ఏపీని ’గ్రోత్ ఇంజన్‘ గా మార్చండి
x

ఏపీని ’గ్రోత్ ఇంజన్‘ గా మార్చండి

సాస్కీ (SASKI) కింద రూ. 10,054 కోట్ల నిధులు కావాలని, పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు కేంద్రం చేయూత ఇవ్వాలని నిర్మలా సీతారామన్ ని సీఎం కోరారు.


దేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక శక్తివంతమైన 'గ్రోత్ ఇంజన్'గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, నిధుల విడుదలపై సుదీర్ఘంగా చర్చించి విజ్ఞాపన పత్రాలను అందజేశారు.

పూర్వోదయ పథకంతో ఏపీ సమగ్ర అభివృద్ధి

దేశ తూర్పు తీర రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం తెచ్చిన 'పూర్వోదయ' పథకంలో ఏపీకి పెద్దపీట వేయాలని సీఎం కోరారు. పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించేలా వెసులుబాటు ఇవ్వాలని విన్నవించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, సాగునీటి వ్యవస్థలను ఆధునీకరించవచ్చని, తద్వారా వికసిత్ భారత్ లక్ష్యానికి ఏపీ చోదక శక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సాస్కీ (SASKI) కింద రూ. 10,054 కోట్ల నిధులు

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి 'సాస్కీ' పథకం ఎంతో కీలకమని సీఎం తెలిపారు. విశాఖలో యూనిటీ మాల్, రాజమండ్రి వద్ద హావ్‌లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణం, గండికోట పర్యాటక ప్రాజెక్టు, వర్కింగ్ విమెన్ హాస్టళ్ల పూర్తికి నిధులు విడుదల చేయాలని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ పనుల కోసం రూ. 10,054 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల్లోని ఉద్యానవన పంటలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్యాకేజీని సీఎం ప్రతిపాదించారు. స్తుతం ఉన్న 8.48 లక్షల హెక్టార్ల సాగును 2029 నాటికి 12.28 లక్షల హెక్టార్లకు పెంచడం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుతో రైతుల వార్షికాదాయం రూ. 2 లక్షల నుంచి రూ. 3.5 లక్షలకు పెరుగుతుందని వివరించారు. లాజిస్టిక్స్ పార్కులు, ఎయిర్ కార్గో సౌకర్యాల కోసం రాబోయే మూడేళ్లలో రూ. 41 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు

గోదావరి నదికి వచ్చే మిగులు వరద జలాల్లో 200 టీఎంసీలను కరువు ప్రాంతాలకు మళ్లించేందుకు ఈ లింక్ ప్రాజెక్టు అత్యంత అవసరమని సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాల దాహార్తి తీరుతుందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అందించిన తరహాలోనే, ఈ ప్రాజెక్టుకు కూడా కేంద్రం రుణ సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే 'జలహారతి కార్పొరేషన్' ఏర్పాటు చేశామని, త్వరలోనే డీపీఆర్ (DPR) సమర్పిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సంబంధించిన ఈ కీలక ప్రాజెక్టులకు చోటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Read More
Next Story