లక్షకు రెండున్నర లక్షలు
x

లక్షకు రెండున్నర లక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. తెలుగుదేశం వారు రెండున్నర అంటే వైఎస్సార్‌సీపీ వారు ఒకటికి కూడా ముందుకు రావడం లేదు.


ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములపై ఈ సారి బెట్టింగ్‌ రూట్‌ మారింది. ఎన్నడు లేని విధంగా ఈ సారి బెట్టింగ్‌ల తీరు మారడమే అటు రాజకీయ వర్గాల్లోను, ఇటు బెట్టింగ్‌ రాయుళ్లలోనూ ఆసక్తికర చర్చగా మారింది. సహజంగా బెట్టింగ్‌లు అనగానే సరి సమానంగా అమౌంట్‌ను ఎంచుకుంటారు. ఇవతలి వ్యక్తి ఎంత మొత్తం బెట్టింగ్‌ కాస్తున్నాడో అంతే మొత్తాన్ని అవతలి వ్యక్తి కూడా బెట్టింగ్‌ కాస్తాడు. అది వేలు కావచ్చు లేదా లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు. కానీ ఈ సారి ఎన్నికల బెట్టింగ్‌ల్లో సీన్‌ రివర్స్‌ అయింది. లక్షకు రెండున్నర లక్షలు ఇస్తామంటూ బెట్టింగ్‌ రాయళ్లకు సవాలు విసురుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక చర్చ సాగింది. అదేంటంటే..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సుమారు 1.50కోట్ల కుటుంబాలకు సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక సహాయం అందించిందని, సాయం అందుకున్న వారిలో కనీసం కోటి కుటుంబాలు ఓట్లేసినా 1:1 ప్రకారం వేసుకున్నా 2 కోట్ల ఓట్లు ఈజీగా వస్తాయని, తమ పార్టీ గెలుపునకు తిరుగుండదనే అభిప్రాయంలో ఉన్నారు. అయితే ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడక్కడా కొంత మంది నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఫలితాలు రివర్స్‌గేర్‌లో కనిపించాయి. దీంతో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఓటమి ఖాయమని భావించిన కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా భూములు, ఆస్తులు తాకట్టు పెట్టి పందేలకు దిగుతున్నారు. అలాగే నియోజక వర్గాల వారీగా కూడా పందేలకు సై అంటున్నారు. అందులోను పందెం చెరి సగం కాకుండా ఒకటికి రెండున్నర ఇస్తామనడంతో వైఎస్‌ఆర్‌సీపీ తరపున పందెపు రాయళ్లలో వణుకు మొదలైంది. మా నాయకుడు మనమే గెలుస్తామన్నాడు. నేరుగా సర్వే సంస్థ ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లి వాళ్లను అభినందించి మీరు ఊహించిన దాని కంటే మనం ఎక్కువ సీట్లల్లో గెలవబోతున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అంటూ వారికి భరోసా ఇవ్వడమే కాకుండా అక్కడ నుంచి రాష్ట్ర ప్రజలకు కూడా వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయమనే సందేశాన్ని ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌. దీంతో పందెపు రాయళ్లు మా జగనన్నకు తిరుగు లేదంటూ పందేలు కాసేందుకు రెడీ అయ్యారు. ఏ నియోజక వర్గంపైన పందెం కాస్తున్నారో ఆ నియోజక వర్గంలో పోలింగ్‌ స్టేషన్‌ల వారీగా పోలైన ఓట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చి ఉంటాయనే వివరాలు పార్టీ పోలింగ్‌ ఏజెంట్ల ద్వారా సేకరించారు. వారి నుంచి బెట్టింగ్‌ రాయుళ్లకు అనుకున్న మేర ఆశావాహ సమాచారం రాకపోవడంతో వెనుకంజ వేస్తున్నారు.
ఇంతకు మునుపు ఎన్నడు ఇలాంటి పరిస్థితి లేదు. ప్రతి నియోజక వర్గంలోను టైట్‌ ఫైట్‌ అనే మాట తప్ప ఖచ్చితంగా వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందనే మాట వేళ్ల మీద లెక్కబెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. నూటికి నూరు శాతం గెలుపు మాదే అనుకున్న వైఎస్‌ఆర్‌సీపీకి రాయలసీమలోను అనుకున్న స్థాయిలో ఆశాజనకంగా లేదనే విషయం బెట్టింగ్‌ రాయుళ్లకు అర్థమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా నియోజక వర్గాల్లో గెలుపు ఓటములపై కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తుందనే విషయంలో కానీ తెలుగు తమ్ముళ్లు పెడుతున్న బెట్టింగ్‌లకు వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లు కాస్త వెనుకంజ వేస్తున్నారు. పైగా ఈ పందెం కూడా ఒకటికి ఒకటిన్నర రెట్లు డబ్బు ఇస్తామని పందేలు ఖాయడం ద్వారా వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు మైండ్‌ బ్లాకై ఈ పరిస్థితులు ఏంటి? ఎందుకు టీడీపీ వాళ్లు అంత ధీమాగా ఉన్నారు? ఈ బెట్టింగ్‌లు మనకు అవసరమా అనే ఆలోచనలో పడ్డారు. రాయలసీమలోనే కాదు, కోస్తా, ఉత్తరాంధ్ర అన్నీ జిల్లాలోను ఇదే పరిస్థితి.
ఉదాహరణకు గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్‌ నియోజక వర్గంపై పందేలు కాసేందుకు వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అలాగే గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థుల గెలుపుపైనా టీడీపీ తరుపున లక్షల్లో పందేలు కాసేందుకు రెడీగా ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందని పందెం ఖాయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. విశాఖ నగరంలో పార్లమెంట్‌లో టీడీపీ గెలుస్తుందని సొంత పొలాలను సైతం బెట్టింగ్‌లో పెట్టారు. గెలిస్తే ఆ భూములు దక్కించు కుంటాడు. ఓడితే ఆ భూములు ఎదుటి వారికి రాసిస్తాడు. ఇది పెద్ద మనుషుల మధ్య రాసుకున్న ఒప్పందం. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో తెలుగుదేశం వారిని కదిలిస్తే మా గెలుపు ఖాయమని ధీమాగా అంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లను కదిలిస్తే టైట్‌ అండ్‌ ఫైట్‌ అంటున్నారు. గెలుపు ఖాయమనే వారికి, టైట్‌ అండ్‌ ఫైట్‌ అనే వారికి ఓటర్లు ఏ విధంగా జర్క్‌ ఇచ్చారో జూన్‌ 4న తేలుతుంది.


Read More
Next Story