహంలేదు.

ఎందుకంటే భూగర్భంలో రైలు లైన్లు వేయటం, రైళ్ళు ప్రయాణించటం హైదరాబాద్ వాసులకు కొత్తనే చెప్పాలి. ఇప్పటివరకు కొండప్రాంతాల్లో ఎక్కడైనా టన్నెల్స్ లో ప్రయాణం చేయటమే ప్రయాణీకులకు తెలిసింది. ఆ ప్రయాణం మహాయితే ఒకటి రెండు నిముషాలకన్నా ఉండదు. కాని తొందరలో నిర్మించబోయే అండర్ గ్రౌండ్ మెట్రో లైను మాత్రం 6.42 కిలోమీటర్లుండబోతోంది. నాగోల్ నుండి లక్ష్మీగూడ వరకు నిర్మించబోతున్న 21.4 కిలోమీటర్ల మార్గం ఇపుడున్నట్లే ఎలివేటెడ్ క్యారిడార్ గా ఉంటుంది. అలాగే లక్ష్మీగూడ నుండి పీ 7 రోడ్డు శంషాబాద్ దగ్గర వరకు 5.28 కిలోమీటర్లు భూమి మీదే లైనులు వేస్తారు. ఇక మూడో మార్గం శంషాబాద్ దగ్గర నుండి విమానాశ్రయం టెర్నినల్ వరకు 6.42 కిలోమీటర్లను భూగర్భంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మార్గంలో కార్గో, టెర్మినల్, ఏరోసిటీ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడే మెట్రో డిపోను కూడా ఏర్పాటు అవబోతోంది. ఇప్పటికి ముంబైలో మాత్రమే అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది. తొందరలోనే ఉత్తర ప్రదేశ్ లో పరుగులు పెట్టబోతోంది.

నాగోలు నుండి శంషాబాద్ మధ్య ఉన్న దూరంలో ప్రతి కిలోమీటరన్నరకు ఒక స్టేషన్ నిర్మించబోతున్నారు. అంటే సుమారు 22 స్టేషన్లు రాబోతున్నాయి. వీటిల్లో కొన్నింటిని ఫ్యూచర్ స్టేషన్లుగా నిర్మించబోతున్నారు. నాగోల్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, మైలార్ దేవ్ పల్లి స్టేషన్లో ఇంటర్ ఛేంజ్ స్టేషన్లు రాబోతున్నాయి. నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం అవసరమైతే డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)లో మార్పులు జరిగే అవకాశముంది. మొత్తం మీద భూగర్భంలో 6.42 కిలోమీటర్ల ప్రయాణం ప్రయాణీకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందనటంలో అనుమానం అక్కర్లేదు.

Read More
Next Story