కొత్తరెడ్డిపాలెంలోనూ తురకపాలెం లక్షణాలు
x

కొత్తరెడ్డిపాలెంలోనూ తురకపాలెం లక్షణాలు

శనివారం చేబ్రోలు మండలంలో ఓ ఆశా వర్కర్‌ అనారోగ్య కారణాలతో మరణించడంపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


గుంటూరు జిల్లా అంతుచిక్కని మరణాలతో అట్టుడుకిపోతోంది. గుంటూరు జిల్లా తురకపాలెం అంతుచిక్కని మరణాల నుంచి ఇంకా తేరుకోక ముందే కొత్తరెడ్డిపాలెం గ్రామస్తుల జ్వరాలు కలకలం రేపుతున్నాయి. దీంతో కొత్తరెడ్డిపాలెం గ్రామస్తులు భయాందోళనలతో వణికి పోతుతున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన ఓ వ్యక్తిలో తురకపాలెంలో మాదిరిగా మెలియోయిడోసిస్‌ అనుమానిత లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఈ గ్రామానికి చెందిన 9 మంది జ్వరాల బారిన పడ్డారు. వీరికి రక్త పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందిలో ఐదుగురుకి నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. తక్కిన నలుగురికి సంబంధించిన రిపోర్టులో కొకొయ్‌రకం బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి. ఈ క్రమంలో ఆందోళనలు వ్యక్తం కావడంతో పూర్తి స్థాయిలో రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరో వైపు ఇదే చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన చల్లా సీతారామిరెడ్డి అనే వ్యక్తి ఫీవర్‌ బారిన పడ్డాడు. అనంతరం ఆయన గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ మృత్యువాత పడ్డాడు. ఇదిలా ఉంటే తురకపాలెం బాధితులు కూడా ఇక్కడ వైద్య చికిత్సలు పొందుతున్న క్రమంలో చల్లా సీతారామిరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఒక్క సారిగా అధికారులు, గ్రామస్తుల్లో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్తరెడ్డిపాలెం గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఈక్రమంలో కొత్తరెడ్డిపాలెం బాధితుల్లో కూడా మెలియాయిడోసిస్‌ అనుమానిత లక్షలణాలు ఉన్నాయనే అనుమానాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదిలా ఉంటే చేబ్రోలులో ఓ ఆశా వర్కర్‌ అనారోగ్యంతో మరణించడంపైనా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 45 ఏళ్ల వయసు కలిగిన సులోచన అనే చేబ్రోలుకు చెందిన ఆశా వర్కర్‌ శుక్రవారం అంటే ఈ నెల 12న జ్వరం, ఉబ్బసం లక్షణాలతో మరణించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆమె కూడా తురకపాలెం బాధితుల లక్షణాలతోనే మరణించి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించే పనికి వైద్య అధికారులు ఉపక్రమించారు. కొత్తరెడ్డిపాలెం మరణాలను సీరియస్‌గా తీసుకున్న వైద్య అధికారులు అక్కడ కూడా వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే తురకపాలెంలో మాదిరిగానే కొత్తరెడ్డిపాలెంలో పారిశుధ్యం సరిగా లేదు. పారిశుధ్య నిర్వహణలో సమస్యలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.

Read More
Next Story