
నియంత్రణ లేని వాహనాలు..గాలిలో కలుస్తున్న ప్రాణాలు
మొన్న ఏపీలో..నేడు తెలంగాణలో రెండు భారీ ప్రమాదాలలో 40 మంది ప్రయాణికులు ప్రాణాలు పొగొట్టుకున్నారు.
సోమవారం తెల్లవారుజామున చేవెళ్లలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం, గత నెలలో కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ రెండూ మేజర్ ప్రమాదాలే. ఈ రెండు ప్రమాదాలలో 40 మంది ప్రయాణికులు మరణించారు. సంతోషంగా గమ్యస్థానాలకు చేరుతామనే ఆశతో బస్సు ఎక్కిన ప్రయాణికుల ప్రాణాలు గమ్య స్థానం చేరక ముందే మధ్యలోనే గాలిలో కలిసిపోయాయి. వారి కుటుంబాలలో తీర శోకాన్ని నింపాయి.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూర్ డిపో నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సు (టీఎస్ 34 టీఏ 6354)పై గ్రావెల్ లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ టూ-వీలర్‌ను అధిగమించాలని వేగంగా వెళ్తూ కంట్రోల్ కోల్పోయి, తప్పుదారిపైకి వచ్చి బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, వారిలో ఒక మహిళ, ఆమె మూడు నెలల శిశువు కూడా ఉన్నారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద స్థలంలో గ్రావెల్ లోడు బస్సు మీద పడిపోవడంతో అనేక మంది చిక్కుకుని మరణించారు. స్థానికులు, పోలీసులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది తక్షణమే రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. మూడు జెసీబీలతో శిధిలాలను తొలగించి, గాయపడినవారిని చేవెళ్ల ఏరియా హాస్పిటల్, హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం వల్ల రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపైన స్పందించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ఎగ్జ్‌గ్రేషియా ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి, చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణరావు, డీజీపీ బి.శివదర్ రెడ్డిని స్థలానికి పంపి రిలీఫ్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడినవారిని హైదరాబాద్‌కు మార్చి మెరుగైన చికిత్స అందించాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కుటుంబాలకు సమాచారం అందించాలని సూచించారు. ఐటీ, పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్ బాబు డిటెయిల్డ్ రిపోర్ట్ కోరారు. ట్రాన్స్‌పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థలానికి చేరుకుని రెస్క్యూ పనులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామంలో గత నెల 24న రాత్రి 3:30 గంటల సమయంలో జరిగిన బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలలో తీరని విషాదం నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ స్లీపర్ బస్సు (44 మంది ప్రయాణికులతో) ఎన్‌హెచ్ 44పై పడివున్న మోటార్‌సైకిల్‌ను ఢీ కొట్టుకొట్టడంతో ఫ్యూయల్ పైప్ పగిలి డీజిల్ లీక్ అవడంతో చెలరేగిన మంటలకు ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చాలా మంది నిద్రలోనే మరణించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ప్రకటించారు. డీఎన్ పరీక్షలు నిర్వహించి శవాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ రెండు ప్రమాదాలు రోడ్డు భద్రత, వాహన నియంత్రణలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

