వైసీపీకి మరో ఇద్దరు నేతలు గుడ్‌బై.. ఎవరంటే..
x

వైసీపీకి మరో ఇద్దరు నేతలు గుడ్‌బై.. ఎవరంటే..

వైసీపీ పార్టీకి వరుస ఝలక్‌లు తప్పట్లేదు. బీద మస్తాన్ రావు, మోపీదేవి వెంకటరమణ తమ ఎంపీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనమా చేశారు.


వైసీపీ పార్టీకి వరుస ఝలక్‌లు తప్పట్లేదు. బీద మస్తాన్ రావు, మోపీదేవి వెంకటరమణ తమ ఎంపీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనమా చేశారు. షాక్‌ నుంచి కోలుకముందే వైసీపీ అధిష్టానానికి ఇద్దరు ఎమ్మెల్సీలు ఏకకాలంలో షాకిచ్చారు. దీంతో ఎంపీలే కాకుండా ఎమ్మెల్సీలు కూడా వైసీపీని ఖాళీ చేయడానికి పూనుకున్నారా అన్న అనుమానాలు అధికం అవుతున్నాయి. తొలుత ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతున్నప్పుడే పార్టీలో కాస్తంత ఆందోళన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఒకేసారి ఇద్దరి చొప్పున పార్టీకి రాజీనామాలు చేస్తుండటం కీలకంగా మారింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను శాసనమండలి ఛైర్మన్‌కు అందించారు. అంతేకాకుండా తమ రాజీనామాలకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు.

వారి రాజకీయ ప్రస్థానం..

పద్మశ్రీ.. జాతీయ, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి మహిళా అధ్యక్షురాలుగా ఆమె వైసీపీ పార్టీలో చేరారు. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవిని అందిపుచ్చుకున్నారు. ఇక కల్యాణ్ చక్రవర్తి విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు. సెప్టెంబర్ 2020లో దుర్గాప్రసాద్.. గుండెపోటుతో మరణించారు. ఆయన మరణానంతరం కల్యాణ్.. తన రాజకీయ అరంగేట్రం చేశారు. 2021లో ఎమ్మెల్యేల కోటాలో వైసీపీ అదిష్టానం కల్యాణ్‌కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. వీరు ఎమ్మెల్సీలుగా పదవులు చేపట్టి కూడా ఎక్కువ కాలంకావడం లేదు. ఇంతలోనే వారు రాజీనామా చేయడం కీలకంగా మారింది. వారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది హాట్ టాపిక్‌గా మారింది.

మరో ఇద్దరు ఎంపీలు క్లారిటీ..

మోపీదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామాలతో ఇతర ఎంపీలు కూడా వైసీపీని వీడే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం ఏపీలో జోరందుకుంది. ఈ క్రమంలో తమ పార్టీ మార్పుపై వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పష్టతనిచ్చారు. ఏపీలో వైసీపీ ఎంపీలకు సంబంధించి దుష్ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు. తాము వైఎస్ జగన్ వెంటే ఉంటామని, తాము పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ ఆవిర్భావం రోజు నుంచి జగన్‌తోనే ఉన్నానని, జగన్ తనను ఎంతో ప్రోత్సహించారని, నమ్మారని చెప్పారు. అలాంటి జగన్‌ను వదిలే ఆలోచన కూడా తనకు లేదని స్పష్టం చేశారు.

‘‘మేమిద్దరం వైసీపీ వీడనున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఊహజనితాలే. వాటిలో ఒక్క ముక్క కూడా వాస్తవం లేదు. ఆ వార్తలన్నింటిని ఖండిస్తున్నాం. మేము పార్టీ చెప్పిన, ఇచ్చిన బాధ్యతలను నిబద్దతతో నిర్వర్తిస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నడపటం చాలా కష్టమైన పని. మేము అధికారం కోసం పార్టీలు మారే నాయకులం కాదు’’ అని అన్నారు.

Read More
Next Story