
కరుణాకర్ రెడ్డి ఆట కట్టించాల్సిందేనంటున్న టీటీడీ
గోశాలలో గోవుల మృతిపై కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారనిటీటీడీ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పోలీసు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్ సీపీ నాయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలని టీటీడీ (TTD) యోచిస్తోంది. శ్రీ వెంకటేశ్వర (ఎస్)వీ గోశాలలో గోవుల మృతిపై కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధర్మకర్తల మండలి తరఫున టీటీడీ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని.. పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానం – ఇది కేవలం దేవస్థానం మాత్రమే కాదు. కోట్లాది మంది హిందువుల ఆధ్యాత్మిక నమ్మకానికి ప్రతీక. కానీ, ఇటీవలి కాలంలో ఇది తరచూ రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. మతం, మౌలిక సేవలు, ధార్మిక పరిపాలన అన్నీ గాలికొదిలి, వ్యక్తిగత, రాజకీయ ప్రతీకారాల రంగస్థలంగా మారుతోందన్న విమర్శలు తాజాగా తెరపైకి వచ్చాయి.
ఎస్వీ గోశాలలో వందలాది గోవులు మృత్యువాతపడ్డాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు...దానికి ప్రతిగా టీటీడీ ఛైర్మన్, ఈవోలు మీడియా సమావేశాలు పెట్టి ఖండించడం జరిగాయి.
ఈ నేపథ్యంలో భానూ ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారు. ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టాం. కరుణాకర్ రెడ్డి మాత్రం నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన ఛైర్మన్‌గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయి. వైసీపీ హయాంలో పురుగులు పట్టిన దాణాను గోవులకు పెట్టారు. గోవిందుడు, గోవులతో ఆటలు వద్దని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నాం. టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. కరుణాకర్ రెడ్డి కేసు పెట్టినట్టు చెప్పారు. టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేసిన వారికి ఎక్కడో చోట చెక్ పెట్టాల్సి ఉందన్నారు.
Next Story