రెండు జంటలను కలిపిన జేసీబీ
x

రెండు జంటలను కలిపిన జేసీబీ

మొంథా తుపాను వరదలకు ఎదురొడ్డి జేసీబీలో పెళ్లి కూతర్లను తరలించారు.


ఆంధ్రప్రదేశ్ ను గడగడలాడించిన మొంథా తుపాను నాలుగు కుటుంబాలకైతే చుక్కలు చూపించింది. సరిగ్గా వివాహ సమయంలో ముసురు పట్టడంతో పెళ్లిళ్లు జరుగుతాయా అని తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. ప్రకాశం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం సాదువారిపాలేలో మొంథా తుఫాను నేపథ్యంలో ముసి వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో వాగు వరద నీరు ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. ఈ దుస్థితిలో నిర్ణయించుకున్న ముహూర్తానికి వివాహాలు జరుగుతాయా అని రెండు కుటుంబాలు అని ఆందోళన చెందాయి. చివరకు అధికారులు చొరవ తీసుకుని జేసీబీల సాయంతో పెళ్లికుతుళ్లను వరదలు దాటించడంతో వివాహాలు విజయవంతంగా జరుపుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు, బందుమిత్రులు ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగిందంటే..

గురువారం ఉదయం 10 గంటలకు చినగంజాంలో అద్దంకి శ్రీనివాసులు, విజయల కుమార్తె దుర్గ వివాహం జరగాల్సి ఉంది. అదే గ్రామానికి చెందిన ఆత్మకూరి వెంకటేశ్వర్లు, అరుణ దంపతుల కుమార్తె అంజలి వివాహం సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ వరాహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు సుధాకర్‌తో జరగాల్సి ఉంది. కానీ బుధవారం సాయంత్రం నుంచి ముసి వాగు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామస్తులు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఒక వైపు ముంథా తుపాను వల్ల కురుస్తున్న వర్షాలు, మరో వైపు ముహూర్తాల సమయం దగ్గరపడుతుండటంతో రెండు కుటుంబాలకు దిక్కుతోచలేదు. ఏమి చేయాలో అర్థం కాక రెండు కుటుంబాలు అధికారులను ఆశ్రయించారు. సమస్య వివరించారు. స్పందించిన జరుగుమల్లి మండల అధికారులు, పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టారు. ఎలాగైనా వివాహాలు జరిపించి కుటుంబాలను కలపాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం మంచి ప్లాన్ వేశారు. జేసీబీలతో పెళ్లికుతుళ్లను, కుటుంబ సభ్యులను వరదలు దాటించి ముహూర్తాలకు అందించారు. దీంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. సంతోషంగా రెండు పెళ్లిళ్లు జరుపుకున్నారు. మరో వైపు నిండు మనసుతో పోలీసులు, అధికారులు చూపిన చొరవకు రెండు కుటుంబాలు చేతులెత్తి మొక్కారు. ఆపద కాలంలో ఆదుకున్న అధికారులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read More
Next Story