ఇక ముందు రెండు మూడు గంటల్లోనే తిరుమల దర్శనం
తిరుమల క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే శ్రీవారిని దర్శనం చేసుకునే విధానం రూపొందించాలని తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి యోచిస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి భక్తులు వేచి ఉండేకాలాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నది. దీనికోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు (టిటిడి) నిర్ణయించింది ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నేడుజరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వివరించారు.
టీటీడీ ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలు
- ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణయం.
- టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం.
- తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను మూడు లేదా నాలుగు నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణయం.
- తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయం.
- అలిపిరిలో టూరిజం కార్పోరేషన్ ద్వారా దేవలోక్ కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం.
- తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం.
- తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం.
- శ్రీవాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశం.
- ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కు తీసుకుని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చిస్తాం.
- నిత్య అన్న ప్రసాద భవనం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయం.
- వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పోరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300/-) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం.
- తిరుమలలో గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శ్రీ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్లు టిటిడి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయం.
- బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10 శాతం పెంచాలని నిర్ణయం. తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400/-, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535/- బ్రహ్మోత్సవ బహుమానం.
- శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు, అన్న ప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ. ఈ పనులు ఉచితంగా చేయనున్న టీవీఎస్ సంస్థ.