
Ananta Babu, Driver Subramanyam
ఇద్దరూ దళితులే..అటు పాస్టర్ ప్రవీణ్.. ఇటు సుబ్రమణ్యం..!
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ దళితుల చుట్టూ రాజకీయాలు మొదలయ్యాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు సుడులు తిరుగుతున్న దశలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు తెరపైకి వచ్చింది
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ దళితుల చుట్టూ రాజకీయాలు మొదలయ్యాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు సుడులు తిరుగుతున్న దశలోనే ఇప్పుడు అదే తూర్పుగోదావరి జిల్లాలో దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసు పునర్విచారణకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశించారు. విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి, కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్‌ను నియమిస్తూ ఏప్రిల్ 22న ఉత్తర్వులు జారీ అయిన రోజే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు.
విచారణ నివేదికను 60 రోజుల్లో జిల్లా ఎస్పీకి, డీజీపీకి అందజేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. అవసరమైతే సంబంధిత న్యాయస్థానంలో అనుమతి పొందిన తర్వాత దర్యాప్తు చేపట్టి అదనపు ఛార్జిషీటును కోర్టులో దాఖలు చేయాలని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే...
2022 మే 19న రాత్రి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారు. ఆయన మృత దేహాన్ని ఆ ఎమ్మెల్సీ కారులోనే ఇంటికి పంపారు. ఈ ఘటన సంచలనం రేపింది.
హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించినట్టు అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రకటించారు. అనంతబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపారు. ఆ తర్వాత అనంతబాబు మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆయన రెండేళ్లుగా బయటే ఉన్నారు.
ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపి, ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని సుబ్రమణ్యం కుటుంబం కోరుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక బాధిత కుటుంబానికి పరిహారం అందజేయడంతో పాటు న్యాయ సలహాలకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును నియమించారు. ఇప్పుడు కేసు పునర్విచారణ బాధ్యత ఐపీఎస్ అధికారికి అప్పగించడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి.
ఏబీ వెంకటేశ్వరరావు ఎందుకు కలిశారు?
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఆరోపణలు, వేధింపులు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆకస్మాత్తుగా ఈ కేసుపై దృష్టి సారించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడలో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణను సోమవారం వెంకటేశ్వరరావు కలిసి మాట్లాడారు. ఆ తర్వాత ఎస్సీ బిందు మాధవ్ నుంచి పునర్ విచారణ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం.
దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని కాకినాడలో హత్య చేసి, డోర్ డెలివరీ చేయడం..జగన్ ప్రభుత్వంలో జరిగిన అత్యంత నీచమైన, అమానవీయమైన ఘటనల్లో ఒకటని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ హత్యానేరంలో ఎమ్మెల్సీ అనంతబాబును రక్షించడానికి అప్పటి ప్రభుత్వ వ్యవస్థలు ఎన్నో అడ్డదారులు తొక్కాయని ఆరోపించారు. హత్య జరిగి మూడేళ్లవగా.. ప్రభుత్వం మారి 10 నెలలైందని.. ఇప్పటికీ న్యాయం జరగలేదంటే వ్యవస్థ మొద్దు నిద్రపోతోందా ? ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా అని ప్రశ్నించారు. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుని హత్యకేసును ప్రత్యేక బృందంతో మళ్లీ మొదటి నుంచి దర్యాప్తుచేయాలన్నారు.
కలెక్టర్, ఎస్పీలతో భేటీ..
ఏబీ వెంకటేశ్వరరావు సుబ్రమణ్యం తల్లిదండ్రులను కలిసిన తర్వాత కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందుమాధవ్‌లను కలిసి కేసు పునర్విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సుబ్రమణ్యం తల్లిదండ్రులు, దళిత సంఘాల నేతలతో కలిసి వినతులు ఇప్పించారు. పెదపూడి, కాకినాడల్లో వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ హత్యకేసులో పోలీసులు కోర్టులో వేసిన కాగితాలన్నీ పరిశీలించానని.. ఇంత లోపభూయిష్టమైన దర్యాప్తును తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో చూడలేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌కు, ఛార్జిషీటుకు మధ్యవర్తుల పంచనామాకు, ఎస్పీ చెప్పినదానికి సంబంధం లేదన్నారు. ఛార్జిషీటు వీగిపోయేలా, కేసు కొట్టేసేలా పోలీసులు బలంగా కేసు రాశారని విమర్శించారు.
పనిలో పనిగా వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ మంత్రి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరునూ ఈ వివాదంలోకి లాగారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోయే ఈ హత్యకేసు దర్యాప్తును సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సిట్ వేసి కేసులో అనంతబాబుతోపాటు ఎవరెవరు ఉన్నారో తేల్చాలన్నారు. అధికారుల వల్ల కాకపోతే.. ప్రభుత్వ పెద్దలను కలుస్తానని..అవసరమైతే ఆందోళన చేయడానికీ సిద్ధమేనని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేడ్కర్) రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్, ప్రజాసంఘాల నాయకులు కూడా ఏబీ వెంకటేశ్వరరావు వెంట ఉన్నారు.
పాస్టర్ ప్రవీణ్ కేసు తెరపైకి వచ్చిన నేపథ్యంలో...
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై రాష్ట్రంలో వివాదం జరుగుతోంది. ఆయనది హత్య అని కొందరు, రోడ్డు ప్రమాదమని మరికొందరు పరస్పరం ఆరోపించుకుంటున్న దశలో సుబ్రమణ్యం కేసు తెరపైకి వచ్చింది. మొత్తం అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలూ రెండూ దళితుల చుట్టూ రాజకీయాలు నడుపుతున్నాయి.
కారంచేడు, చుండూరు, పాదిరికుప్పం వంటి ఘటనల తర్వాత చాలా కాలానికి దళితుల చుట్టూ రాజకీయాలు తిరగడం మొదలైంది. ఇది ఎక్కడ ఆగుతుందో చూడాలని పాస్టర్ శౌరయ్య అన్నారు. ఈ రాజకీయాలు ఎలా ఉన్నా బాధితులకు న్యాయం జరిగితే అంతకన్నా మేలు మరొకటి ఉండదన్నారు ఆయన.
Next Story