కవిత కొత్తపార్టీ ఖాయమేనా ? రెండు పేర్లు ఇవేనా ?
x
Kalvankuntla Kavitha

కవిత కొత్తపార్టీ ఖాయమేనా ? రెండు పేర్లు ఇవేనా ?

అమెరికా నుండి తిరిగొచ్చిన తర్వాత కవిత ఇంట్లో జరుగుతున్న హడావుడి కూడా కొత్తపార్టీ ఏర్పాటు సంకేతాలనే ఇస్తోంది.


కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా ? రెండు పేర్లను పరిశీలిస్తున్నారా ? అంటే కవిత సన్నిహితవర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీతో కవితకు మధ్య గ్యాప్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. గ్యాప్ కారణంగానే కవిత సడన్ గా బీసీ నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. బీసీ సమస్యల మీద తానుమాత్రమే పోరాటాలు చేస్తున్నాను అన్న కలరింగ్ ఇస్తున్నారు. అధికారంలో ఉన్న పదేళ్ళల్లో ఏరోజూ బీసీల సమస్యలగురించి మాట్లాడని కవిత(Kavitha Kalvakuntla) ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి బీసీల సమస్యలపై గురించి ఒకటే ఊదరగొడుతున్నారు. ఇందులో భాగంగానే కొన్ని బీసీ సంఘాల నేతలతో కవిత తరచూ సమావేశాలవుతున్నారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో పార్టీతో సంబంధంలేకుండా కవిత సొంతంగా బీసీల సంఘాల నేతలతో సమావేశాలు అవటం పార్టీ అధినేత కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు ఏమాత్రం నచ్చలేదని సమాచారం. అయితే కవిత దూకుడుపై ఇద్దరు కూడా ఏమీ మాట్లాడకుండా జరుగుతున్నది చూస్తున్నారంతే.

ఈనేపధ్యంలోనే మేడే రోజున జరిగిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతు ‘భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాంకాని సామాజికతెలంగాణను సాధించుకోలేద’ని కామెంట్ చేశారు. సామాజికతెలంగాణ సాధించుకోలేదన్న కవిత కామెంట్ డైరెక్టుగా కేసీఆర్ కు గట్టిగా తగిలింది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేసీఆర్ కాబట్టే. కేసీఆర్ పాలనలో సామాజిక తెలంగాణ ఏర్పడలేదని పరోక్షంగా తండ్రిపాలననే కవిత తప్పుపట్టినట్లయ్యింది. సామాజికతెలంగాణపై కవిత మాట్లాడగానే కాంగ్రెస్, బీజేపీల నేతలు వెంటనే కేసీఆర్ ఫెయిల్యూర్ అంటు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు. దాంతో బీఆర్ఎస్ కొద్దిరోజులు పూర్తిగా డిఫెన్సులో పడిపోయింది. సామాజికతెలంగాణ సాధించుకోలేకపోయామని స్వయంగా కవితే చెప్పటంతో సమాధానం చెప్పలేక సోదరుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలపట్టుకున్నారు. దీంతోనే కేసీఆర్, కేటీఆర్ కు కవితపై మొదటిసారి బాగామండింది.

కవితకూడా బహిరంగంగా ఎందుకు మాట్లాడాల్సొచ్చిందంటే నేరుగా కలిసి మాట్లాడటానికి కవితకు కేసీఆర్ అవకాశం ఇవ్వలేదుకాబట్టే అని ఆమె సన్నిహితవర్గాలు చెప్పాయి. కారణం ఏదైనా అప్పటినుండి పార్టీతో కవిత గ్యాప్ బాగా పెరిగిపోయి చివరకు కేసీఆర్ ను తప్పుపడుతు లేఖ రాసేంతగా సంబంధాలు క్షీణించాయి. తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతు తండ్రికి లేఖ రాయటం ఇదే మొదటిసారి కాదని గతంలో కూడా చాలా లేఖలు రాసినట్లు చెప్పారు. అంటే కవిత ఎన్నిలేఖలు రాసినా కేసీఆర్ పట్టించుకోలేదా అనే అనుమానాలు పార్టీ నేతల్లో పెరిగిపోతోంది. తనను తండ్రి దూరంపెడుతున్నారని, పార్టీపై కేటీఆర్ ఆధిపత్యం పూర్తిగా ఉందన్న కోపం కవితలో పెరిగిపోతోందని సమాచారం. అందుకనే తన లేఖ లీక్ సందర్భంగా మాట్లాడుతు ‘కేసీఆర్ దేవుడే కాని ఆయన చుట్టూ కోటరితో పాటు దెయ్యాలు కూడా ఉన్నాయ’ని ఘాటుగా వ్యాఖ్యానించింది. తన తండ్రికి రాసిన లేఖ ఎలా లీకయ్యిందన్న కవిత ప్రశ్నలోనే కేటీఆరే లీక్ చేయించుకుంటాడు అన్న అనుమానం కూడా కనబడుతోంది. అందుకనే బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna), మంత్రి ధనసరి సీతక్క(Minister Seethakka)లు మీడియాతో మాట్లాడుతు ‘తాను తండ్రికి రాసిన లేఖ లీక్ అవటంలో కేటీఆర్ పాత్రుందని కవిత అనుమానిస్తున్నారా’ అని నిలదీశారు. ‘కవిత ప్రస్తావించిన దెయ్యాలు అంటే కేటీఆర్ ను ఉద్దేశించేనా’ అని అనుమానించారు.

ఇలాంటి నేపధ్యంలోనే పార్టీలో కవిత ఎక్కువకాలం ఉండే అవకాశాలు లేవని పార్టీ నేతల్లోనే చర్చజరుగుతోంది. అందుకనే తొందరలోనే సొంతంగా పార్టీ పెట్టుకోవాలని కవిత ఆలోచిస్తున్నట్లు ఆమె సన్నిహితవర్గాలు చెబుతున్నారు. అమెరికా నుండి తిరిగొచ్చిన తర్వాత కవిత ఇంట్లో జరుగుతున్న హడావుడి కూడా కొత్తపార్టీ ఏర్పాటు సంకేతాలనే ఇస్తోంది. భర్త తాలూకు బంధువులు, జాగృతిసంస్ధ నేతలు, బీసీ సంఘాల్లోని నేతలు కవితతో సుదీర్ఘభేటీ జరుపుతున్నారు. వివిధ నియోజకవర్గాల్లోని నేతలు హైదరాబాద్ వచ్చి కవితను ఇంట్లో కలుస్తుండటంతో కొత్తపార్టీ ఏర్పాటు ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేయకతప్పని పరిస్ధితులు ఎదురైతే కొత్తపార్టీ పేరు ఏమి పెడితే బాగుంటుందనే చర్చలు కూడా కవిత భేటీలో జరిగాయని తెలిసింది. కొందరేమో ‘తెలంగాణ జాగృతి’ అని పెడితే బాగుంటుందని సూచించారు. ఎందుకంటే పదేళ్ళుగా జాగృతి పేరుతో కవిత కార్యక్రమాలను నిర్వహించారు కాబట్టి ఆ పేరు జనాల్లో బాగా పాపులరైందని కొందరు చెప్పారు. ఇదేసమయంలో బీసీ సంఘాల నేతలు మాట్లాడుతు తెలంగాణబహుజనరాష్ట్రసమితి(టీబీఆర్ఎస్) అని పేరుపెడితే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. కాకపోతే ఈపేరు బీఆర్ఎస్ ను పోలుందనే చర్చకూడా జరిగింది. ఏదేమైనా కవిత కొత్తపార్టీ పెట్టడం ఖాయమనే ప్రచారంతో పాటు పై రెండుపేర్లు బాగా ప్రచారం అవుతున్నాయి. చివరకు కవిత ఏమిచేస్తారో చూడాల్సిందే.

Read More
Next Story