
స్మశానంగా తురకపాలెం, పిట్టల్లా రాలుతున్న గ్రామస్తులు!
జూలై, ఆగస్టు రెండు నెలల్లో 20 మంది వ్యక్తులు మరణించారు. ఎందుకు ఇలా జరిగింది?
అది గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం పరిదిలో తురకపాలెం గ్రామం. మూడు వేల వరకు జనాభా జనాభా ఉంటుంది. ఆరు నెలల క్రితం వరకు ఎంతో హాయిగా బతికి ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు అంతుచిక్కని వ్యాధితో విలవిలలాడుతోంది. గ్రామస్తులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏ ఇంట్లో చూసినా హాహాకారాలే వినిపిస్తున్నాయి. దీంతో గ్రామం అంతా విషాదం అలుముకుంది. జలుబు, దగ్గు, జ్వరం అంటే హడలిపోతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వచ్చిందంటే అదే వారికి ఆఖరి రోజుగా మారుతుంది. వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్తున్నా వారు తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆసుపత్రుల్లోనే మృత్యువాత పడుతున్నారు.
అలా గత ఐదు నెలల్లో 30 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు మరణిస్తున్నారో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. జులై, ఆగస్టు రెండు నెలల్లో 20 మంది వరకు మృత్యువాత పడ్డారు. గత నాలుగు, ఐదు రోజుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాలశౌరి, నీలాంబరం, ఆరోగ్యమ్మలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస మరణాల మీద అటు ప్రభుత్వం కానీ, ఇటు వైద్యులు కానీ దృష్టి సారించలేదు. మరణాలకు గల కారణాలను విశ్లేషించడం కానీ, ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయని తెలుసుకోవడం కానీ చేయలేదు. తొలి నాళ్లల్లోనే నివారణ చర్యలకు ఉపక్రమించి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు. అయితే ఇలా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటంతో గుంటూరు వైద్య కళాశాల బృందం స్పందించింది. కారణాలు తెలుసుకునేందుకు గుంటూరు వైద్య కళాశాలకు చెందిన వైద్యుల బృందం తురకపాలెంకు వెళ్లింది. అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో 35 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 14 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు వైద్య బృందం గుర్తించింది. వారిలో ఒక వ్యక్తి ఇటీవల మరణించాడు.