
Bhanu Prakash and Bhumana
భూమనా, నీకింత కుటిలబుద్ధి తగునా? భాను ప్రకాశ్
ఎస్వీ గోశాలలో వందలాది గోవులు చనిపోయాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పై టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానూ ప్రకాశ్ రెడ్డి విరుచుకుపడ్డారు.
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై బీజేపీ, టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కరుణాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించాయి. శ్రీవెంకటేశ్వర గోశాలలో వందలాది గోవులు చనిపోయాయని, మూడు నెలల కాలంలో వందకు పైగా మూగజీవాలు కన్ను మూశాయని కరుణాకర్ రెడ్డి శుక్రవారం ఆరోపించారు. దీన్ని బీజేపీ, టీడీపీ, టీటీడీ ఖండించాయి.
టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... సోషల్ మీడియా వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఎస్వీ గోశాలపై దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు.
‘‘ఎస్వీ గోశాలలో వంద గోవులు బక్కచిక్కి, మృత్యువాత పడ్డాయని చేసిన ఆరోపణలు వాస్తవం కాదు. శ్రీవారి భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. గోశాలలో గోవులన్నీ సురక్షితంగా ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గోశాలకు వస్తే చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయ నిరుద్యోగిగా ఉన్న కరుణాకర్ రెడ్డి ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, ప్రజల్లో మాపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఐదేళ్ల వైసీపీ పాలనలో ధార్మిక క్షేత్రమైన తిరుమలను ధనార్జన క్షేత్రంగా మార్చేశారు’’ అని విమర్శించారు.
టీడీపీ చిత్తూరు జిల్లా నాయకులు సైతం ఇదే టోన్ లో విమర్శించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కరుణాకర్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు. కరుణాకర్ రెడ్డి దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
టీటీడీ కూడా కరుణాకర్ రెడ్డి ప్రకటనను ఖండించింది. టిటిడి గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని పేర్కొంది.
మృతి చెందిన గోవుల పోటోలు టిటిడి గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవుల పోటోలను టిటిడి గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తున్నారని ఖండించింది.
Next Story